సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అమరావతి భూ కుంభకోణంపై వ్యాఖ్యలు చేసినందుకు 2016లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులను మూసివేస్తూ మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుబడుతూ మూసివేతపై సుమోటోగా విచారణ జరపాలన్న హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయానికి సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో తన ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత శుక్రవారం రిజిస్ట్రీని ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ తీసుకున్న నిర్ణయం వివరాలను పరిశీలించిన తరువాతే ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. కేసుల మూసివేతపై సుమోటో విచారణ జరపాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేటి ఆధారంగా నిర్ణయం తీసుకుందో వాటిని ఇప్పటి వరకు తమకు అందచేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ లలిత స్పందిస్తూ ఒకవేళ ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు భావిస్తే అప్పుడు ఆ వివరాలను అందచేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు. తదుపరి విచారణ ఎప్పుడు చేపట్టేది న్యాయమూర్తి స్పష్టతనివ్వలేదు.
న్యాయ చరిత్రలో ఎన్నడూ లేదు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అమరావతి భూ కుంభకోణంపై వ్యాఖ్యలు చేసినందుకు 2016లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని వివిధ పోలీస్‌స్టేషన్‌లలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసులు విచారణ జరిపి ఆయా కోర్టుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు. ఫిర్యాదుదారులు కూడా కేసులను మూసివేసేందుకు అభ్యంతరం లేదని తెలియచేయడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన 11 కేసులను మూసివేస్తూ ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఉత్తర్వులిచ్చారు. అయితే హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఈ మూసివేతను తప్పుపడుతూ సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుని, సుమోటో వ్యాజ్యాలను రోస్టర్ ప్రకారం సంబంధిత న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఈ మేరకు రిజిస్ట్రీ సుమోటో రివిజన్ పిటిషన్లను జస్టిస్ లలిత ముందుంచారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ బుధవారం వాదనలు వినిపించి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా సుమోటో విచారణ సరికాదని, గతంలో న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ లలిత స్పష్టం చేశారు. కమిటీ నిర్ణయాలను తన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment