ఆ వాహనం అద్దాలకు పగుళ్లు కూడా ఉన్నాయి
హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
మాజీ సీఎంకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు
భద్రత కుదింపుపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రతలో భాగంగా ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం లోపభూయిష్టమైనదన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఎదుట పరోక్షంగా అంగీకరించింది. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి మరమ్మతులు చేయించి పాడైపోయిన భాగాలను మార్చి తిరిగి వైఎస్ జగన్‌కు కేటాయిస్తామని హైకోర్టుకు నివేదించింది. ఈలోపు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఆయనకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు.
ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినందున ఆయనకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తనకు గతంలో ఉన్న భద్రతను భారీగా కుదించడంపై వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం వారంలోపు ఆ కౌంటర్‌కు సమాధానం దాఖలు చేయాలని వైఎస్ జగన్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ ప్రధానుల్లా ఎందుకు భద్రత కల్పించకూడదు...?
వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎంకు జెడ్ ప్లస్ కేటగిరీ అలాగే ఉన్నా భద్రతను మాత్రం భారీగా కుదించి వేశారని నివేదించారు. గతంలో 10 మంది పీఎస్‌ఓలు ఉంటే ఇప్పుడు ఇద్దరినే కేటాయించారన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా భద్రతను కుదించిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో ఓ నిర్దిష్ట విధానపరమైన నిర్ణయం ఎందుకు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మాజీ ప్రధానులకు కల్పిస్తున్న రీతిలోనే మాజీ ముఖ్యమంత్రులకు కూడా భద్రత కల్పించడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత మాజీ ముఖ్యమంత్రికి ఎలాంటి భద్రత కల్పించారని ప్రశ్నించారు. దీనికి దమ్మాలపాటి బదులిస్తూ తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆయనకు ఎస్‌పీజీ భద్రత కల్పించారని చెప్పారు. మరి మిగిలిన మాజీ ముఖ్యమంత్రుల సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో వారికి ‘వై’ కేటగిరీ భద్రతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలాంటి భద్రత కల్పించాలన్నది వారికి ఉన్న ప్రాణహానిని బట్టి ఉంటుందని దమ్మాలపాటి చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఆ తరువాత పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోర్టును కోరారు.
మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా..?
ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ అందుకు అభ్యంతరం లేదని, అప్పటి వరకు 3.6.24 నాటికి జగన్‌కున్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే దీనిని దమ్మాలపాటి వ్యతిరేకించారు. చట్ట ప్రకారం ముఖ్యమంత్రికే ఆ స్థాయి భద్రత ఉంటుందన్నారు. ఈ సమయంలో శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పూర్తి లోపభూయిష్టంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
కారు అద్దాలపై పగుళ్లు ఉన్నాయని, వెనుక డోరు తెరుచుకోవడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని నివేదించారు. జామర్ సదుపాయం కూడా తొలగించారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రికి మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకుంటే ఎలా? ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. దీనిపై ఏం చేయబోతున్నారో తెలుసుకుని చెప్పాలని దమ్మాలపాటిని ఆదేశిస్తూ విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.
ప్రాణహాని లేదనేందుకు ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవు...
తిరిగి మధ్యాహ్నం విచారణ మొదలు కాగానే దమ్మాలపాటి స్పందిస్తూ వైఎస్ జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం అద్దాలకు పగుళ్లు ఉన్నాయని అంగీకరించారు. ఆ అద్దాన్ని మారుస్తామని, ఆ వాహనం మొత్తానికి మరమ్మతులు చేయిస్తామన్నారు. అప్పటి వరకు వైఎస్ జగన్‌కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయిస్తామని చెప్పారు.
మరి జామర్ సంగతి ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జగన్ ఏదైనా ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఆర్‌సీఐఈడీ) ఉపయోగించే అవకాశాలు ఉంటే ఆ విషయాన్ని ఆయన భద్రతా సిబ్బందికి తెలియచేసి అప్పుడు మాత్రమే జామర్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.
మిగిలిన అన్ని సమయాల్లో జామర్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దీనిపై శ్రీరామ్ స్పందిస్తూ వైఎస్ జగన్‌కున్న ప్రాణహానిని ప్రభుత్వం సరిగా మదింపు చేయలేదని చెప్పారు. ప్రాణహాని లేదని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment