
పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది.
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అబద్దాలు, దుష్ప్రచారంతో హడావుడి చేసిన పవన్ కల్యాణ్ స్వరం నేడు మారిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై శర వేగంగా స్పందించింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంది.. అయితే, టీడీపీ ప్యాకేజీని దండిగా అందుకున్న పవన్.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఇష్టానుసారం మాట్లాడారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాను పవన్ కల్యాణ్ వెలగబెడుతున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్న ఆయన.. ప్రాణాలు కంటే డబ్బులే ప్రధానం అన్నట్లుగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల ప్రాణాల కంటే పరిశ్రమలే ముఖ్యం అనే విధంగా మాట్లాడటం పట్ల నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. ‘‘సేఫ్డీ ఆడిట్ జరగాలని మొదటి నుంచి అడుగుతున్నా.. సేఫ్టీ ఆడిట్ ద్వారా పరిశ్రమలు మూతపడతాయని అనుకుంటున్నా.. ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదనే అడుగు ముందుకు వేయలేకపోతున్నా’’ అంటూ పవన్ ప్లేటు తిప్పేశారు.