సాక్షి, అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో ఈనెల 10వ తేదీన సీఐడీ అధికారుల ఎదుట విచారణకు స్వయంగా హాజరు కావాలని మాజీ మంత్రి నారా లోకేశ్‌ను హైకోర్టు ఆదేశించింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఏ కింద నోటీసులకు అనుగుణంగా విచారణకు హాజరు కావాలని లోకేశ్‌కు స్పష్టం చేసింది. ఇదే కేసులో బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని, లేదంటే ఇంటివద్దే తనను విచారించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపే అవకాశం ఉంది.
కనిపించేంత దూరంలో న్యాయవాది
ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో నారా లోకేశ్‌ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చని, మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. విచారణ సమయంలో లోకేశ్ కనిపించేంత దూరం వరకు మాత్రమే న్యాయవాదిని అనుమతించాలని నిర్దేశించింది. విచారణకు వచ్చేటప్పుడు నిర్దిష్ట డాక్యుమెంట్లు తీసుకురావాలని లోకేష్‌ను ఒత్తిడి చేయబోమని సీఐడీ చెప్పిన విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాలు, దీన్ని అడ్డం పెట్టుకుని సాగించిన భూ దోపిడీ కేసులో నారా లోకేష్‌ను 14 నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 4న తమ ముందు హాజరు కావాలంటూ ఇటీవల సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు వచ్చే సమయంలో హెరిటేజ్ భూముల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను తేవాలని పేర్కొంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేష్ మంగళవారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లోకేష్ తరఫున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హెరిటేజ్‌లో లోకేష్ ఓ వాటాదారు మాత్రమేనన్నారు. హెరిటేజ్‌కు సంబంధించిన కీలక విషయాలు ఆయనకు తెలిసే అవకాశం లేదన్నారు. ఆ డాక్యుమెంట్లను ఇవ్వలేదన్న కారణంతో లోకేష్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.దుష్యంత్‌రెడ్డి, స్పెషల్ పీపీ శివ కల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ నిర్దిష్టంగా ఫలానా డాక్యుమెంట్లు తేవాలని ఒత్తిడి చేయబోమన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇతర నిందితులతో కలిపి లోకేశ్‌ను కూడా విచారించాల్సి ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 10న సీఐడీ ముందు హాజరు కావాలని లోకేశ్‌ను ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రింగ్ రోడ్డు కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు, తదనుగుణంగా సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన వివరాలన్నీ ఆయా ఫైళ్లలో భద్రంగా ఉన్నాయన్నారు.
అందువల్ల సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ప్రశ్నే తలెత్తదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమే జరగనప్పుడు అవకతవకలకు ఆస్కారం ఎక్కడ ఉందన్నారు. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ చంద్రబాబు మరో కేసులో అరెస్టై జుడీషయల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఆయన అరెస్టయినట్లు (డీమ్డ్) భావించాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదన సరికాదన్నారు.
బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసే ముందు సరెంట్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ పని చేయకుండా డీమ్డ్ అరెస్ట్ పేరుతో నేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యాజ్యానికి అసలు విచారణార్హతే లేదన్నారు. చంద్రబాబు పిటిషన్‌ను కొట్టి వేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
41 ఏ నోటీసును రద్దు చేయండి
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అక్రమాల కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ తనకు జారీ చేసిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో నిందితుడైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ తన వాంగ్మూలాలను నమోదు చేయడం తప్పనిసరి అని దర్యాప్తు అధికారి భావిస్తే తన ఇంటి వద్దనే విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు.
విచారణ సమయంలో న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాను వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, పలు మేజర్ సర్జరీలు కూడా జరిగాయని పిటిషన్‌లో నారాయణ పేర్కొన్నారు. డాక్టర్లు తనను ఇంటి వద్దే ఉండాలని సలహా ఇచ్చారన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
10న సీఐడీ ముందుకు నారా లోకేశ్..
Published Wed, Oct 4 2023 3:10 AM | Last Updated on Wed, Oct 4 2023 9:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment