ప్రశాంత్, రాజ్‌దీప్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరసలో ఉన్న ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోంది?
– వినోద్ కె.జోస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ద కారవాన్
సాక్షి, అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు మొత్తం 13మందిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఈ కేసులో హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, పాత్రికేయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కుండబద్దలు కొట్టారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొంటూనే.. ఈ ఉత్తర్వులు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో దేశంలోనే ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తోపాటు జాతీయ స్థాయి ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయి, రాహుల్ శివశంకర్, సిద్ధార్థ్ వరదరాజన్, ఉమా సుధీర్, శ్రీరాం కర్రి, ధన్యా రాజేంద్రన్ తదితరులు ఉన్నారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి.
ఆశ్చర్యం.. మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులా?
ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్‌సై డర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని కేసు నమోదైంది. దాంతో ఆ మాజీ అడ్వకేట్ జనరల్ ఆ విషయాన్ని మీడియా ప్రచురించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్చర్యం.. హైకోర్టు ఆ పిటీషన్ విచారించింది. మరింత ఆశ్చర్యం.. వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. వాళ్లు మీడియాను నియంత్రిస్తారా?
– ధన్యా రాజేంద్రన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద న్యూస్ మినిట్
అసాధారణ తీర్పు
ఈ తీర్పు అసాధారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అసాధారణం. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, బలవంతులు అన్నింటి నుంచి బయట పడతారు.
– రాహుల్ శివశంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్, టైమ్స్ గ్రూప్
ఈ ఉత్తర్వులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయేమో
న్యాయస్థానం ఉత్తర్వులను పాటించాల్సిందే. కానీ ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తి కుమార్తెలపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను ప్రచురించొద్దన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయోనన్నది విస్మయ పరుస్తోంది.
– ఉమా సుధీర్, ఎన్డీటీవీ
ప్రజల్లో సందేహాలకు తావిచ్చేట్టుగా ఉంది
దేశంలో న్యాయ వ్యవస్థలోని ప్రముఖుల బంధువులపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురించకూడదని ఏపీ హైకోర్టు ఉత్వర్వులు ఇవ్వడం సాధారణ ప్రజలకు పలు సందేహాలు కలిగేందుకు అవకాశం ఇస్తోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభమైన మీడియా హక్కులను కాలరాసేట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛపై ఉన్నత న్యాయ వ్యవస్థ ఆంక్షలు విధించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలహీన పరుస్తుంది. ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులను పునఃసమీక్షించాల్సిందిగా కోరుతున్నాం.– కె.శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)
ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించనున్నా రన్నది ముందే తెలుసుకుని ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వివరాలను మీడియా ప్రచురించొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు. – సునీల్‌జైన్, మేనేజింగ్ ఎడిటర్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి.– ప్రముఖ వార్తా సంస్థ ‘ద వైర్’ కథనం
ఈ ఎఫ్‌ఐఆర్‌ను తొక్కిపెట్టిన వారే అధికారం చలాయిస్తున్నారు
ఏపీ భూ కుంభకోణాల ఎఫ్‌ఐఆర్‌కు నివాళి. ఈ ఎఫ్‌ఐఆర్ కొద్ది సేపే జీవించినా సరే ఉపయుక్తకరంగా జీవించింది. రోజూ వేలాది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతాయి. కానీ ఈ ఎఫ్‌ఐఆర్‌ను తొక్కిపెట్టేశారు. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపై ఎప్పుడు ఎలా దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తున్న వారే భారతదేశంలో అసలైన అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. – సిద్ధార్థ్ వరద రాజన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద వైర్
ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది?
ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురించకూడదనే ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? కోర్టులంటే గౌరవం ఉంది. కానీ మీడియాపై ఆంక్షలు విధిస్తే ఎలా? అలా అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చేసిన అవినీతిపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన చర్యలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం ఏముంది?
– శ్రీరాం కర్రి, రెసిడెంట్ ఎడిటర్, దక్కన్ క్రానికల్
హైకోర్టు ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అడ్వొకేట్ జనరల్, ఇతర ముఖ్య వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వాస్తవాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయకుండా హైకోర్టు జారీచేసిన ‘నిషేధిత’ ఉత్తర్వు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19కు, సమాచార హక్కు చట్టానికి విరుద్ధం. హైకోర్టు ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేయడమే. ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం కూడా. ఇది రూమర్లకు దారి తీస్తుంది. – ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు
ప్రముఖులపై ఎఫ్‌ఐఆర్ అయితే ప్రచురించకూడదా?
సామాన్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదైతే ఎక్కడలేని హడావుడి చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడొచ్చు. అదే ప్రముఖులపై ఎఫ్‌ఐఆర్ నమోదైతే మాత్రం వాటిని మీడియా ప్రచురించకూడదని ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది.– రాజ్‌దీప్ సర్దేశాయి, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్
Comments
Please login to add a commentAdd a comment