హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు
పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు
ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు
ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం
ఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు
సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులు
పిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయం
కౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి! ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఓ అభ్యర్ధిని కౌంటింగ్ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరి తెగించి ఆడుతున్న నాటకానికి తెర పడింది. ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది మంది పోలీసులు బాబుకు ఏజెంట్ల మాదిరిగా పని చేస్తున్నట్లు తేటతెల్లమైంది. న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మ యం వ్యక్తమవుతోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ, టీడీపీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాక్షిగా రుజువైంది.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్ వీడియో ఆధారంగా పిన్నెల్లి అరెస్టుకు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఈనెల 23న సానుకూల ఉత్తర్వులు పొందడం విదితమే. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు కానున్నట్లు అదే రోజు సాయంత్రం కల్లా సంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసు అధికారులు అడ్డగోలు వ్యవహారాలకు తెర తీశారు. అదే రోజు రాత్రి పిన్నెల్లిపై పాత ఘటనలకు సంబంధించి మూడు వేర్వేరు కేసులు హడావుడిగా నమోదు చేశారు.
ఆ ఘటనలు ఎప్పుడో జరిగితే పది రోజుల తరువాత తాపీగా పిన్నెల్లిపై హత్యాయత్నం సహా మూడు కేసులు బనాయించారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఎన్నికల సంఘం, పోలీసులు ఈ తప్పుడు కేసులు పెట్టారని, వాస్తవానికి పిన్నెల్లిని 23వ తేదీ రాత్రి నిందితుడిగా చేర్చారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే పోలీసులు తాము 22వ తేదీనే పిన్నెల్లిని నిందితునిగా చేర్చామని పేర్కొనడంతో న్యాయస్థానం ఈ విషయంలో వారిని స్పష్టత కోరింది. లిఖితపూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెల్లి తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అధికారికంగా పొందారు.
వాటిని సోమవారం కోర్టుకు సమరి్పంచారు. దీంతో పచ్చ ముఠాలకు వత్తాసు పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. పిన్నెల్లిని నిందితుడిగా చేర్చి 23వతేదీ రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది. దీంతో 23న మధ్యంతర ముందస్తు బెయిల్ పొందిన తరువాత పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్లు రుజువైంది. పిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్ర కోణం బహిర్గతమైంది. డీజీపీ, పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.
తీర్పు నేటికి వాయిదా
తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం తన నిర్ణయం వెలువరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిలు మంజూరు చేయగానే పిన్నెల్లిపై పోలీసులు అప్పటికప్పుడు మరో మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసుల్లో తనకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్లు వేశారు.
అనుబంధ వ్యాజ్యాలు..
పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాల్లో బాధితులు నంబూరి శేషగిరి రావు, నాగ శిరోమణి ఇంప్లీడ్ అవుతున్నారని, ఆ మేరకు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి తరఫున తాను వాదనలు వినిపిస్తానని తెలిపారు. అయితే మౌఖిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావును పిన్నెల్లి బెదిరించారని పోసాని పేర్కొన్నారు. నాగ శిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు.
23 రాత్రి 8 గంటలకు స్థానిక కోర్టులో మెమో
పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇప్పటికే పిన్నెల్లిపై 9 కేసులున్నాయన్నారు. పిన్నెల్లిపై నిఘా ఉంచాలని ఇదే కోర్టు ఈ నెల 23న ఉత్తర్వులిచ్చినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. క్రైం నెం 59లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడు నిందితునిగా చేర్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు. సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా చేరుస్తూ 23వతేదీ రాత్రి 8 గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు. దీంతో పిన్నెల్లిని 22వ తేదీనే నిందితుడిగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది.
అస్మిత్, చింతమనేనికి ఇచ్చినట్లే..
పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పిన్నెల్లి విషయంలో ఎన్నికల సంఘం తీరు వల్ల ఆ సంస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోందన్నారు. పిన్నెల్లిపై పలు కేసులున్నాయని పోసాని, పీపీ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలైన చింతమనేని ప్రభాకర్, అస్మిత్‌రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు. అస్మిత్‌రెడ్డిపై 30, చింతమనేనిపై 31 కేసులు నమోదయ్యాయన్నారు.
కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వకూడదంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ రాకూడదన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల 23న మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా పిన్నెల్లికి కూడా ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్ధించారు. పోలింగ్ కేంద్రం బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై రెండు కేసులు నమోదు చేశారని, ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకు నివేదించారు.
కౌంటింగ్ పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉంది..
కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే హక్కు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి ఉంటుందని టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. కౌంటింగ్ తేదీ సమీపిస్తున్నందువల్ల కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లిపై ఉందన్నారు. కౌంటింగ్ వద్ద అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా నష్టపోతారన్నారు. చింతమనేని, అస్మిత్‌రెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు పిన్నెల్లి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఈవీఎంల కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని 23వ తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెల్లిపై హత్యాయత్నంతో సహా మూడు కేసులు నమోదు చేశారన్నారు.
అయితే పోలీసులు 22నే ఆయన్ను నిందితుడిగా చేర్చామంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని నివేదించారు. ఈమేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్ల సరి్టఫైడ్ కాపీలను పిన్నెల్లి తరఫు మరో న్యాయవాది రామలక్ష్మణరెడ్డి కోర్టుకు సమరి్పంచారు. పోలీసులు దాఖలు చేసిన మెమోను పరిశీలించాలని నిరంజన్‌రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెల్లిని 23వ తేదీనే నిందితుడిగా చేర్చిన విషయాన్ని ధృవీకరించుకున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్ధించారు.
విచారణకు అశ్వనీ కుమార్ గైర్హాజర్..
క్రైం నెంబర్ 59 కేసులో సీఐ నారాయణ స్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన జూనియర్ కోర్టు ముందు హాజరై పిన్నెల్లి వ్యాజ్యాల్లో ఇంప్లీడ్ అవుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఓ పోలీసు తరఫున ప్రైవేటు న్యాయవాది హాజరు కావడం విస్మయం కలిగించింది. అశ్వనీ కుమార్ ఆ పోలీసు తరఫున హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారాన్ని మరింత సాగదీస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్వనీ కుమార్ సోమవారం విచారణకు గైర్హాజరైనట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
బాబు కుట్రలలో భాగస్వాములు..
చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్లే ఎన్నికల సంఘం, డీజీపీ, కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్ధి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీకి వంతపాడే పోలీసులు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు. చంద్రబాబు, బీజీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పినట్లుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి పురందేశ్వరి సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా పోలింగ్ రోజు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకొనే అవకాశం లేకుండా చేయడంతోపాటు హింస చెలరేగేందుకు దోహదం చేసిందని పేర్కొంటున్నారు. హైకోర్టు సాక్షిగా తాజాగా బయటడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment