దాడులు కాదు.. సూపర్‌ 6 అమలు ఎప్పుడు? | ysrcp laedars comments on tdp schemes | Sakshi
Sakshi News home page

దాడులు కాదు.. సూపర్‌ 6 అమలు ఎప్పుడు?

Published Fri, Jun 21 2024 4:33 AM | Last Updated on Fri, Jun 21 2024 8:20 AM

ysrcp laedars comments on tdp schemes

ఇంకా ఎన్ని విధ్వంసాలు.. ఎంత మందిని చంపుతారు? 

ఊరురా తిరుగుతాం.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం  

మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ గీత, ఎమ్మెల్యే సుధా ధ్వజం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు ఆపి.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్‌ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు ఇస్తామన్న రూ.3 వేలు వెంటనే ఇవ్వాలన్నారు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో విజిటర్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పై కూడా అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫర్నిచర్‌ విలువ చెబితే చెల్లిస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోగా, దుష్ప్రచారం చేస్తుండటం దారుణం అన్నారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కార్యకర్తలకు అండగా ఉంటాం 
టీడీపీ దాడులకు భయపడేది లేదు. ఎవరిని చంపుతారో చంపుకోమనండి. టీడీపీ దాడుల్లో గాయపడిన ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబం వద్దకు తాను వెళ్తానని, వాళ్లకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఎటువంటి రివ్యూ చేయకుండా వైఎస్‌ జగన్‌కు సెక్యూరిటీ తీసేయడం దారుణం. మమ్మల్ని ఎవరు టార్గెట్‌ చేసినా భయపడేది లేదు. మేం ప్రజల మధ్య ఉంటాం. వారి సమస్యల కోసం పోరాటం చేస్తాం.

రుషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తి. అవి వైఎస్‌ జగన్‌వి కావు. వీఐపీల కోసం భవనాలు కడితే దానినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఎల్లో బ్యాచ్‌ చెప్పేవన్నీ అబద్దాలే. రుషికొండలో కట్టిన ప్రభుత్వ భవనాలి్న.. జగన్‌ నివాసంగా ఎల్లో మీడియా, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం కట్టించిన గెస్ట్‌ హౌస్‌లో ఉండాల్సిన అవసరం వైఎస్‌ జగన్‌కు లేదు. ఎక్కడైనా ఆయన సొంత ఇంటిలోనే ఉంటారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారు. – కొడాలి నాని, మాజీ మంత్రి  

టీడీపీ చేసిన మంచి ఒక్కటీ లేదు 
రుషికొండపై నిరి్మంచిన ప్రభుత్వ భవనాలు విశాఖకే తలమానికంగా ఉంటాయి. దీనిపై ఎల్లో మీడియా, కూటమి పార్టీలు వికృత రాజకీయం చేస్తున్నాయి. రూ.700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిరి్మంచింది టీడీపీ ప్రభుత్వం. రుషికొండలో రూ.400 కోట్లతోనే ఐకానిక్‌ భవనాలు నిర్మించింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలివి. శిథిలమైన హరిత రిసార్ట్స్‌ స్థానంలో నూతన భవనాల నిర్మాణం.

విశాఖ నుంచి పరిపాలనకు ఈ భవనాలు అనువైనవని అధికారుల కమిటీ తేలి్చంది. దీంతో సీఎం నివాసం, కార్యాలయానికి అనుకూలంగా కొన్ని మార్పులు చేస్తే అవి సొంత భవనాలంటూ టీడీపీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభు­త్వానికి చేతకాదు. 2014 – 2019 మధ్య రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటి లేదు. అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది.  – గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి

వైఎస్‌ జగన్‌ ఊరూరా తిరగమన్నారు  
వైఎస్‌ జగన్‌ మమ్మల్ని ఊరూరా తిరగమన్నారు. కూటమి పార్టీల దాడులు, ఆస్తుల విధ్వంసం సమయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని సూచించారు. 40 శాతం ఓటు బ్యాంకు కలిగిన మనం భయపడకూడదంటూ మనో ధైర్యం నింపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి ప్రజలెవరూ మరచిపోలేదు. ప్రతి ఇంట్లో జగన్‌ చేసిన మంచి కనిపిస్తోంది.

ప్రతి ఇంటికీ మేం తలెత్తుకుని పోగలం. చెప్పిన పని చేశాం కాబట్టి.. ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య అపజయం సంభవించింది. బాబు మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై కోపం వస్తుంది. అప్పుడు వైఎస్సార్‌సీపీ పట్ల అభిమానమూ మళ్లీ రెట్టింపు అవుతుంది. మళ్లీ వైఎస్సార్‌సీపీ రికార్డు మెజార్టీతో గెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ప్రతి రోజు మోసపోతున్న ప్రజలకు అండగా ఉంటాం.  – వంగా గీత, మాజీ ఎంపీ  

అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలి. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిరి్మంచాం. మేము కట్టిన మెడికల్‌ కాలేజీలు, నాడు – నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా టీడీపీ నేతలు ఇలానే ప్రజలకు చూపించాలి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిరి్మంచాం.

గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణలోనే నిర్మాణాలు చేపట్టాం. ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్‌ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్‌ ఇలా కూడా ఉంటుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా? అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్‌ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదం. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.  – ఆర్కే రోజా, మాజీ మంత్రి  

మా ఓట్లు ఏమయ్యాయి.. అంటున్నారు
బద్వేలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 99 శాతం పైగా హామీలను అమలు చేయటంతో సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. మా ఓటు మీకే నమ్మా? మీ ఫ్యాన్‌ గుర్తుకే వేసి తీరుతాం అని ఓటర్లు భరోసా ఇచ్చారు. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్‌ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయొచ్చనలేదా? ఎన్నికల ఫలితాలు చూసి ఓటర్లే ఆశ్చర్యపోతున్నారు.

మేం జగన్‌కు వేసిన ఓట్లు ఏమయ్యాయి అని ప్రశి్నస్తున్నారు.  అదే మన ప్రభుత్వం ఉండి ఉంటే ఈపాటికే విద్యా దీవెన ఇచ్చేవాళ్లం. రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా అన్నీ సమయానికి అందేవి. ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా ఇచ్చాం. ఏ పథకం ఏ నెలలో అమలవుతుందో క్యాలెండర్‌ ఇచ్చి.. తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో వైఎస్‌ జగన్‌ నగదు జమ చేసేవారు. ఇప్పుడు కూడా నిత్యం ప్రజల్లో ఉంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.      – దాసరి సుధా, బద్వేలు ఎమ్మెల్యే  

టీడీపీ కపట నాటకాన్ని ప్రజలు గమనించాలి 
ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ మాకు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారు. ఇంత చేసినా ఎక్కడ మోసం జరిగింది అనేదే ప్రశ్న. ఇప్పుడు రుషికొండపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిరి్మంచారు.గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీ­ర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి.

వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిరి్మంచారు. ప్రెసిడెన్షియల్‌ సూట్, సూట్‌ రూమ్, బాంక్వెట్‌ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూమ్స్, సూట్‌ రూమ్స్, డీలక్స్‌ గదులు, బాంక్వెట్‌ హాల్‌తో కళింగ బ్లాక్‌ నిరి్మంచారు. సూట్‌ రూమ్‌లు, కాన్ఫరెన్స్‌ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్‌ లాంజ్, బిజినెస్‌ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్‌ సూట్‌ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్‌ సౌకర్యాలతో ఈస్ట్రన్‌ గంగా బ్లాక్‌లని నిరి్మంచారు. ఈ ఏడు బ్లాక్‌లు ప్రభుత్వానివే. అయినప్పటికీ ఈ విష ప్రచారం టీడీపీ సంస్కృతికి నిదర్శనం.   దాడులు, ఆస్తుల విధ్వంసం ఆపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి.   – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement