అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం అరాచకాలు
యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూముల దురాక్రమణ
శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు
‘రాజధాని లీక్స్’ పేరిట బురిడీ
పక్కా పన్నాగంతో అమరావతి ఎంపిక
బరితెగించి ఇన్‌సైడర్ ట్రేడింగ్.. భయపెట్టి భూ మాయాజాలం
అమరావతి కేంద్రంగా ఎల్లో గ్యాంగ్ రూ.లక్షల కోట్ల కుంభకోణం
రాజధానిలో భూ బాగోతాలను కప్పిపుచ్చేందుకే శ్వేతపత్రం డ్రామా
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.
మోయలేని భారం మోపుతూ...
రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు.
ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.
భూములు లాక్కుని గాలి మేడలు..!
అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు.
2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.
పచ్చ దండు దురాక్రమణ..
దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు.
చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్‌పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.
మభ్యపుచ్చే యత్నాలు..
నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు.
అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం.
Comments
Please login to add a commentAdd a comment