అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ | Final hearing on Amaravati land scam on 12th | Sakshi
Sakshi News home page

అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ

Published Fri, Jul 30 2021 3:55 AM | Last Updated on Fri, Jul 30 2021 4:04 AM

Final hearing on Amaravati land scam on 12th - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీని సవాల్‌ చేస్తూ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆగస్టు 5కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ కౌంటర్‌లో ఆగస్టు 12వ తేదీ లోపు రీజాయిండర్‌ దాఖలు చేయాలని దమ్మాలపాటిని ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అమరావతి భూ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన న్యాయవాది కె.శ్రీనివాస స్వామిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. స్వామిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. 

ఏసీబీ కేసుపై దమ్మాలపాటి అత్యవసర పిటిషన్‌..
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్రానికి గతేడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా, ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే.. ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో వార్తలు రాయడం వల్ల తమ పరువుపోతోందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. 

‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం విచారిస్తాం..
తాజాగా గురువారం దమ్మాలపాటి పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దమ్మాలపాటి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను న్యాయమూర్తి పరిశీలించారు. 4 వారాల్లో ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే విచారణ జరుపుతానని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కౌంటర్‌ దాఖలుకు, ఆ కౌంటర్‌పై రీజాయిండర్‌ దాఖలుకు ఇరుపక్షాలకు నిర్ణీత గడువు విధించారు. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని చెప్పారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో 13వ నిందితురాలిగా ఉన్న వెల్లంకి రేణుకాదేవి వ్యాజ్యాన్ని కూడా దమ్మాలపాటి పిటిషన్‌కు జత చేశారు. ఆ వ్యాజ్యంలో కూడా విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. 

చర్చనీయాంశమైన ‘గ్యాగ్‌’..
ఈ వ్యాజ్యాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను నిలిపేశారు. ఈ కేసులో ఏ ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే స్టే ఎత్తివేత కోసం వాదనలు వినిపిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పిటిషన్‌ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 4 వారాల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement