సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది.
రెడ్‌బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు.
ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు..
‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు.
ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్‌కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం.
కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్‌ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్‌కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్‌రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు.
నేరుగా అరెస్టు చేయవచ్చు కదా?
ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబూ ఉల్లంఘించారు..
పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్‌లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు.
కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్‌లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు.
చంద్రబాబు పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment