న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న లోకేశ్‌  | Gudivada Amarnath fires on Lokesh | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థను కించపరుస్తున్న లోకేశ్‌ 

Oct 30 2023 4:28 AM | Updated on Oct 30 2023 11:21 AM

Gudivada Amarnath fires on Lokesh - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ పేరుతో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, ఆధారాలతో సహా దొరికిన దొంగ చంద్రబాబు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఘాటుగా విమర్శించారు. సీఐడీ నమోదు చేసిన కేసులో ఆధారాలు ఉన్నా­యనే న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించిందన్నారు. విజయవాడ న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టుల మెట్లు ఎక్కినా, ఆయనకు ఊరట లభించకపోవడంతో 50 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారని చెప్పారు.

వాస్తవాలు ఇలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను మేనేజ్‌ చేశారని లోకేశ్‌ విమర్శించడం న్యాయ వ్యవస్థను అవమానించడమేనని మండిపడ్డారు.  విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరుల సమా­వేశంలో మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరే­కంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని లోకేశ్‌ వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్కిల్‌ స్కామ్‌కు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏకంగా 13 ఫైళ్లలో సంతకాలు చేశారని గుర్తు చేశారు. తద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీఐడీ ఆధారాలతో­సహా వెలికి తీసిందన్నారు. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో అసెంబ్లీలో స్క్రీన్‌పై ప్రదర్శించి ప్రజలకు స్పష్టంగా వివరించామని చెప్పారు. ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలని లోకేశ్‌ను ప్రశ్నించారు. మంత్రి అమర్‌నాథ్‌ ఇంకా ఏం చెప్పారంటే..

‘సీమెన్స్‌’ తిరుగులేని సాక్ష్యం
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ స్పష్టం చేసింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు ఇది తిరుగులేని సాక్ష్యం. అసలు కేబినెట్‌ అనుమతి లేకుండానే ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు అవినీతికి నాంది పలికారు.

 స్కిల్‌ ప్రాజెక్ట్‌ పేరిట జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడం.. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకుంటున్నట్టు మోసం చేయడం.. అనంతరం డిజైన్‌టెక్‌ అనే కంపెనీ ద్వారా త్రైపాక్షిక ఒప్పందంగా మార్చడం అంతా కూడా ప్రజాధనాన్ని దోచేందుకు వేసిన పన్నాగమే. ఇదంతా పూర్తి ఆధారాలతో బయటపడిన విషయాన్ని లోకేశ్‌ గుర్తించాలి.

నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు చెల్లించాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం వాస్తవం కాదా? ఆ విధంగా చెల్లించిన నిధులు షెల్‌ కంపెనీల ద్వారా హైదారాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి చేరడం సీఐడీ దర్యాప్తులో వెల్లడి కావడం నిజం కాదా?  

 అసలు చంద్రబాబుకు ఐటీ శాఖ ఎందుకు నోటీసులు జారీ చేసిందో సమాధానం చెప్పగ­లరా?

ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా?
♦ స్కిల్‌ స్కామ్‌ కేసులో విచారణకు సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు తన పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి వాసుదేవ్‌ పార్థసానిలను ఎందుకు విదేశాలకు పంపించారో సమాధానం చెప్పగలవా లోకేశ్‌? 

♦ అమరావతిలో తాత్కాలిక సచివాలయం భవనాల నిర్మాణం, టిడ్కో ప్రాజెక్ట్‌ల టెండర్ల కేటాయింపులో కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నందుకే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్టు ఐటీ శాఖే వెల్లడించింది. తమకు హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ బ్రాంచి అధికారులు నోటీసులు ఇవ్వాలి తప్ప.. ఢిల్లీ ఆఫీసు వారు కాదని చంద్రబాబు చేసిన వాదనను ఐటీ శాఖ కొట్టి పారేసింది. లెక్కల్లో చూపని రూ.118 కోట్ల ఆదాయానికి ఆధారాలు చూపాలని ఐటీ శాఖ ప్రశ్నించడం వాస్తవం కాదా లోకేశ్‌?

మేనేజ్‌ చేయటంలో దిట్ట మీ బాబే 
♦  40 ఏళ్లుగా చంద్రబాబు కంటే బాగా వ్యవస్థలను మేనేజ్‌ చేయగల వ్యక్తి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం ద్వారానే మీ బాబు చంద్రబాబు టీడీపీ వ్యవ­స్థా­ప­కుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, అడ్డ­దారిలో సీఎం పదవి దక్కించుకున్నారు. టీడీపీ­ని, ఆ పార్టీ గుర్తును, ట్రస్ట్‌ను కూడా కొట్టేశారు. 

♦ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీతో కలసి అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబే అన్నది ప్రజలకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్‌తో కలిసి  చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసిన విష­యం తెలియదా లోకేశ్‌? వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ పెట్టిన అక్రమ కేసుల్లో టీడీపీ నేతలు అశోక్‌ గజపతిరాజు, ఎర్రన్నాయుడు ఇంప్లీడ్‌ అయ్యా­రనే విషయం తెలియదా? బాబులా మేనేజ్‌ చేయా­ల్సిన అవసరం సీఎంకు, వైఎస్సార్‌సీపీకి లేదు.

 లోకేశ్‌ 35 రోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. పైగా కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షానే తనను పిలిపించుకున్నారని అబద్దాలు చెప్పారు. కానీ ఆయన పదే పదే అడిగితేనే అమిత్‌ షా అపా­యింట్‌మెంట్‌ ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పడంతో అసలు బండారం బయటపడింది. అబద్ధాలు చెప్పడం, గోబెల్స్‌ ప్రచారంలో లోకేశ్‌ తన తండ్రి చంద్రబాబును మించిపోయారు.

చంద్రబాబుకు లోకేశ్‌తోనే ముప్పు
 చంద్రబాబుకు ఏదైనా ముప్పు ఉంటే అది లోకేశ్‌తోనే ఉండొచ్చు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణం అయినట్టే.. ప్రస్తుతం చంద్రబాబుకు లోకేశ్‌ వెన్నుపోటు పొడిచే అవకాశాలున్నాయి.  

చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారుల కాల్‌ డేటా ఎందుకోసం? పోలీసుల కాల్‌ డేటాతో చంద్రబాబుకు ఏం సంబంధం? దర్యాప్తు అధికారులు విచారణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఆ కాల్‌ డేటాను టీడీపీకి ఎందుకు ఇవ్వాలి. జైలు అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. జైల్లో చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్యులు 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు.

టీడీపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే లోకేశ్‌ నిరాధార ఆరో­పణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా పేదలకు ప్రభుత్వం చేస్తున్న మేలును ఈ యాత్రలో వివరి­స్తుంటే సర్వత్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే టీడీపీ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది.

ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ తప్ప చంద్ర­బాబుకు ప్రజలకు మేలు చేయడం అన్నది తెలియదు. ఆయన ఒక్క ఎన్ని­కల్లో అయినా పొత్తు లేకుండా గెలిచారా? గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. చివరికి లోకేశ్‌ను కూడా గెలిపించుకోలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement