
జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరంలేదు
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది
రోజూవారీ విధానంలో విచారణ జరపాలని కూడా ఆదేశాలిచ్చింది
ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు
రఘురామ పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్‌పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.
సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..
వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.
జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...
వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది.
హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్‌పై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment