ముందస్తు బెయిల్‌ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు  | High Court verdict on anticipatory bail | Sakshi

ముందస్తు బెయిల్‌ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదు 

Dec 31 2023 5:50 AM | Updated on Dec 31 2023 4:09 PM

High Court verdict on anticipatory bail - Sakshi

సాక్షి, అమరావతి: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూ కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించాల్సిన వేళ హైకోర్టు అసలు ముందస్తు బెయిల్‌ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై కీలక తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్‌ ఎలా పడితే అలా ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 438 కింద ముందస్తు బెయిల్‌ విషయంలో హైకోర్టుకున్న అధికారం అసాధారణమైనదని తేల్చి చెప్పింది. ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ముందస్తు బెయిల్‌ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ముందస్తు బెయిల్‌ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచి­తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం అంటే.. నిందితుడిని విచారించడం, అవసరమైన సాక్ష్యాలను సేక­రించడం, దాచిపెట్టిన వాస్తవాలను వెలికి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే.

ఇంటరాగేషన్‌ దశలో నిందితుడు, అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్‌ ద్వారా రక్షణ లభిస్తే, అతను దర్యాప్తు అధికారుల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే. ముందస్తు బెయిల్‌ను రొటీన్‌ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదన్నది ఇప్పటికే రూఢీ అయిన న్యాయ సూత్రం. ముందస్తు బెయిల్‌ వంటి అసాధారణ ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే న్యాయస్థానాలు ఆ దిశగా ని­ర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

65 ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు పేరుతో భారీ భూ కుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న హై­కోర్టు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌­పై వచ్చే వారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 

వరకట్న వేధింపుల కేసులో.. 
ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త చంద్రశేఖర్‌తోపాటు అతని తండ్రి రామయ్య (65), మరికొందరిపై నెల్లూరు దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రశేఖర్‌కు కింది కోర్టు ముందస్తు బెయిల్, అతని తండ్రి రామయ్యకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. బెయిల్‌పై విడుదలయ్యే సమయంలో చంద్రశేఖర్, అతని తండ్రి రామయ్య నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించారంటూ చంద్రశేఖర్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చంద్రశేఖర్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన కింది కోర్టు చంద్రశేఖర్‌ బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. అంతకు ముందే నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు సమర్పించిన ఆరోపణలపై నెల్లూరు జిల్లా జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు చిన్నబజార్‌ పోలీసులు చంద్రశేఖర్, రామయ్యపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాది­గా చేర్చుకుని వాదనలు వినాలంటూ చంద్రశేఖర్‌ సతీమణి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రశేఖర్, అతని తండ్రి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే.. కింది కోర్టు చంద్రశేఖర్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. అతని తండ్రి రామయ్య వ్యాజ్యాన్ని మాత్రం కొనసాగించింది. 

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత 
చంద్రశేఖర్‌ భార్య దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ప్రధాన నిందితునిగా ఉన్న చంద్రశేఖర్‌కు కింది కోర్టు ఇప్పటికే పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిందని, అందువల్ల అతని తండ్రి రామయ్యకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అంతేకాక.. సాల్వెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించే సమయంలో వరకట్న వేధింపు కేసులో రామయ్య జైలులో ఉన్నారని, అందువల్ల ఆయన నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్‌ సమర్పించే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు.

నకిలీ సాల్వెన్సీ సర్టిఫికెట్ల సమర్పణకు అతన్ని బాధ్యుడిగా చేయడం తగదన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని అటు పోలీసులు, ఇటు చంద్రశేఖర్‌ భార్య కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు పిటిషనర్‌ రామయ్య వాదనను తోసిపుచ్చారు. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ రామయ్య ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ.. ముందస్తు బెయిల్‌ ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలో న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement