టీడీపీ ఏ విధంగా ప్రభావితం అవుతుంది
ఊహలు, ఆందోళనల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేశారు
నారా లోకేశ్‌పై ప్రశ్నలు సంధించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం బలోపేతానికి కొన్ని అధికారాలు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ కొల్లి రఘురామిరెడ్డి రాసిన లేఖ వల్ల మీకొచ్చిన నష్టం ఏమిటని పిటిషనర్ నారా లోకేశ్‌ను హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆ లేఖ వల్ల మీరు ప్రత్యక్షంగా ఎలా ప్రభావితం అవుతున్నారని.. టీడీపీ కూడా ఎలా ప్రభావితం అవుతుందని నిలదీసింది. ఆ లేఖకు ముందు గానీ, ఆ లేఖ తరువాత మిమ్మల్ని గానీ, మీ పార్టీ వాళ్లను గానీ లక్ష్యం చేసుకున్నారా? అని ప్రశ్నించింది. అలాంటి ఉదంతాలు ఉంటే చెప్పాలని స్పష్టం చేసింది.
లక్ష్యంగా చేసుకున్నారనేందుకు ఆధారాలుంటే చూపాలంది. కేవలం ఊహలు, ఆందోళనల ఆధారంగా పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. ఇలా దాఖలు చేసే పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో రఘురామిరెడ్డి లేఖ మాత్రమే రాశారని, దానిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు మహేశ్వరరెడ్డి, సుమన్ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని వారు వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు లోకేశ్ వ్యాజ్యంపై విచారణను జూన్‌కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లోకేశ్ పిటిషన్ ఇదీ
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే సంస్థలకు కళ్లెం వేసి, ప్రభుత్వాదాయాన్ని పెంచి తద్వారా సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు కొన్ని అధికారాలను కోరుతూ ఆ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ కె.రఘురామిరెడ్డి గత నెల 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖను సవాల్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు.
విచారణ మొదలు కాగానే న్యాయమూర్తి పిటిషనర్ లోకేశ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమయంలో లోకేశ్ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. విజిలెన్స్ ఐజీ అపరిమిత అధికారాలు కోరుతూ లేఖ రాశారన్నారు. పిటిషనర్‌తోపాటు ఆయన పార్టీని లక్ష్యంగా చేసుకునే ఆ లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖ వల్ల పార్టీ ప్రభావితం అవుతుంది కాబట్టే ఆ పార్టీ తరఫున లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు.
‘కౌంటర్లు దాఖలు చేస్తాం’
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు వేలూరి మహేశ్వరరెడ్డి, చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. విజిలెన్స్ ఐజీ రాసిన లేఖ న్యాయశాఖకు చేరిందని, న్యాయశాఖ ఆ లేఖపై ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడిందని తెలిపారు. లేఖపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉందని, అందువల్ల విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని వివరించారు. లోకేశ్ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు.
ఉన్నం జోక్యం చేసుకుంటూ.. విధానపరమైన నిర్ణయం ఇప్పుడు తీసుకోబోమన్న వివరాలను రికార్డ్ చేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేశారు. కాగా.. ప్రభుత్వ న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ఈ లోపు వ్యాజ్యం విచారణార్హతపై పూర్తి వివరాలతో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment