
డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకుంటున్నాం
ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ రమణ అరెస్ట్ విషయంలో డీజీపీ నుంచి నివేదిక ఆశించాం.. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామంటే.. అలాగే ఆదేశాలిస్తాం
పరస్పర విరుద్ధంగా విశాఖ కమిషనర్, ప్రకాశం ఎస్పీల నివేదికలు.. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా
డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండానియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు.
కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. – హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: డీజీపీ పోస్టుపై తమకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నామని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బొసా రమణ అరెస్ట్ విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆక్షేపించింది. రమణ అరెస్ట్ వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరామని పేర్కొంది.
రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక సమర్పించాలని డీజీపీ భావిస్తే ఆ మేరకు ఆదేశాలు జారీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పింది. రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్పీ దాఖలు చేసిన నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది.
ఈ కేసులో పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) అందుబాటులో లేనందున సహాయ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణను మార్చి 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రమణ అక్రమ నిర్బంధంపై పిటిషన్...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ విశాఖ జిల్లా మద్దిపాలెం, చైతన్యనగర్‌కి చెందిన బొసా రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రమణ భార్య బొసా లక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.

పరస్పర విరుద్ధంగా రెండు నివేదికలు...
ధర్మాసనం ఆదేశాల మేరకు బొసా రమణ అరెస్ట్ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం ఎస్‌పీ తమ నివేదికలను అందచేశారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, ఈ రెండు నివేదికల్లో అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
రమణను పొదిలి పోలీసులు విశాఖలోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారని కమిషనర్ చెబుతుండగా.. ప్రకాశం ఎస్‌పీ మాత్రం విశాఖ ఎంవీవీ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారని తెలిపింది. అరెస్ట్ విషయంలో వాస్తవాలను కోర్టు ముందుంచడం లేదని, అందువల్లే డీజీపీ నుంచి నివేదిక కోరామని స్పష్టం చేసింది.
వర్రా అక్రమ నిర్బంధం కేసులో విద్యాసాగర్ నాయుడుకు నోటీసులు
సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధం వ్యవహారంలో వైఎస్సార్ కడప జిల్లా అప్పటి ఇన్‌చార్జ్ ఎస్‌పీ విద్యాసాగర్ నాయుడిని హైకోర్టు సుమోటోగా వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చింది. వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధం విషయంలో వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్‌పై నిర్దిష్ట ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు తెలిపింది.
వాటికి బదులివ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని స్పష్టం చేసింది. తన భర్త రవీంద్రరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వర్రా కళ్యాణి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment