ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేసి తమ భూములకు రెక్కలు
ముందే ఖరారు చేసి కన్సల్టెన్సీ ద్వారా రాజముద్ర
రూ.2 వేల కోట్లకుపైగా టీడీపీ పెద్దల దోపిడీ
క్విడ్‌ప్రో కో కింద హెరిటేజ్‌కు భూములు
పూర్తి ఆధారాలతో వెలికి తీసిన సీఐడీ
ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని, ఏ–14 లోకేశ్
సాక్షి, అమరావతి: రాజధాని.. ఇన్నర్ రింగ్ రోడ్.. కావేవీ భూ దోపిడీకి అనర్హం అన్నట్టుగా టీడీపీ పెద్దలు చెలరేగిపోయారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి తమ భూముల విలువ భారీగా పెంచుకున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో సీఆర్‌డీఏ చైర్మన్ హోదాలో చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా ఉన్న పొంగూరు నారాయణ బరితెగించి వ్యవహరించారు.
లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో నారా లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం భారీ దోపిడీకి నిదర్శనం. సీఐడీ దర్యాప్తులో
ఈ కుంభకోణం పూర్తి ఆధారాలతో బట్టబయలైంది.
‘హెరిటేజ్ ఫుడ్స్’కు కానుక..
లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారు. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా కరకట్ట మీద ఉన్న తన అక్రమ బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఆ ఇంటిని ఉచితంగా ఇచ్చినట్లు ఆయన చెబుతుండగా నాడు చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్‌ఆర్‌ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు.
తమ భూముల విలువ పెరిగేలా..
ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించగా మార్కెట్ ధర రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ ఖరారు తరువాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది.
అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. తద్వారా హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ అమరావతి పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని లెక్కతేలింది.
హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ రూ.24 కోట్లకు చేరుతుంది. సీఆర్‌డీఏ తొలి అలైన్‌మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపడితే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. దీంతో నారాయణ అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్పించారు.
పవన్ కళ్యాణ్‌కు 2.40 ఎకరాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతిలో వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం.
ఏ1 చంద్రబాబు.. ఏ2 నారాయణ.. ఏ14 లోకేశ్
ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణలను పేర్కొంది. ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం కేసు నమోదు చేసింది.
అలైన్‌మెంట్ బాబుది.. ముద్ర కన్సల్టెన్సీది
ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్‌డీయే అధికారులు తొలుత 94 కి.మీ. పొడవుతో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే దానివల్ల తమ భూముల విలువ పెరగదని గుర్తించిన టీడీపీ పెద్దలు అలైన్‌మెంట్‌ను మార్చేశారు. 3 కి.మీ. దక్షిణం వైపు జరిపేసి తాడికొండ, కంతేరు, కాజాలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని వెళ్లేలా ఖరారు చేశారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఆమోదించుకున్నారు.
ఐఆర్‌ఆర్ కేసులో నిందితులు
ఏ–1: చంద్రబాబు
ఏ–2: నారాయణ
ఏ–3: లింగమనేని రమేశ్
ఏ–4: లింగమనేని వెంకట సూర్య రాజవేఖర్
ఏ–5: కేపీవీ అంజని కుమార్ (రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్)
ఏ–6: హెరిటేజ్ ఫుడ్స్
ఏ–7: ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్
ఏ–14: నారా లోకేశ్
Comments
Please login to add a commentAdd a comment