రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీలకు హైకోర్టు మరోసారి ఆదేశం
తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలే లక్ష్యంగా జరుగుతున్న లక్షిత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిర్దిష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిపై మరో రాజకీయ పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం లేదన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ.. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్దిష్ట విధానం ఉందిగా అని ప్రశ్నించింది. అయినా కూడా కేసులు నమోదు చేయడం లేదన్నారు. దాడులపై రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఫిర్యాదు చేశారని, అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. హింస, దాడులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశాలివ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment