అడ్డంగా దొరికిన ‘రింగ్‌’ మాస్టర్‌ | Land grab by Chandrababu in name of Inner Ring Road Alignment | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిన ‘రింగ్‌’ మాస్టర్‌

Published Sun, Jan 14 2024 2:20 AM | Last Updated on Sun, Jan 14 2024 4:23 AM

Land grab by Chandrababu in name of Inner Ring Road Alignment - Sakshi

సాక్షి, అమరావతి: కట్టని రాజధాని.. నిర్మించని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు చెలరేగిపోయారు. రాజధాని అమరా­వతి ముసుగులో యథేచ్ఛగా భూ దందా సాగించారు. కాగితాల మీదే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తనకే సాధ్యమని నిరూ­పించారు. గత ప్రభుత్వంలో సీఆర్‌డీఏ చైర్మన్‌­గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్‌ చైర్మన్‌­గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరి­తెగించి పాల్పడ్డ అవినీతి విస్మయ పరుస్తోంది.

అందు­కోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ ప్రో కోకు పా­­ల్ప­డిన ఈ కేసులో లోకేశ్‌ కూడా ప్రధాన పాత్ర పోషించారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌కు కూడా వాటా ఇవ్వడం కొసమెరుపు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పూర్తి ఆధారాలతో సహా వెలికి తీసి కేసు నమోదు చేసింది.  

అలైన్‌మెంట్‌ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది
అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కోసం సీఆర్‌డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్‌డీయే అధికారులపై మండిపడ్డారు. వారిద్దరి ఆదేశాలతో సీఆర్‌డీయే అధికారులు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారు.

అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ సంస్థల పేరిట ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు.

అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. కానీ మాస్టర్‌ ప్లాన్‌లో పొందు పరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలని షరతు విధించారు. అంటే అప్పటికే సీఆర్‌డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు.


‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’కు భూములు  
► ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు హెరిటేజ్‌ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ హోదాలో లోకేశ్‌ కీలక భూమిక పోషించారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న కంతేరు గ్రామంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. 

► 2014 జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఈ భూములను హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్‌ ఫుడ్స్‌ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్‌ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఆనుకునే లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములు ఉండటం గమనార్హం. 

► క్విడ్‌ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్‌ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారానికి మసి పూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్‌ చెప్పారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు.

► తర్వాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందారని ప్రశ్నించేసరికి జవాబే లేదు. దాంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ ప్రో కో కింద ఇచ్చారన్నది స్పష్టమైంది.

రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు
ఎత్తుగడల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్‌ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉండేది. అంటే ఆ భూముల మార్కెట్‌ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తర్వాత మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్‌ ధర ప్రకారం హెరిటేజ్‌ ఫుడ్స్‌ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. 

పవన్‌ కల్యాణ్‌కూ 2.40 ఎకరాల ప్యాకేజీ
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్‌ పూలింగ్‌ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్‌ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. 

కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే
► సీఆర్‌డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. 

► దీంతో ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ సీఆర్‌డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును నిర్మిస్తారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. 

ఐఆర్‌ఆర్‌ కేసులో నిందితులు 
ఏ–1: చంద్రబాబు
ఏ–2: నారాయణ
ఏ–3: లింగమనేని రమేశ్‌
ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్‌
ఏ–5: కేపీవీ అంజని కుమార్‌ (రామకృష్ణ హౌసింగ్‌ కార్పొరేషన్‌)
ఏ–6: హెరిటేజ్‌ ఫుడ్స్‌
ఏ–7: ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌
ఏ–14: లోకేశ్‌

బాబు, నారాయణ ఆస్తుల అటాచ్‌మెంట్‌
క్విడ్‌ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్‌ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement