సాక్షి, అమరావతి: అడుగడుగునా కుంభకోణాలతో ప్రజా ధనాన్ని దోచేసి అడ్డంగా దొరికిపోయి జైలులో కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆడుతున్న సరికొత్త నాటకం ‘నిజం గెలవాలి’ యాత్ర. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్న దగ్గర నుంచి చంద్రబాబు ఎన్నెన్నో డ్రామాలాడారు. ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోచుకొంటూ, అవినీతి తప్పితే మరే దృష్టీ లేకపోయినప్పటికీ, పైకి విజన్ ఉన్న నాయకుడిగా కలరింగ్ ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి.
వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్న ఆయన.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లారు. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్, పేదల నుంచి అసైన్‌మెంట్ భూములను కొల్లగొట్టడం వంటి పలు వ్యవహారాల్లోనూ చంద్రబాబు అన్ని నిబంధనలనూ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. వీటిపైనా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. టిడ్కో గృహాల నిర్మాణం, అమరావతిలో తాత్కాలిక కట్టడాల వ్యవహారంలో కేంద్ర ఆదాయ పన్ను శాఖ పలు అక్రమాలను వెలికితీసింది.
తెలంగాణ సర్కారును దెబ్బతీసేందుకు చేసిన ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో అరెస్టు నుంచి తప్పించుకొనేందుకు రాత్రికి రాత్రి మకాం హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అమరావతి రాజధాని పేరుతో అనేక అక్రమాలకు తెరతీశారు. అదేమంటే.. దాడులు చేయడానికి ఆదాయ పన్ను శాఖ ఎవరు? సీబీఐ ఎవరు అంటూ దర్యాప్తు సంస్థల పైనే çహూంకరించేవారు.
అవినీతిలో బాబు ‘స్కిల్’ ఇది
2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.371 కోట్లు కొల్లగొట్టారు. అందుకోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో రూ. 3,300 కోట్లతో ఒక నకిలీ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. సీమెన్స్ కంపెనీ 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఈ కార్యక్రమంతో తమకు ఎటువంటి సంబంధం లేదని సీమెన్స్ సంస్థ విస్పష్టంగా ప్రకటించింది. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా నిధులు జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు చెల్లించింది. ఇది తప్పని ఆరి్థక శాఖ అధికారులు చెప్పినా బాబు పట్టించుకోలేదు. ఆ నిధులను ఫోర్జరీ డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల ద్వారా తరలించేశారు. వాటిలో రూ.241 కోట్లు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు నివాసానికే చేరినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై బాబు సీఎంగా ఉండగానే జీఎస్టీ అధికారులు దర్యాప్తు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేసి, కొందరిని అరెస్టు కూడా చేసింది.
ఇటీవల మరింత లోతుగా దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులు.. చంద్రబాబు ప్రమేయాన్ని బట్టబయలు చేశారు. 18 నోట్‌ఫైళ్లపై ఆయన సంతకాలు పెట్టినట్లు గుర్తించారు. అన్ని ఆధారాలతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆధారాలు బలంగా ఉండటంతో ఆయన కూడా తాను నేరం చేయలేదని ఏ కోర్టులోనూ చెప్పడంలేదు. ఎంతసేపూ అరెస్టులో సాంకేతిక కారణాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలను కోర్టులు పట్టించుకోవడంలేదు.
ఇన్నర్ రింగ్ రోడ్డు భూదోపిడీ కథ ఇదీ..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ ఖరారులో చంద్రబాబు, అప్పటి మంత్రి నారాయణ యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు బినామీ లింగమనేని రమేశ్‌కు చెందిన భూములు, బాబు సొంత కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్, మంత్రి నారాయణకు చెందిన భూములను ఆనుకొని వెళ్ళేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అదే అలైన్‌మెంట్‌ను సింగపూర్ కన్సల్టెన్సీతో ఖరారు చేయించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు, బినామీల భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేశ్ కరకట్ట నివాసాన్ని, హెరిటేజ్ ఫుడ్స్‌కు, నారాయణ బినామీలకు భూములు ఇచ్చారు.
పార్టీలోనే అనుమానాలు
ఇప్పటివరకు 155 మందికిపైగా చంద్రబాబు కోసం మృతి చెందారని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, వీరంతా బాబు అరెస్టయ్యారన్న బాధతో చనిపోయారన్నది వాస్తవం కాదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దీనిపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో చనిపోయిన వారిని చంద్రబాబు కోసం మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నారని సామాన్య ప్రజానీకమూ చెబుతున్నారు. అందువల్లే ముందుగా పేర్లు ప్రకటిస్తే విమర్శలు వస్తాయన్న భయంతోనే జాబితా బయటపెట్టలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఎవరిని పరామర్శించాలి, యాత్ర ఎక్కడి వరకు, ఎన్ని రోజులు చేయాలన్న విషయాలపై పార్టీ అధిష్టానానికే స్పష్టత లేదు. సాధారణ మరణాలను బాబు అరెస్టుకు ముడిపెట్టి, ఓ తప్పుడు కార్యక్రమాన్ని చేపట్టడం వల్లే ఇప్పుడీ అవస్థలు వచ్చాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. ఈ యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంటే ఏం చేయాలోనని పారీ్టలో ఆందోళన నెలకొంది.
ఫైబర్‌నెట్‌లో బాబు ‘సెట్టింగ్’
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టులోనూ బాబు అవినీతి వెల్లడైంది. రూ.330 కోట్ల మొదటి దశ ప్రాజెక్టును తన బినామీ వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పటివరకూ బ్లాక్ లిస్టులో ఉన్న ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు.
టెండర్ల టెక్నికల్ కమిటీలో హరికృష్ణకు స్థానం కల్పించారు. ఎల్1 గా వచ్చిన కంపెనీకి కాకుండా టెరాసాఫ్ట్‌కు టెండరు కట్టబెట్టారు. ఇలా చేయడం పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధమని ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పినా బాబు పట్టించుకోలేదు. 80 శాతం ప్రాజెక్టు పనులు నాసి రకంగా చేశారు. అలా కొల్లగొట్టిన నిధుల్లో రూ.144 కోట్లు చంద్రబాబుకు చేరినట్లు గుర్తించారు.
అసైన్‌మెంట్ పేరుతో పేదలను దోచిన బాబు బ్యాచ్
అమరావతి ప్రాంతంలో అసైన్‌మెంట్ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులను బాబు బ్యాచ్ భయపెట్టి, వాటి ద్వారా వందల కోట్లు దండుకున్న మోసమిది. అమారావతి పరిధిలో అసైన్డ్ భూములకు ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వదని చంద్రబాబు ప్రభుత్వం తొలుత ప్రచారం చేసింది. దాంతో ఆందోళన చెందిన అసైన్డ్ రైతుల వద్దకు బాబు బ్యాచ్ తమ ఏజెంట్లను పంపింది. అతి తక్కువ ధరకు దాదాపు 617 ఎకరాల అసైన్డ్ భూములు హస్తగతం చేసుకుంది. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది.
భూ సమీకరణ ప్యాకేజీ ద్వారా ఈ బ్యాచ్ రూ.3,737 కోట్లు కొల్లగొట్టింది ఇలా అన్నింటా అడ్డంగా దొరికిపోతున్న చంద్రబాబు.. ఇప్పుడు నిజం గెలవాలంటూ ప్రజల్లో మరో ఎత్తుగడతో వస్తున్నారు. బాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందారంటూ కొందరు టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అసలు వాస్తవమేంటంటే.. నిజం గెలిచింది కాబట్టే ఆయన జైలుకు వెళ్లారు. కానీ, ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు. చంద్రబాబు జైలుకు వెళ్లగానే, ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేసి ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఆయన మళ్లీ పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలూ కనిపించడంలేదు. దీంతో బాబు సతీమణి భువనేశ్వరితో యాత్ర చేపట్టారు. బుధవారం నుంచి తిరుపతి జిల్లాలో బాబు సొంత గ్రామం నారావారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతోంది. భవనేశ్వరి మంగళవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అయితే, ఈ ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో అన్నీ దాపరికాలే. యాత్ర ప్రారంభానికి ఒక రోజు ముందు కూడా యాత్ర సమాచారం, రూట్ మ్యాప్ వంటివి ప్రజలకే కాదు.. ఆ పార్టీ నాయకులకే తెలియవు.
ఇప్పటివరకు షెడ్యూలే విడుదల చేయలేదు. మొదటిరోజు పాకాల మండలం నేండ్రగుంటలో ఒక పరామర్శ, ఆ తర్వాత కుదిరితే ఎక్కడైనా ఒక దళితవాడలో సహపంక్తి భోజనం, సాయంత్రం చంద్రగిరి మండలంలోని ఆగరాల వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజులు చూచాయగా కార్యక్రమాలు గురించి మాట్లాడుకుంటున్నా ఇంతవరకు స్పష్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment