హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి | AP Government SLP In The Supreme Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి

Published Tue, Sep 22 2020 3:20 AM | Last Updated on Tue, Sep 22 2020 10:17 AM

AP Government SLP In The Supreme Court - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్‌ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ మహఫూజ్‌ నజ్కీ ఈ పిటిషన్‌ వేశారు. తనను అరెస్టు చెయ్యొద్దని దమ్మాలపాటి ఒక్కరే పిటిషన్‌ దాఖలు చేస్తే.. హైకోర్టు మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్న మిగిలిన 12 మందిని కూడా అరెస్టు చెయ్యొద్దని ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో తీవ్ర అభ్యంతరం తెలిపింది. 

ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేయకపోయినా హైకోర్టు స్టే ఇచ్చింది
దమ్మాలపాటి శ్రీనివాస్‌ 14వ తేదీనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి అమరావతి భూ కుంభకోణంలో తనను అరెస్టుచేసే అవకాశం ఉందని.. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 15వ తేదీ ఉ.9 గంటల సమయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో దమ్మాలపాటి రిట్‌ పిటిషన్‌ నిరర్థకమైంది. అయితే, హైకోర్టు మాత్రం, ఆ రిట్‌ నిరర్థకమైనప్పటికీ.. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను ఆయన సవాలు చేయకపోయినప్పటికీ ఆయన పిటిషన్‌ను విచారించి, ఆయన కోరిన ఉత్తర్వులన్నింటినీ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు స్టే ఇచ్చి ఎఫ్‌ఐఆర్‌ వివరాలపై గ్యాగ్‌ ఉత్తర్వులు సైతం జారీచేసింది.

ఎఫ్‌ఐఆర్‌ను పట్టించుకోండా హైకోర్టు ఏకపక్ష ఉత్తర్వులు
రాజధాని అమరావతి కోర్‌ క్యాపిటల్‌ ఏరియాలో దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కొనుగోళ్ల విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్‌ అడ్వొకేట్‌ జనరల్‌గా తన పదవిని దుర్వినియోగం చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని తనతో పాటు తన బంధువులు, సన్నిహితులు భూ కొనుగోళ్లు చేసి లబ్ధి పొందారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారన్నది దమ్మాలపాటి ఆరోపణ. వాస్తవానికి ఇది శుద్ధ తప్పు. ఒకవేళ ఇందులో నిజం ఉందని అనుకున్నా కూడా.. న్యాయస్థానం ఏసీబీ దర్యాప్తును నిలిపేయడానికి వీల్లేదు. హైకోర్టు కనీసం ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ప్రస్తావించకుండా పూర్తి ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చి పెద్ద తప్పు చేసింది. ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను తోసిపుచ్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో చెప్పింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయవచ్చు.

దర్యాప్తు పూర్తయ్యే వరకు జోక్యం కుదరదని “సుప్రీం’ చెప్పింది
ఇక దర్యాప్తు అన్నది దర్యాప్తు సంస్థల పరిధిలోని వ్యవహారమని.. అది పూర్తయ్యేంత వరకు న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. అయినప్పటికీ.. హైకోర్టు మాత్రం దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోవడమే కాక, ఆయన కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు నిందితులకు వాదన వినిపించే హక్కేలేదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. సీఆర్‌పీసీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అయినా కూడా హైకోర్టు, అటు సీఆర్‌పీసీకి, ఇటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు.

దమ్మాలపాటి పిటిషన్‌ను కొట్టేయాల్సి ఉన్నా..
ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారన్న ఆందోళనతో దమ్మాలపాటి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. దానిని ప్రాథమిక దశలోనే కొట్టేయాలి. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా హైకోర్టు దానిని విచారించడమే కాక అతను కోరిన మేర ఉత్తర్వులిచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందే దర్యాప్తును ఆపేయాలన్న ఉద్దేశంతో దమ్మాలపాటి ఆ పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసే ముందు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను పూర్తిగా విస్మరించింది. ఉ. 9 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అదేరోజు సాయంత్రంకల్లా హైకోర్టు స్టే ఇచ్చేసింది.

స్టేవల్ల సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది
ఏసీబీ నమోదు చేసింది ఓ భారీ భూ కుంభకోణానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ అన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జీల కుమార్తెలతో పాటు ఇతర నిందితుల పాత్ర గురించి ఆ ఎఫ్‌ఐఆర్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌గా ఉన్న సమయంలో దమ్మాలపాటి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అందులో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన దశలో హైకోర్టు స్టే ఇవ్వడంవల్ల, నిందితులు సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది. అలాగే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇది దర్యాప్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందువల్ల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టం దృష్టిలో చెల్లవు. బినామీలు, బంధువులు, సన్నిహితుల పేర్ల మీద భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారన్న విషయాన్ని హైకోర్టు కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. 

సీనియర్‌ న్యాయవాదికి చట్టంలో ఎలాంటి రక్షణలేదు
దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ అయినంత మాత్రాన, ఏ చట్టం కూడా అతనికి రక్షణ కల్పించడంలేదు. న్యాయవాదిపై కేసు నమోదు చేయకూడదని న్యాయవాదుల చట్టంలో ఎలాంటి నిబంధనలేదు. సీనియర్‌ న్యాయవాదిగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఎలాంటి రక్షణ కోరజాలరు. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా అతను కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలి. 

ఈ వ్యవహారంలో కొన్ని మౌలిక ప్రశ్నలు..
– ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేయకపోయినప్పటికీ, దర్యాప్తును నిలుపుదల చెయ్యొచ్చా?
– దర్యాప్తు మొదలైన ప్రాథమిక దశలోనే రొటీన్‌ పద్ధతిలో ఎఫ్‌ఐఆర్‌ను నిలుపుదల చెయ్యొచ్చా?
– అసలు దర్యాప్తును నిలిపేస్తూ రొటీన్‌ పద్ధతిలో స్టే జారీచేయడానికి వీలుందా?
– సీఆర్‌పీసీ ప్రకారం.. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందే నిందితులకు వాదనలు వినిపించే హక్కు ఉందా?
– దర్యాప్తు సంస్థ పరిధిలో ఉండే దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరైన చర్యేనా?
– ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు, దర్యాప్తు ప్రక్రియను నిలిపేయవచ్చా?
– హైకోర్టును ఆశ్రయించని నిందితుల విషయంలో కూడా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వొచ్చా?
– నేరానికి పాల్పడిన న్యాయవాదిపై కేసు నమోదు చేయకుండా న్యాయవాదుల చట్టం కింద రక్షణ ఉందా?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement