షరతులతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ | Sakshi
Sakshi News home page

షరతులతో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌

Published Thu, Jan 11 2024 5:12 AM

Advance bail for Chandrababu with conditions - Sakshi

సాక్షి, అమరావతి: ఇన్నర్‌ రింగ్‌ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల్లో అక్ర­మాలపై సీఐడీ నమోదు చేసిన కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు­కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే మద్యం కేసులో నిందితులు­గా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర,  ఎక్సై­జ్‌ శాఖ అప్పటి కమిషనర్‌ శ్రీ నరేష్ లకు కూడా ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది.

ఇప్పటి నుంచి వారంలోపు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని చంద్రబాబు, రవీంద్ర, శ్రీ నరేష్లను హైకోర్టు ఆదేశించింది. రూ. లక్షకు రెండు వ్యక్తిగత పూచీకత్తు­లు సమర్పించాలంది. ముందస్తు బెయిల్‌పై విడుదలైన తరువాత ఎప్పుడు పిలిస్తే అప్పు­డు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావా­ల­ని చంద్రబాబు తదితరులను ఆదేశించింది. అయితే 48 గంటల ముందు నోటీసు ఇవ్వా­ల­ని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది.

దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసుల గురించి తెలిసిన వ్యక్తిని.. ఆ కేసు­ల వాస్తవాలను కోర్టుకు గానీ, పోలీసులకు గానీ చెప్పకుండా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ, వాగ్దానాలు చేయడం గానీ ఎంత మాత్రం చేయడానికి వీల్లేదంది. ఈ కేసు­లకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయడానికి వీల్లేదని బాబు త­ది­తరులను ఆదేశించింది. ఈ మేరకు న్యా­య­మూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరా­వు బుధవారం తీర్పులు వెలువరించారు.  

కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదు.. 
తాను వెలువరించిన ఈ తీర్పులు కేసు పూ­ర్వా­పరాల్లోకి వెళ్లి ఇవ్వడం లేదని, ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ప్రాథమికమైనవేనని, కేవలం ఈ ముందస్తు బెయి­ల్‌ పిటిషన్ల విచారణకే ఈ అభిప్రాయాలు పరిమితమని న్యాయమూర్తి తన తీర్పుల్లో పేర్కొ­న్నారు. ఈ తీర్పుల్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా దర్యాప్తు­ను కొనసాగించుకునే స్వేచ్ఛ దర్యాప్తు సంస్థ­కు ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ ఇటీవ­ల కొన్ని మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే­లా, సాక్షులను బెదిరించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పునిచ్చే సమయంలో పరిగణనలోకి తీసుకోవాలన్న సీఐడీ మెమోపై కూడా న్యాయమూర్తి తన తీ­ర్పులో చర్చించారు. లోకేశ్‌ ఇంటర్వ్యూ ఆ­ధా­­రంగా బాబు ముందస్తు బెయిల్‌ను నిర్ణయించజాలమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
 
గతంలో పూర్తయిన వాదనలు 
కావాల్సిన వారి కోసం ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌­లో మార్పులతో పాటు క్విడ్‌ ప్రో కోకు పా­ల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసి అప్ప­టి సీఎం చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్‌ తదితరులను నింది­తులుగా చేర్చింది. అలాగే, ఉచిత ఇసుక పథ­కం పేరు­తో కోట్లాది రూపాయలు ఖజానాకు నష్టం కలిగించినందుకు సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ కేసు­ల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకో­ర్టులో పిటి­ష­న్‌ దాఖలు చేశారు. ఇక బాబు సీఎంగా ఉండగా తమ పార్టీకి చెంది­న నేతల డిస్టిలరీలు, బార్లకు లబ్ధి చేకూర్చ­డం వల్ల ఖజానాకు రూ. 1,500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యా­దు ఆధారంగా ప్రాథమిక విచారణ జ­రి­పిన సీఐడీ, అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీనరేష్, అప్పటి ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబులపై కేసు నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో తమ­కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వారు హైకోర్టులో వే­ర్వే­రుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యా­జ్యా­లన్నింటిపై వేర్వేరుగా న్యాయమూర్తి జస్టిస్‌ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ఇటీవల ఈ వ్యా­జ్యాలపై వాదనలు విన్న న్యాయమూర్తి తీ­ర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై బుధవారం మధ్యాహ్నం ఆయన తన తీర్పును వెలువరించారు.

ఓటుకు  కోట్లు కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చేర్చాలని, ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫు న్యాయవాది విచారణ వాయి­దా వేయాలని లెటర్‌ సర్క్యులేట్‌ చేసిన కారణంగా విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తదు­పరి విచారణ ఏప్రిల్‌ జాబితాలో చేర్చా­లని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.

 
Advertisement
 
Advertisement