
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
.. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు.

మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు.

.. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు.