అమరావతి భూకుంభకోణం: ‘గ్యాగ్‌’ ఎత్తివేత | Supreme Court Stay On High Court Orders In Amaravati Land Scam | Sakshi
Sakshi News home page

అమరావతి భూకుంభకోణం ఎఫ్‌ఐఆర్‌ వివరాలపై ‘గ్యాగ్‌’ ఎత్తివేత

Published Thu, Nov 26 2020 2:48 AM | Last Updated on Thu, Nov 26 2020 12:40 PM

Supreme Court Stay On High Court Orders In Amaravati Land Scam  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు అసాధారణ రీతిలో ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అమరావతి చుట్టూ భూముల కొనుగోళ్లు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేయడం అసాధారణ విషయం కాదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమికంగా ఏకీభవించింది. దమ్మాలపాటి తదితరులపై ఏసీబీ కేసు నమోదుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాను నియంత్రిస్తూ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తద్వారా మీడియాను నియంత్రిస్తూ ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ ఎత్తివేసినట్టయ్యింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ఆదేశించింది. అలాగే డీజీపీ, ఏసీబీ డీజీ తదితరులకు నోటీసులిచ్చింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్నప్పటికీ, ఆయనకు హైకోర్టే నోటీసు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు కూడా ఆయనకు నోటీసు అవసరం లేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను 2021 జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. ఈ లోపు.. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై తుది విచారణ జరిపి తేల్చేయవద్దని హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు గ్యాగ్‌ ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అదే రోజు పిటిషన్‌ .. అప్పుడే ఉత్తర్వులు
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ గత సెప్టెంబర్‌ 14న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా, నిర్భంధించకుండా, తనపై ఇతర కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. అలాగే హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా తనపై మరో దర్యాప్తు, విచారణ చేపట్టకుండా ఆదేశించాలని కోరారు. అంతేకాక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలోనైనా దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

మొదట ఈ పిటిషన్‌ అదే నెల 15న జస్టిస్‌ దొనాడి రమేశ్‌ ముందు విచారణకు రాగా, ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని దమ్మాలపాటి న్యాయవాది అదే రోజు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ మహేశ్వరి బెంచ్‌ ముందు ప్రస్తావించారు. దీంతో సీజే మరుసటి రోజు (16న) విచారిస్తామని తెలిపారు. మరోవైపు 15వ తేదీ ఉదయమే దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో దమ్మాలపాటి అదే రోజు సాయంత్రం అత్యవసరంగా హౌస్‌మోషన్‌ రూపంలో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ గురించి ఎలాంటి కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్‌పై సీజే జస్టిస్‌ మహేశ్వరినే స్వయంగా విచారణ జరిపారు. దానితో పాటు 14న దమ్మాలపాటి దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌పై స్టే విధించారు. తనను మాత్రమే అరెస్ట్‌ చేయవద్దని దమ్మాలపాటి కోరితే, సీజే ఏకంగా నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్‌ చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక దమ్మాలపాటి కోరిన విధంగా పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాను నియంత్రిస్తూ గ్యాగ్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ .. ఎట్టకేలకు విచారణ...
హైకోర్టు సీజే ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సెప్టెంబర్‌ 22న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. దీనిపై రెండు నెలల తర్వాత బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ వాదనలు వినిపించగా, దమ్మాలపాటి తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, హరీష్‌ సాల్వేలు వాదనలు వినిపించారు.

ఆ వ్యక్తులెవరో న్యాయమూర్తులకు తెలుసనే అనుకుంటున్నా: రాజీవ్‌ ధావన్‌
‘అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారని, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాజెక్టులు వస్తాయో రిట్‌ పిటిషనర్‌ (దమ్మాలపాటి) తదితరులకు పూర్తిగా తెలుసు. ఆ వివరాల ఆధారంగానే వారు అమరావతి చుట్టూ భూములు కొన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వ్యక్తుల పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ప్రజా బాహుళ్యంలో ఉన్న వారి పేర్లు న్యాయమూర్తులకు తెలిసే ఉంటాయని నేను భావిస్తున్నా. రాజధానిగా అమరావతిని నిర్ణయించిన విషయం బయటకు రాకముందే, చాలామంది రైతులు తమ భూములను చాలా తక్కువ ధరలకు అమ్ముకున్నారు. ఇదంతా ఓ పెద్ద కుంభకోణం. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ మరుసటి రోజే గ్యాగ్‌ ఆర్డర్‌ కోసం మరో అనుబంధ పిటిషన్‌ వేశారు. సీజే స్వయంగా విచారణ జరిపి అప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపైనే మా అభ్యంతరం. దమ్మాలపాటి కోరింది ఒకటైతే కోర్టు అంతకు మించి ఉత్తర్వులిచ్చింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు.

అవి అసాధారణ ఉత్తర్వులు
హైకోర్టు గ్యాగ్‌ ఉత్తర్వులు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ తరహా అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సినంత పరిస్థితులు ఏవీ లేవు. రిట్‌ పిటిషన్‌లో ప్రభుత్వంపై ఆరోపణలు తప్ప ఏమీ లేవు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దాఖలు చేసిన రాజకీయ వ్యాజ్యమే అది. అసలు రైతులంతా వారి వారి భూములను జూన్, డిసెంబర్‌ మధ్యనే ఎందుకు అమ్ముకున్నారో తేల్చాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల భూ లావాదేవీలను పరిశీలిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడానికి ముందే దర్యాప్తుపై స్టే ఇవ్వడం మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా చూశామా..?’ అని రాజీవ్‌ ధావన్‌ సుప్రీంకు నివేదించారు.

దమ్మాలపాటిని లక్ష్యంగా చేసుకున్నారు...
‘రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదు. ఒక న్యాయమూర్తి విచారణకు నిరాకరించిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు సీజే అత్యవసరంగా విచారించారు. ఎఫ్‌ఐఆర్‌ను మీడియాకు ప్రభుత్వం లీక్‌ చేసింది. దమ్మాలపాటి 30 సంవత్సరాలపాటు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మాజీ సీఎం తరఫున ఆయన కేసులు వాదించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా కేసులు వాదించారు. అందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని చూస్తే, అది హైకోర్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానంలా ఉంది. హైకోర్టు సీజేపైనే ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారు.’ అని రోహత్గీ, సాల్వేలు వాదించారు.

అన్ని విషయాలూ మాకు అర్ధం అయ్యాయి: ధర్మాసనం
ఈ దశలో రాజీవ్‌ ధావన్‌ జోక్యం చేసుకుంటూ.. తాము కోర్టుకు వ్యతిరేకంగా నడుచుకోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఆ తదుపరి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టకూడదంటే ఎలా? సిట్‌ విచారణ అనేది అసందర్భంగా వేసింది కాదు. ప్రభుత్వం నియమించిన సబ్‌ కమిటీ అమరావతి భూకుంభకోణంపై నివేదిక ఇచ్చింది. సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి లేఖ రాసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయవాది లేదా మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ అయితే చట్ట ప్రకారం విచారణ నుంచి ఆయనకు ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?.’ అని ధావన్‌ ప్రశ్నించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘అన్ని విషయాలు మాకు అర్ధం అయ్యాయి..’ అని వ్యాఖ్యానించింది. 

గ్యాగ్‌ ఆర్డర్‌ అంటే..
ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా, దీనికి సంబంధించి ఎలాంటి విషయాలూ ప్రచురించకుండా మీడియాను నియంత్రిస్తూ న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులను గ్యాగ్‌ ఆర్డర్‌గా వ్యవహరిస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement