
ఆల్మట్టి డ్యాం ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం
ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణకు రూ.70 వేల కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాపాలు తెలుగు రాష్ట్రాలకు ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు పెను శాపాలుగా పరిణమించాయి. ఆల్మట్టి డ్యాంపై 1995 నాటి ఘోర తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. కృష్ణమ్మను కట్టడి చేస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం తాజాగా సన్నద్ధం కావటానికి నాడు చంద్రబాబు నిర్వాకాలే కారణమని సాగునీటి నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
కర్ణాటక క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్...
ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచడానికి కర్ణాటక కేబినెట్ ఈ ఏడాది సెప్టెంబరు 17న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన, 75,663 ఎకరాల భూ సేకరణ కోసం రూ.70 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. మాగాణి భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున పరిహారం చెల్లించేందుకు అనుమతించింది.
తద్వారా ఆల్మట్టి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనుంది. అదనంగా 5,30,475 హెక్టార్లకు నీటిని అందించడానికి వీలుగా కాలువల వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. తద్వారా ఆల్మట్టి డ్యాంలోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఆయకట్టుకు తరలించేందుకు కర్ణాటక సర్కార్ ప్రణాళిక రచించింది. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమయ్యే సంవత్సరాల్లో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలను దాటి కృష్ణా నది నుంచి ఒక్క నీటి చుక్క కూడా శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉండదని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయకట్టు ఎడారే.. తాగునీటికీ తిప్పలే!
2015–16లో శ్రీశైలానికి కనిష్టంగా 58.69 టీఎంసీల ప్రవాహం రాగా.. అందులో కృష్ణా నుంచి వచ్చింది కేవలం 24.97 టీఎంసీలేనని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల శ్రీశైలంపైనే ఆధారపడ్డ హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలిగొండ.. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలు, కృష్ణా డెల్టా ఆయకట్టు ఎడారిగా మారుతుందని.. తాగునీటికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల బ్యాక్ వాటర్ ప్రభావంతో తమ రాష్ట్రంలో సంగ్లి, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని.. దీనిపై సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర కంటే ఏపీకే తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాడు చంద్రబాబు నిర్వాకాలే...
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు కింద 173 టీఎంసీలను కర్ణాటకకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. దాంతో అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం, హిప్పర్గి వియర్) పనులను 1964 మే 22న కర్ణాటక చేపట్టింది. అప్పట్లో ఆల్మట్టి డ్యాంను 509.016 మీటర్ల ఎత్తుతో చేపట్టింది. అనంతరం కర్ణాటకలో 1994 డిసెంబర్ 11న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలో జనతాదళ్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 509.016 నుంచి 524.256 మీటర్లకు పెంచుతూ 1995 అక్టోబరు 27న నాడు కర్ణాటకలోని దేవెగౌడ సర్కార్ పనులు చేపట్టినా అప్పటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదని సాగునీటి రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
1996 లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేయడంలో కీలకంగా వ్యవహరించినట్లు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. 1996 సెప్టెంబరు 1న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం నిధులను రుణంగా మంజూరు చేసేలా చక్రం తిప్పారు. దాంతో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు పనులు వేగవంతమయ్యాయి. ఇంత జరుగుతున్నా నాడు చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.ఇక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సంగ్లి, కొల్లాపూర్ జిల్లాలు ముంపునకు
గురవుతాయంటూ అప్పట్లోనే మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆయకట్టుకు నీళ్లందవని రైతులు రోడ్డెక్కడం.. మహారాష్ట్ర సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తప్పనసరి పరిస్థితుల్లో నాటి చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడిగా సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ దాఖలు చేసింది. కానీ.. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ సమర్థంగా వాదనలు వినిపించడంలో విఫలమైంది. పర్యవసానంగా ఆల్మట్టి డ్యాంలో నీటి నిల్వ ఎత్తును 519.06 మీటర్లకు పరిమితం చేయాలని 2000 ఏప్రిల్ 25న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు గడువు మే 31, 2000తో ముగియనున్న నేపథ్యంలో.. కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం ఏర్పాటుచేసే కొత్త ట్రిబ్యునల్ వద్ద ఆల్మట్టి డ్యాం ఎత్తును 524.256 మీటర్లకు పెంచడంపై వాదనలు వినిపించాలని నాడు కర్ణాటక సర్కార్‌కు సూచించింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లోనూ వెంటాడిన బాబు పాపం.
కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయడానికి 2004 ఏప్రిల్ 2న జస్టిస్ బ్రిజేష్‌కుమార్ అధ్యక్షతన కేంద్రం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా 2002 నాటికే కర్ణాటక సర్కార్ పనులను పూర్తి చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2002–03లో 519.06 మీటర్ల ఎత్తుతో 129.72 టీఎంసీలను నిల్వ చేసింది. తాము ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ఇప్పటికే పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక వాదించింది.
నిధులు వృథా అవుతాయన్న వాదనతో ఏకీభవించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013 నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రపద్రేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో ఎస్పెల్పీలు దాఖలు చేశాయి. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టును ఆదేశించింది. ప్రస్తుతం ఆ ఎస్సెల్పీలపై సుప్రీం కోర్టు విచారణ చేస్తుండటంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాయడం గమనార్హం.