సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఎలాంటి కథనాలు ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని పేర్కొన్న హైకోర్టు బుధవారం మరో ఉత్తర్వులను వెలువరించింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉప సంఘం, ప్రత్యేక దర్యాప్తుబృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది.
అలాంటి కారణాలు కనిపించడం లేదు...
కొన్ని పరిమిత సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించగలదని, తమ ముందున్న ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం అలాంటి సందర్భం ఏదీ ఉత్పన్నం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాలను ఆ తరువాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు తప్పనిసరిగా అనుసరించాలని, బలమైన, నిర్థిష్ట కారణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ దారి నుంచి పక్కకు తొలగవచ్చని, అలాంటి కారణాలు ప్రస్తుత కేసులో స్పష్టంగా కనిపించడం లేదని పేర్కొంది. గత సర్కారు నిర్ణయాలను సమీక్షించాలంటే అందుకు శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, ప్రభుత్వ స్వతఃసిద్ద అధికారం కాదని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే విషయంలో ఈ రోజు వరకు ఏ శాసనం కూడా అలాంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదంది.
విధానపరమైన లోపాలున్నాయి..
ఎలాంటి అధికారం లేకుండా, ఏకపక్షంగా, అహేతుకంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు మాత్రమే ఉందని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కేసు నమోదు కన్నా ముందు దర్యాప్తు చేయడం, ప్రత్యేక కోర్టుల ఏర్పాటునకు అభ్యర్థన లాంటి విధివిధానాలపరమైన లోపాలున్నాయంది. స్వతఃసిద్ధ వివక్ష, రాష్ట్ర ప్రభుత్వమే ఫిర్యాదుదారు, దర్యాప్తుదారు అన్న దురభిప్రాయాన్ని కలిగించడం, అపరిమిత సమీక్షాధికారం లాంటి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించుకునేందుకు తగిన ఆధారాలు లేవంది. తగినంత సమయం తీసుకున్నా కూడా ఆరోపిత నేరాలకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి లేదని తెలిపింది.
పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్ వేశానన్న వర్ల...
– గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, ఉప సంఘం నివేదిక ఆధారంగా అక్రమాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344లను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలంటూ అనుబంధ పిటిషన్లు వేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు వర్ల రామయ్య స్వయంగా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ప్రభావితమైన వ్యక్తులే దాఖలు చేస్తారు..
– ప్రభుత్వ చర్యల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తులే సాధారణంగా రిట్ పిటిషన్లు దాఖలు చేస్తారు. నేరుగా ప్రభావితం కాని వ్యక్తులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారణార్హత లేదని న్యాయస్థానాలు ప్రాథమిక స్థాయిలో తిరస్కరిస్తాయి. ప్రత్యక్షంగా ప్రభావితం కానప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసుకోవాలని సూచిస్తాయి. అయితే వర్ల, ఆలపాటి రిట్ పిటిషన్లపై ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
బాబు బృందం అక్రమాలను నివేదించిన ప్రభుత్వం
– విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అమరాతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతిపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలను సైతం కోర్టుకు సమర్పించింది.వీటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి రాసిన లేఖను కూడా కోర్టు ముందుంచింది. ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో న్యాయస్థానానికి నివేదించింది. అమరావతి భూ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఈసీఐఆర్ (పోలీసు ఎఫ్‌ఐఆర్ లాంటిది) నమోదు చేసిందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలని అనుబంధ పిటిషన్‌లో అభ్యర్థించింది. అయితే వీటిని తోసిపుచ్చుతూ జీవోలకు సంబంధించి తదుపరి చర్యలన్నింటిపై స్టే ఉత్తర్వులు ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment