అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆపండి | AP High Court sensational orders on Amaravati land scam | Sakshi
Sakshi News home page

దర్యాప్తు ఆపండి

Published Wed, Sep 16 2020 3:35 AM | Last Updated on Wed, Sep 16 2020 9:35 AM

AP High Court sensational orders on Amaravati land scam - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి కుమార్తెలిద్దరితో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను హైకోర్టు నిలిపేసింది. అంతేకాక ఈ కేసులో ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్‌ మీడియాను ఆదేశించింది. ఈ విషయాన్ని ఆయా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు తెలియచేయాలని డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఈ ఉత్తర్వుల కాపీ అందుకున్న తర్వాత ఈ ఆదేశాలు కఠినంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని డీజీపీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీ, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిలను ఆదేశించింది. పలు ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దమ్మాలపాటి ఒక్కరే పిటిషన్‌ దాఖలు చేసి, తన గురించి మాత్రమే అభ్యర్థన చేసినప్పటికీ, న్యాయస్థానం నిందితులందరిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. 

కేసు నుంచి తప్పుకున్న జస్టిస్‌ రమేశ్‌..
– భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 
– ఈ కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా, నిర్భంధించకుండా, తనపై ఇతర కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా జరిగే దర్యాప్తును హైకోర్టు పర్యవేక్షణలోనే కొనసాగించాలని పోలీసులను ఆదేశించాలన్నారు. 
– హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా తనపై మరో దర్యాప్తు, విచారణ చేపట్టకుండా ఆదేశించాలని కోరారు. రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలోనైనా దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. 
– ఈ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ దొనాడి రమేశ్‌ ముందు విచారణకు వచ్చింది. కేసుల విచారణ ప్రారంభించడానికి ముందే జస్టిస్‌ రమేశ్‌.. ఈ కేసును తాను విననని, మరో బెంచ్‌కి పంపాలని, నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఎందుకు తాను ఈ కేసును వినదలచుకోలేదో జస్టిస్‌ రమేశ్‌ కారణం చెప్పలేదు.

రేపు విచారిస్తామన్న సీజే.. సాయంత్రం కల్లా అనుబంధ పిటిషన్‌..
– సీజే జస్టిస్‌ మహేశ్వరి కేసుల విచారణకు సిద్ధమవుతుండగా, దమ్మాలపాటి తరఫు న్యాయవాది ప్రణతీ, తమ పిటిషన్‌ గురించి, జస్టిస్‌ రమేశ్‌ కేసు నుంచి తప్పుకున్న అంశం గురించి సీజే దష్టికి తీసుకొచ్చారు. అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. అయితే సీజే మహేశ్వరి ఈ వ్యాజ్యంపై రేపు (బుధవారం) విచారణ జరుపుతామని మౌఖికంగా స్పష్టం చేశారు.
– ఇదిలా ఉండగానే, సాయంత్రం దమ్మాలపాటి ఓ అనుబంధ పిటిషన్‌ను అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో వార్తలు రావడం వల్ల తమ పరువుపోతోందని, అందువల్ల ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా వాటిని నియంత్రించాలని ఆ అనుబంధ పిటిషన్‌లో కోర్టును కోరారు. 
– ఈ అనుబంధ పిటిషన్‌ గురించి సాయంత్రం 5.45 గంటలకు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌కు తెలియచేశారు. ఈలోపు హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సీజే ముందు ఉంచడం, ఆయన దమ్మాలపాటి సోమవారం దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా తెప్పించుకుని పరిశీలించడం, ఈ రెండింటినీ కలిపి తానే వినాలని నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. సాయంత్రం 6.30 గంటలకు విచారణ మొదలైంది. 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు..
– దమ్మాలపాటి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, శ్యాం దివాన్‌లు రాగా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ శ్రీరామ్, ఏసీబీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, సీఐడీ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యనారాయణప్రసాద్‌లు వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు సాగాయి. 
– ముందుగా రోహత్గీ, దివాన్‌లు వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పిటిషనర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. తమకు వ్యతిరేకంగా కేసులు వాదించారన్న కక్షతో న్యాయవాది అయిన దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కేసులు పెట్టారని తెలిపారు.
– ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వార్తలు పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో రావడం వల్ల పిటిషనర్‌ పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుందన్నారు. అందువల్ల వాటిని నియంత్రిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏసీబీ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినందున, ప్రధాన పిటిషన్‌పై ఇప్పుడు విచారణ జరపాల్సిన అవసరం లేదన్నారు. అయితే పిటిషనర్‌పై కఠిన చర్యలేవీ తీసుకోకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. 

కొత్తగా ఆయన పరువు పోవడానికి ఏమీ లేదు..
– అనంతరం ఏసీబీ తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌పై ఉదయం నుంచి అన్ని టీవీల్లో, సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఆయన పరువు పొయ్యేదేమీ లేదన్నారు. పోవడానికి ఏమీ మిగల్లేదని వివరించారు. అందువల్ల మీడియాను నియంత్రించాలన్న పిటిషన్‌ నిరర్థకమన్నారు. 
– మీడియా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నప్పుడే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి తప్ప, వ్యక్తులు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేసినప్పుడు మీడియాను నియంత్రిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పిటిషనర్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వివరించారు. 
– పిటిషనర్‌ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించబోమని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు జారీ చేస్తామని కోర్టుకు నివేదించారు. సీఐడీ తరఫున ఎస్‌.సత్యనారాయణ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, 1950 నుంచి ఎంతో మంది ఏజీలు వచ్చారు.. పోయారని, వారిలో ఎవరిపై కూడా ఇలాంటి ఆరోపణలు రాలేదని కోర్టుకు నివేదించారు. కేసు నమోదు చేయడం దురుద్దేశం ఎలా అవుతుందన్నారు.

సీఎంను ప్రతివాదిగా చేయడం ఫ్యాషనైపోయింది..
– ఏజీ శ్రీరామ్‌ వాదిస్తూ, ప్రతీ కేసులో ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందన్నారు. ఈ కేసులో కూడా ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడం దారుణమని వివరించారు.
– గాలి వార్తలు, వాళ్లూ వీళ్లూ చెప్పుకునే మాటల ఆధారంగా ముఖ్యమంత్రిపై నిందారోపణలు చేస్తూ ప్రతివాదిగా చేస్తున్నారని, ఈ కేసులో కూడా పిటిషనర్‌ అలానే చేశారని కోర్టుకు నివేదించారు. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేన్నారు. 
– ఈ సమయంలో సీజే స్పందిస్తూ, ముఖ్యమంత్రికి తాము ఎలాంటి నోటీసు ఇవ్వడం లేదన్నారు. అందరి వాదనలు విన్న సీజే, గంటన్నర తర్వాత ఉత్తర్వులు వెలువరించారు. ఏసీబీ కేసులో దర్యాప్తును నిలిపేశారు. నిందితులెవ్వరిపై కఠిన చర్యలొద్దని ఆదేశించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement