almatti dam
-
524 మీటర్లకు ఆల్మట్టి డ్యామ్
రాయచూరు రూరల్: కర్ణాటకలోని విజయపుర (బీజాపుర) జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న భారీ జలాశయం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు. ఆల్మట్టి డ్యామ్ ప్రస్తుత ఎత్తు 519 మీటర్లు కాగా, దానిని 524.256 మీటర్ల ఎత్తుకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకోసం రూ.లక్ష కోట్లతో భారీ విస్తరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ విషయమై సోమవారం బెళగావిలో రైతు సంఘాల నాయకులు, ఉత్తర కర్ణాటక ప్రజాప్రతినిధులతో సీఎం సిద్దరామయ్య సమావేశమై ప్రత్యేకంగా చర్చించారు. కాగా, అప్పర్ కృష్ణా మూడో దశ పథకం కింద, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడి ఆల్మట్టి ఎత్తు పెంపు ఉంటుందని అధికారులు చెప్పడం గమనార్హం. డ్యామ్ ఎత్తు పెంపు వల్ల తమకు దక్కే 173 టీఎంసీల కృష్ణా జలాల్లో 130 టీఎంసీల వాడకానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. 13.10లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల లభించే ఆ నీటిలో కలబుర్గి, రాయచూరు, కొప్పళ్, విజయపుర, యాదగిరి, బాగల్‌కోట, గదగ్ జిల్లాల్లోని 13.10 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డ్యామ్ ఎత్తు పెంపు వల్ల నీటి మట్టం పెరిగి పెద్ద సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతాయి. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పరిహారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
శ్రీశైలం చెంతకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఎగువ నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు 33,499 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 813.7 అడుగుల్లో 36.56 టీఎంసీలకు చేరుకుంది. గరిష్ట నీటి మట్టం 885 అడుగులున్న ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 179.26 టీఎంసీలు అవసరం. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 79 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా 69 వేల క్యూసె క్కులను దిగువకు వదులుతున్నారు. నారాయ ణపూర్ డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులు చేరుతుండగా.. 1,08,860 క్యూసెక్కులను విద్యుత్కేంద్రం, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.దాని దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 90,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 17 క్రస్టుగేట్లను ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలారు. అలాగే ఎగువ, దిగువ జెన్కో జల విద్యుత్కేంద్రంలోని 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టగా ఇందుకోసం 33,084 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, కుడి, ఎడమ కాల్వలతోపాటు నెట్టెంపాడు, భీమా లిఫ్టులకు కలిపి మొత్తం 1,04,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి వరద ప్రవాహం లేదు.తుంగభద్రలో...కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి కొనసాగుతోంది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌లోకి 1,03,787 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.77 టీఎంసీలకు చేరుకుంది. మరో 37 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేస్తారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల్లో తుంగభద్ర ప్రాజెక్టు నిండుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.అటు కృష్ణా ప్రధానపాయ.. ఇటు తుంగభద్ర బేసిన్లలో శనివారం వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదివారం కూడా వరద ఇదే రీతిలో కొనసాగుతుందని కేంద్ర జలసంఘం (సీడ బ్ల్యూసీ) అంచనా వేసింది. ఎగువన ఆల్మట్టి, నారా యణపూర్ జలాశయాలు ఇప్పటికే నిండగా, మరో మూడు నాలుగో రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండే అవకాశాలున్నాయి. దీంతో మరో నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలా శయానికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశముంది. వర్షాలు కొనసాగితే నెలాఖరు లోగా శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.మూసీ ప్రాజెక్టుకు జలకళకేతేపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకుంది. హైదరాబాద్‌తోపాటు మూసీ నది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది. బిక్కేరు వాగు నుంచి కూడా నీరు వస్తుండటంతో మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. శనివారం ఉదయం ప్రాజెక్టుకు 810 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో.. సాయంత్రానికి ఒక్కసారిగా 1700 క్యూసెక్కులకు పెరిగింది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.06 టీఎంసీల నీరు ఉంది. -
కృష్ణాలో నిలకడగా..
సాక్షి, అమరావతి/రాయచూరు రూరల్: పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద నిలకడగా కొనసాగుతోంది. గురువారం కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లోకి 72,286 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 14 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 65,580 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 68,797 క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 46,329 క్యూసెక్కులు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25,174 క్యూసెక్కులు దిగువకు వదులుతోంది. ఈ జలాలు శుక్రవారానికి శ్రీశైలానికి చేరుకోనున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ కేంద్రంలో తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. ఇందుకోసం 7,064 క్యూసెక్కులను దిగువకు తరలిస్తుండటంతో శ్రీశైలంలో నీటి నిల్వ 32.37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి తరలిస్తున్న జలాలతో నాగార్జున సాగర్‌లోకి 23,851 క్యూసెక్కులు వస్తున్నాయి. దీంతో సాగర్‌లో నీటి నిల్వ 123.34 టీఎంసీలకు చేరుకుంది. ఇక కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి పెరిగి తుంగభద్ర డ్యామ్‌లోకి 82,491 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ నీటి నిల్వ 46.80 టీఎంసీలకు చేరుకుంది. శుక్రవారం తుంగభద్ర డ్యామ్‌లోకి లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది.గోదావరిలో పెరుగుతూ..పోలవరం వద్దకు 2.30 లక్షల క్యూసెక్కుల వరదసాక్షి, అమరావతి/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం పోలవరం ప్రాజెక్టులోకి 2.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా వచ్చిన జలాలను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,31,161 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 8.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు వదులుతూ మిగతా 2,23,961 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శుక్రవారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలంలో నీటిమట్టం గురువారం సాయంత్రం 18.20 అడుగులకు చేరింది.పాపికొండల విహార యాత్రకు బ్రేక్బుట్టాయగూడెం: పాపికొండల విహార యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటం, తుఫాన్ హెచ్చరికలు, గోదావరి నదికి వరద తాకిడి పెరగడం వల్ల యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఎగువన గోదావరి ప్రవాహం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రానికి 22 అడుగుల వరకు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. -
కృష్ణాలో పెరిగిన వరద
సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్ డ్యామ్‌లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది. మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు భారీగా వరద కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్ఎల్సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 24ఏఎల్ఆర్129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు 24ఎస్ఆర్ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం -
అన్నీ మంచి శకునములే
సాక్షి, అమరావతి: నీటి సంవత్సరం ప్రారంభమైన 6 రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. ఆల్మట్టిలోకి 1.1, తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి. ఎన్నడూ లేని రీతిలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నెల మూడు, నాలుగో వారాల్లో కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలానికి కృష్ణమ్మ ముందుగానే చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నీ మంచి శకునములే కనిపిస్తుండటంతో కృష్ణా బేసిన్లో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నీటి సంవత్సరం ముగిసే నాటికి అధిక నీటి నిల్వ కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లో సోమవారం నాటికి 129.72 టీఎంసీలకు గాను 48.9 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్‌లో 37.64 టీఎంసీలకు గాను 30.49 టీఎంసీలు ఉన్నాయి. ఈ రెండు డ్యామ్‌లు నిండటానికి 87.97 టీఎంసీలు అవసరం. తుంగభద్ర డ్యామ్‌లో 100.86 టీఎంసీలకు గాను 39.48 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ డ్యామ్ నిండటానికి 61.38 టీఎంసీలు అవసరం. గతేడాది కృష్ణా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల దాదాపు 8 నెలలపాటు ప్రవాహం కొనసాగడంతో సాగు, తాగునీటి అవసరాలకు వాడుకోగా నీటి సంవత్సరం ముగిసే నాటికి (జూన్ 1న నీటి సంవత్సరం ప్రారంభమై మే 31తో ముగుస్తుంది) ఆల్మట్టి, నారాయణపూర్ తుంగభద్ర డ్యామ్‌లలో అధికంగా నీటి నిల్వ ఉండటం ఇదే ప్రథమం. ప్రారంభంలోనే వరద ప్రవాహం నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కృష్ణా బేసిన్లో ఎగువన జూన్ 1 నుంచి 3 వరకూ వర్షాలు కురిశాయి. దాంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆరు రోజుల్లోనే ఆల్మట్టిలోకి 1.1 టీఎంసీలు చేరగా.. దానికి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి 4 టీఎంసీలు చేరాయి. తుంగభద్ర డ్యామ్‌లోకి 2.2 టీఎంసీలు చేరాయి. కృష్ణా బేసిన్లో ఎగువన ప్రధానంగా పశ్చిమ కనుమల్లో ఈ నెల 3, 4 వారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు వర్షాలు కురిస్తే నెలాఖరు నాటికే ఆల్మట్టి, నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. అప్పుడు జూలై మొదటి లేదా రెండో వారం నాటికే శ్రీశైలానికి కృష్ణమ్మ చేరే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలై 17న ఎగువ నుంచి కృష్ణమ్మ శ్రీశైలానికి చేరగా.. ఈ ఏడాది అంతకంటే ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
నిండుకుండలా సాగర్!
సాక్షి, హైదరాబాద్/ధరూరు/ దోమలపెంట (అచ్చంపేట): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి సాగర్ దాకా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు. ఆ నీరంతా దిగువన నాగార్జున సాగర్‌కు చేరుతూ.. నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం కల్లా సాగర్ పూర్తిగా నిండుతుందని, గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. భారీగా ప్రవాహాలు.. జూరాల ప్రాజెక్టుకు శనివారం రాత్రి 9 గంటల సమయంలో 4.67 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. 47 గేట్లను ఎత్తి 4.75 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఈ వరదకుతోడు సుంకేశుల ద్వారా చేరుతున్న ప్రవాహాలు కలిసి.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని కొనసాగిస్తూ.. పదిగేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. దీనితోపాటు కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తితో 66 వేల క్యూసెక్కుల మేర విడుదలవుతున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 264 టీఎంసీలు దాటింది. మరో 48 టీఎంసీలు వస్తే సాగర్ నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికల్లా ప్రాజెక్టు నిండనుందని, గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాగర్‌లో విద్యుదుత్పత్తి ద్వారా విడుదలవుతున్న నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. అక్కడ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్నాయి. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టా కాల్వలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. 26,712 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్/ బెంగళూరు: కృష్ణా, ఉప నదులు మలప్రభ, ఘటప్రభల నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు 1,41,389 క్యూసెక్కులు చేరుతుండటం, వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) మార్గదర్శకాల మేరకు కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేసింది. దిగువకు 1.80 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఆ ప్రవాహం నారాయణపూర్ డ్యామ్‌లోకి చేరుతుండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా డ్యామ్‌ను ఖాళీ చేస్తూ దిగువకు 1,87,678 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ► ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలంలోకి గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతోంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్‌లు నిండటంతో వరద నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ 49.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 51 టీఎంసీల ప్రవాహం వస్తే తుంగభద్ర డ్యామ్ నిండిపోతుంది. ► పశ్చిమ కనుమల్లో శుక్రవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కృష్ణా, ఉప నదులకు శనివారం వరద ప్రవాహం పెరుగుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. -
నేడు జూరాలకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి: ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాల వైపు కృష్ణమ్మ కదలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 56,905 క్యూసెక్కులు చేరుతుండటంతో.. విద్యుత్ కేంద్రం ద్వారా 45 వేల క్యూసెక్కులను సోమవారం దిగువకు విడుదల చేశారు. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్‌లోకి 43,616 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ 34.87 టీఎంసీలకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 27,574 క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన జలాలు మంగళవారం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు చేరనున్నాయి. 15 రోజుల ముందే శ్రీశైలానికి.. ► వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టులోకి 6,032 క్యూసెక్కులు చేరుతుండగా.. నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750, భీమా ఎత్తిపోతల ద్వారా 650, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 151 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. ► ప్రస్తుతం జూరాలలో 8.38 క్యూసెక్కులు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో 1.27 టీఎంసీలు అవసరం. ► జూరాల నుంచి జలాలను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈ జలాలు బుధవారం శ్రీశైలం జలాశయానికి చేరనున్నాయి. ► గతేడాది జూలై 30న శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది పక్షం రోజుల ముందే ఎగువ నుంచి వరద నీరు చేరనుండటం గమనార్హం. తుంగభద్ర, గోదావరిలో తగ్గిన ప్రవాహం ► తుంగభద్ర నదిలో వరద తగ్గుముఖం పట్టింది. టీబీ డ్యామ్‌లోకి 17,550 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 21.8 టీఎంసీలకు చేరింది. టీబీ డ్యామ్ నిండాలంటే 79 టీఎంసీలు అవసరం. ► పులిచింతలకు దిగువన కృష్ణా బేసిన్లో కురిసిన వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీలోకి 13,485 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 6,416 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 7,069 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ► గోదావరిలో వరద ప్రవాహం కూడా క్రమేణ తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 96,842 క్యూసెక్కులు వస్తుండగా.. 2,100 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి.. మిగిలిన 94,762 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 71.601 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార నది నుంచి 3,499 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,205 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 8.073 టీఎంసీల వంశధార జలాలు కడలి పాలయ్యాయి. -
స్థిరంగా ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి ఆదివారం 69,868 క్యూసెక్కులు చేరుతున్నాయి. డ్యామ్‌లో నీటి నిల్వ 95.5 టీఎంసీలకు చేరడంతో.. విద్యుత్ ఉత్పత్తి పెంచి 36 వేల క్యూసెక్కులకుపైగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 39,720 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 33.47 టీఎంసీలకు చేరింది. మరో 4 టీఎంసీలు వస్తే నారాయణపూర్ నిండుతుంది. మంగళవారం నారాయణపూర్ గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను వదిలే అవకాశం ఉంది. తుంగభద్రలో తగ్గింది ► తుంగభద్రలో వరద కొంత తగ్గింది. డ్యామ్‌లోకి 24,497 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 20.32 టీఎంసీలకు చేరింది. ► కృష్ణా నది నుంచి జూరాల ప్రాజెక్టులోకి 4,130 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 8.01 టీఎంసీలకు చేరింది. జూరాల నిండాలంటే మరో 1.5 టీఎంసీలు అవసరం. జూరాల నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 750.. భీమా ఎత్తిపోతల ద్వారా 650 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం తరలిస్తోంది. ► శ్రీశైలం జలాశయంలోకి 2,557 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 37.25 టీఎంసీలకు చేరింది. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో మరో ఐదారు రోజుల్లో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉంది. ► శ్రీశైలానికి దిగువన కురిసిన వర్షాల వల్ల నాగార్జున సాగర్‌లోకి 1,202 క్యూసెక్కులు చేరుతుండగా.. ఏఎమ్మార్పీ ద్వారా 500 క్యూసెక్కులు, విద్యుత్కేంద్రం ద్వారా 460 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 1,390 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 7.43 టీఎంసీలకు చేరింది. ► మున్నేరు, కట్టలేరు, వైరా వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి వరద జలాలు చేరుతున్నాయి. 16,316 క్యూసెక్కుల ప్రవాహ జలాలు వస్తుండగా.. డెల్టా కాలువలకు 7,725 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 8,591 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. నిలకడగా గోదారమ్మ.. ► గోదావరి నదిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 3,100 క్యూసెక్కులను విడుదల చేసి 1,20,022 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి 3,987 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 3,693 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. -
రేపు జూరాలకు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత వాటర్ ఇయర్లో తొలిసారి ఎగువ ప్రాజెక్టుల నుంచి దిగువకు కృష్ణా నదీ ప్రవాహాలు మొదలయ్యాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ రెండు గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతోంది. ఈ నీరంతా దిగువన జూరాల వైపుగా తన ప్రయాణం మొదలు పెట్టగా, మంగళవారానికి నీరు జూరాలకు చేరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. దిగువకు పరుగు... గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్రలో వాగులు, వంకలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులో వరద పెరిగింది. ఆదివారం ప్రాజెక్టులోకి 69,868 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు 98 టీఎంసీలు చేరింది. ఇప్పటివరకు ప్రాజెక్టులోకి కొత్తగా 78 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టులో మరో 31 టీఎంసీల మేర ఖాళీ ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు మరో వారంపాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నుంచి 36,130 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి ప్రవాహాలు మరింత పెరిగాయి. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 39,720 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో నీటి నిల్వ 37.64 టీఎంసీలకుగాను 33.47 టీఎంసీలు ఉంది. మొత్తంగా ఆల్మట్టి, నారాయణపూర్‌లలో 35 టీఎంసీల మేర నిల్వలు ఖాళీగా ఉన్నప్పటికీ ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలు ఉండటంతో నారాయణపూర్ రెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి ఆదివారం ఉదయం 11,240 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు. సాయంత్రానికి నీటి విడుదలను 26 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ నీరంతా కర్ణాటకలోనే ఉన్న గూగుల్, గిరిజాపూర్ బ్యారేజీలను దాటుకుంటూ మంగళవారం నాటికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ఇప్పటికే స్థానిక పరీవాహకం నుంచి 4,140 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నిల్వ 9.66 టీఎంసీలకుగాను 8.10 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా ద్వారా 1,445 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రవాహాలు పెరిగే అవకాశాల నేపథ్యంలో సోమ లేదా మంగళవారం నుంచి పవర్‌హౌస్ ద్వారా నీటిని దిగువనున్న శ్రీశైలానికి వదిలే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటే జూరాల గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలానికి 2,557 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకుగాను 37.25 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌కు 1,202 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 312 టీఎంసీలకుగాను 168.35 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 11,102 క్యూసెక్కుల మేర ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 33.60 టీఎంసీలుగా ఉంది. -
వారంలో శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/హొసపేటె: ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి కృష్ణా వరద జలాలు జూరాల, శ్రీశైలానికి మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని అధికాలు అంచనా వేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. శనివారం ఆల్మట్టి జలాశయంలోకి 73,791 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 92.45 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి నిండాలంటే ఇంకా 37 టీఎంసీలు అవసరం. శనివారం నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం ఆల్మట్టిలోకి వరద ప్రవాహం మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం లేదా మంగళవారం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలే అవకాశంఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శనివారం నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం ► ఆల్మట్టికి దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 27,756 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 29.86 టీఎంసీలకు చేరుకుంది. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే మరో 8 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి నుంచి భారీ వరదను విడుదల చేయనున్న నేపథ్యంలో ఒకే రోజులో నారాయణపూర్ నిండే అవకాశం ఉంది. నారాయణపూర్ గేట్లను బుధవారంలోగా ఎత్తే అవకాశం ఉంది. ► కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 34,374 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.25 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 82 టీఎంసీలు అవసరం. ► తుంగభద్ర జలాశయానికి దిగువన కురిసిన వర్షాలకు సుంకేశుల బ్యారేజీలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేశుల నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయగా మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. ► నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల గోదావరిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,23,122 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7,900 క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 1,15,222 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. జూన్ 1 నుంచి శనివారం వరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 52.885 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి. ► గొట్టా బ్యారేజీలోకి వంశధార ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 5,474 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 294 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 5,180 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి శనివారం వరకు గొట్టా బ్యారేజీ నుంచి 7.477 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ► నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,808 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 980 క్యూసెక్కులను వదలి మిగిలిన 1828 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఐదు గేట్లు ఎత్తివేత సముద్రంలోకి 3,625 క్యూసెక్కుల నీరు విడుదల కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండటంతో శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఒక అడుగు మేర పైకెత్తి మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి కృష్ణా నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంచి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయించగా.. సాయంత్రం 4 గంటలకు కీసర నుంచి 11,725 క్యూసెక్కుల నీరు వచ్చిందని డ్యామ్ కన్జర్వేషన్ ఈఈ రాజా స్వరూప్‌కుమార్ తెలిపారు. దీంతో 3,625 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టినట్టు చెప్పారు. -
ఆల్మట్టికి పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాకు ఎగువన వర్షం, దిగువన హర్షం.. చినుకు చినుకుకు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పరీవాహకం పరవశిస్తోంది. ప్రవాహాలు పెరిగినకొద్దీ దిగువ ప్రాజెక్టుల్లో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదలను కర్ణాటక మొదలు పెట్టింది. మరో 50 టీఎంసీలు చేరితే దిగువకు... పశ్చిమ కనుమల్లో 3, 4 రోజులుగా 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టిలోకి ప్రవాహాలు పుంజుకుంటున్నా యి. గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూ సెక్కుల ప్రవాహాలు రాగా, ఇవి సాయం త్రానికి 52 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు 85 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్లో 60 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి ప్రవాహాలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆల్మట్టిలో విద్యుదుత్పత్తిని కర్ణాటక ఆరంభించింది. విద్యుదుత్పత్తి ద్వారా 10,088 క్యూసెక్కుల నీటిని పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేస్తోంది. మరో 45 టీఎంసీలు చేరితే గేట్లెత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మ ట్టి నుంచి నీటి విడుదలతో దిగువన నారాయణపూర్‌లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడ ప్రస్తుతం 37 టీఎంసీలకుగానూ 26.50 టీఎంసీల నీరునిల్వ ఉంది. మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుద ల చేసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఇదే రీతిన కొనసాగితే ఈ నెల మూడోవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయొచ్చని నీటి పారుదల శాఖ అంచనా. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.80 టీఎంసీలకు చేరింది. ఫలితంగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పంపు ల ద్వారా 1,466 క్యూసెక్కుల నీటిని పం పింగ్ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి 16,211 క్యూసెక్కుల మేర నీరు వస్తుం డగా, నిల్వ 100 టీఎంసీలకుగానూ 14 టీ ఎంసీలకు చేరింది. ఉజ్జయిని నదిలోకి 4,587 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇ క్కడ నిల్వ 117 టీఎంసీలకుగానూ 60 టీ ఎంసీలకు చేరింది. ఇక స్థానిక పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 669 క్యూసెక్కు ల ప్రవాహం వస్తోంది. అక్కడ నిల్వ 215 టీఎంసీలకుగానూ 36.50 టీఎంసీలు ఉం ది. నాగార్జునసాగర్‌లోకి 1,280 క్యూసెక్కు ల ప్రవాహాలు వస్తుండగా, నిల్వ 312 టీఎంసీలకు 168.54 టీఎంసీలు ఉంది. -
పోటాపోటీగా వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/రాయచూరు రూరల్ : కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,93,400 క్యూసెక్కుల ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే.. 7,39,745 క్యూసెక్కుల ప్రవాహంతో కడలి వైపు గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీ వరద వస్తోందన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి మట్టాన్ని తగ్గించుకుంటూ.. భారీ ఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తోంది. ఆ వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, గురువారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 823 అడుగులకు, నీటి నిల్వ 43.14 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 169 టీఎంసీలు అవసరం. మరోవైపు బీమా నదిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 79,861 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.64 టీఎంసీలకు చేరుకుంది. ఆ ప్రాజెక్టు నిండాలంటే 42 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే వారం రోజుల్లో ఉజ్జయిని నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 34.24 టీఎంసీలకు చేరుకుంది. అది నిండాలంటే ఇంకా 72.46 టీఎంసీలు అవసరం. ఆ రెండు జలాశయాలు నిండితే శ్రీశైలానికి వరద మరింతగా పెరుగుతుంది. 822.30 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత గోదావరి నదిలో వరద ఉధృతి బుధవారంతో పోల్చితే గురువారం మరింతగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,39,745 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 70 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయంటే గోదావరి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే.. శుక్రవారం గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 35.50 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.54 అడుగులకు చేరుకుంది. కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల గుండా.. పోలవరం స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్తోంది. గోదావరిలో వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరితే.. పోలవరం కాంటూర్ 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాలకు వరద జలాలు చేరుతాయని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. -
కృష్ణమ్మ వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వచ్చింది వచ్చినట్లు దిగువకే.. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు. నారాయణపూర్‌లో... నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి. జూరాలా.. ఇక పారాలా.. ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది. వరదను ఒడిసిపట్టండి: సీఎం జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో ఫోన్లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు. -
జూరాలకు కృష్ణమ్మ రాక ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి విడుదల చేసిన కృష్ణానీరు దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాలకు చేరేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆల్మట్టి నుంచి చాలా తక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేయడం, దానిలోనూ ఆవిరి, ప్రవాహ నష్టాలుండటంతో నారాయణపూర్‌కు కేవలం 0.50 టీఎంసీల నీరే చేరింది. ఆ నీటిని ఇప్పటికిప్పుడు విడుదల చేసినా జూరాలకు వచ్చేవరకు మిగిలేది శూన్యమే. మరో పదిరోజులు గడిస్తేనే నీటిపరిమాణంపై స్పష్టత వస్తుంది. ఆవిరి, ప్రవాహ నష్టాలకే సగం నీరు! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు వీలుగా ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు 2.5 టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కర్ణాటక ముఖ్యమంత్రికి ఈ నెల 3న విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, నారాయణపూర్ డ్యామ్‌లో సరిపడినంత నీటి లభ్యత లేకపోవడంతో దాని ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి అదేరోజు రాత్రి నారాయణపూర్‌కు నీటి విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి మొత్తంగా 6 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేసినా, అందులో ఆ రాష్ట్ర అవసరాల నిమిత్తం 3 వేల క్యూసెక్కుల నీటిని కాల్వలకు తరలించారు. మరో 3 వేల క్యూసెక్కులు మాత్రమే నారాయణపూర్‌కు వదిలారు. అయితే, ఆ 3 వేల క్యూసెక్కుల నీటిలో సగం ఆవిరి నష్టాలు, ప్రవాహ నష్టాలకే సరిపోయింది. రైతుల ఆందోళనతో వెనకడుగు ఆల్మట్టి నుంచి జూరాలకు నీటి విడుదలను నిరసిస్తూ కర్ణాటక రైతులు ఆందోళనకు దిగడంతో నీటి ప్రవాహాన్ని పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది. నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసినా, జూరాలకు చుక్క నీరు రావడం కష్టమే. ఎందుకంటే, నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కి.మీ.ల దూరం ఉంది. మధ్యలో కర్ణాటక పరిధిలోని గూగుల్, గిరిజాపూర్ అనే చిన్న బ్యారేజీలను దాటుకొని నీరు జూరాలకు రావాల్సి ఉంది. ఈ చిన్న బ్యారేజీలన్నీ ప్రస్తుతం నీరు లేక నోరెళ్లబెట్టడం, గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి నుంచి వచ్చే నీటిలో సగం ఆవిరి అయ్యే అవకాశం ఉండటం, దీనికి తోడు ప్రవాహపు నష్టాలు ఎక్కవగా ఉండటంతో నీటి రాక ఆలస్యం కానుంది. ఈ నేపథ్యంలో మరో ఒక టీఎంసీకి మించి నీరు నారాయణపూర్‌కు చేరితేనే అక్కడి నుంచి 10 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అప్పుడే నష్టాలు తక్కువగా ఉండటంతోపాటు త్వరగా నీరు జూరాలకు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌కు నీటి రాక ఆలస్యమైతే జూరాలకు మరింత జాప్యం జరుగనుంది. ప్రస్తత పరిస్థితుల్లో కనిష్టంగా పది రోజులు అయితే కానీ నారాయణపూర్ నుంచి నీరు జూరాలకు వచ్చే అవకాశం లేదని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. -
బిరబిరా కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసుల దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ కార్యరూపం దాల్చింది. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి దిగువన ఉన్న జూరాలకు కర్ణాటక జల వనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో సరి పడినంత నీటి లభ్యత లేకపోవడంతో ఆల్మట్టి నుంచి శుక్రవారం అర్ధరాత్రి నారాయణపూర్‌కు నీరు విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు ఆదివారం నారాయణపూర్‌కు చేరిన తర్వాత.. అక్కడి నుంచి జూరాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగనుంది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కోరడం, దానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే నారాయణపూర్ సామర్థ్యం 37.64టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 18.08 టీఎంసీల నీరుమాత్రమే ఉంది. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరడంతో దిగువకు నీటి విడుదల సాధ్యం కాదు. దీంతో ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి నారాయణపూర్‌కు నీటి విడుదల తప్పనిసరయింది. ఆల్మట్టిలోనూ 129.72 టీఎంసీల నిల్వలకు గానూ 30.38 టీఎంసీల నిల్వలున్నాయి. ఇక్కడ డెడ్‌స్టోరేజీకి ఎగువన కేవలం 12 టీఎంసీల నిల్వలే ఉన్నప్పటికీ తెలంగాణ అవసరాల దృష్ట్యా శుక్రవారం అర్ధరాత్రి డ్యామ్ స్పిల్‌వే ద్వారా 5,161 క్యూసెక్కులు, పవర్‌హౌజ్ ద్వారా మరో 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు ఆదివారం ఉదయం నారాయణపూర్‌కు చేరే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో కొద్దిగా నిల్వలు పెరిగిన వెంటనే స్పిల్‌వే ద్వారా జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నారాయణపూర్ నుంచి జూరాలకు 180 కిలోమీటర్ల దూరం ఉండగా, మధ్యలో కర్ణాటకలోని గూగల్, గిరిజాపూర్ అనే చిన్నపాటి రిజర్వాయర్లను దాటుకొని నీరు జూరాలకు చేరాల్సి ఉంటుంది. ఇలా జూరాలకు నీరు చేరేందుకు వారం రోజులు పట్టనుండగా, కనీసం ఒక టీఎంసీ నీరు జూరాలకు చేరే అవకాశం ఉంటుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఈ నీటితో జూన్ రెండో వారం వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ భగీరథ కింద తాగునీటి అవసరాలకు సర్దుబాటు చేయవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కర్ణాటక ‘ఎత్తు’లు... తెలుగు రాష్ట్రాలకు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తెలంగాణ, ఏపీల ప్రాజెక్టులకు నీళ్లు కరువవుతుంటే.. మరోపక్క ఎగువన ఉన్న కర్ణాటక మాత్రం కృష్ణా నీటిని మరింత కట్టడి చేసేందుకు యత్నిస్తోంది. దిగువకు చుక్క నీటిని కూడా వదలకుండా తన స్వప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే వ్యూహాలకు పదును పెడుతోంది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పును సాకుగా చూపి, అది అమల్లోకి రాకుండానే డ్యామ్ ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేలా పావులు కదుపుతోంది. దీనికి బలమిచ్చేలా ఆల్మట్టి ఎత్తును పెంచుతున్నట్లు, దీనికోసం రూ.30,143 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కర్ణాటక భారీ నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వాటాలు అధికారికం కాకముందే.. కృష్ణా జల వివాదాలపై తొలిసారిగా ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో 75 శాతం డిపెండబిలిటీతో 2,130 టీఎంసీ నీటిలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీ, మహారాష్ట్రకు 585 టీఎంసీ, కర్ణాటకకు 734 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఇదే వివాదాన్ని విచారిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీతో 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించి అందులో ఏపీకి 1,001, మహారాష్ట్రకు 666, కర్ణాటకు 911 టీఎంసీలు కేటాయించింది. ఈ తీర్పును వెలువరించిన సందర్భంగానే కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 524.25 మీటర్ల ఎత్తు వరకు పెంచుకునే వీలు కల్పించింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్లు కాగా, 129 టీఎంసీల నిల్వ సామర్థ్యముండగా, మొత్తంగా 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. ఒకవేళ బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎత్తు పెరిగితే నిల్వ సామర్థ్యం 259 టీఎంసీలకు పెరుగుతుంది. నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరుగుతుంది. అదనంగా 130 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇప్పటివరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదు. అది అమలు కాకుండానే వాటాలు అధికారికం కాకుండా ఆల్మట్టి ఎత్తు పెంచుకునే వీలుండదు. అయినప్పటికీ ఎత్తు పెంచేలా కర్ణాటక తన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎన్నికల నుంచే తెరపైకి.. ఇటీవల కర్ణాటకలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆల్మట్టి ఎత్తు అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఎత్తు పెంచడంతోపాటు, పెంచితే అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకునేలా 9 ఎత్తిపోతలు చేపడతామని ప్రకటించాయి. ఈ మేరకు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ప్రకటన చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకే తమ తొలి ప్రాధాన్యమని తెలిపారు. ఈ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లకు నీళ్లు వచ్చేందుకు ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సి వస్తోంది. ఎత్తు పెంచాక అక్టోబర్ తర్వాతే నీళ్లొచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిస్థితి దారుణంగా మారుతుంది. ముఖ్యంగా మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో చేపట్టిన.. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏఎమ్మార్పీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు, వీటి పరిధిలోని 23 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడం కష్టతరమే కానుంది. ఈ నేపథ్యంలో ఎత్తు పెంపుపై మళ్లీ న్యాయస్థానాల్లో పోరాటమే తెలుగు రాష్ట్రాలకు శరణ్యం కానుంది. -
పోటెత్తిన ప్రవాహాలు
సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులు ఉప్పొంగడంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, నాగావళి వరద ఉద్ధృతితో పోటెత్తుతున్నాయి. జీవనదులన్నీ జలకళతో ఉప్పొంగి ప్రవహిస్తుంటే పెన్నా నది మాత్రం వర్షాభావంతో జీవకళ కోల్పోయింది. రాయలసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు లేక పెన్నాలో ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడ లేదు. ఆల్మట్టి కళకళ కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో బుధవారం ఆల్మట్టిలోకి 95,136 క్యూసెక్కులు రాగా గేట్లు ఎత్తి దిగువకు 1,00,020 క్యూసెక్కులు విడుదల చేశారు. నారాయణపూర్ జలాశయంలోకి 99,160 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 1,01,011 క్యూసెక్కులు దిగువకు వదిలారు. శ్రీశైలానికి భారీ వరద తుంగభద్ర జలాశయంలోకి 1.25 లక్షల క్యూసెక్కులు వరద వస్తుండగా కాలువలకు 10,630 క్యూసెక్కులు, దిగువకు 1.38 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ నుంచి భారీ వరద బుధవారం రాత్రికి శ్రీశైలానికి చేరనుంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో 21.34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 74,212 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 4,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 872.70 అడుగుల్లో 153.1687 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కనీసం పది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో శ్రీశైలం ఈదఫా నిండే అవకాశం ఉంది. గోదావరిలో పెరిగిన ప్రవాహం ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, తాలిపేరులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.6 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6,37,067 క్యూసెక్కులు రావడంతో డెల్టా కాలువలకు 7,100 క్యూసెక్కులు వదిలారు. మిగతా 6,29,967 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. ప్రస్తుత సీజన్లో గోదావరికి ఇప్పటివరకూ వచ్చిన గరిష్ఠ వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకూ 54.42 టీఎంసీల గోదావరి జలాలు కడలిలోకి వదిలారు. ఉగ్రరూపం దాల్చిన వంశధార ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళిలో వరద ఉద్ధృతి పెరిగింది. తోటపల్లి బ్యారేజీకి 35 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వంశధారలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గొట్టా బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు వరద రావడంతో కాలువలకు విడుదల చేయగా 43 వేల క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ ఉరకలు ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 28,973 క్యూసెక్కులు రాగా 8,945 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి 20,028 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. పట్టిసీమ వట్టి కోతలే! రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులకు ఇంచుమించుగా ఒకేసారి వరదలు వస్తాయి. జూలై 3వ వారం నుంచి అక్టోబర్ వరకు రెండు నదులు ఒకేసారి వరదతో పోటెత్తుతాయి. ప్రకాశం బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. అంతకన్నా ఎక్కువ నీళ్లు వస్తే బ్యారేజీ గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సిందే. అందువల్లే పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో గోదావరి వరద జలాలను పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలకు బదులుగా పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే గ్రావిటీపై కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించవచ్చని సూచించారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశాన్ని పలుసార్లు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే ఏడు టీఎంసీలు సముద్రంలోకి.. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ ద్వారా ఇప్పటికే ఏడు టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదులు ఒకేసారి పొంగి పొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలను, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. నీరందక కృష్ణా రైతుల ఆందోళన కృష్ణా నదికి వరద లేనప్పుడు కూడా కృష్ణా డెల్టా అవసరాలను తీర్చడంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం విఫలమైంది. గోదావరి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాల్వలోకి 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసినా మార్గమధ్యలో వినియోగం, సరఫరా నష్టాలు పోనూ ప్రకాశం బ్యారేజీకి 6 వేల క్యూసెక్కులకు మించి ఏనాడూ చేరిన దాఖలాలు లేవు. కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించాలంటే రోజుకు కనీసం 11 వేల క్యూసెక్కులు అవసరం. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలించే 6 వేల క్యూసెక్కులు డెల్టాకు ఏ మూలకూ సరిపోవు. దీంతో ఈ ఖరీఫ్‌లోనే నీరందక నాట్ల దశలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు రోడ్డెక్కడం తెలిసిందే. ప్రకాశం బ్యారేజీకి కృష్ణా వరద నీరు పోటెత్తుతుండటంతో గత ఐదు రోజులుగా పట్టిసీమ ఎత్తిపోతల పంపులు ఆపివేశారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, సాగునీటిరంగ నిపుణులు చేస్తున్న వాదన నిజమేనని మరోసారి రుజువైంది. -
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది. ఎగువ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో కురుస్తున్న వర్షాలకు తోడు, కర్ణాటక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి రోజురోజుకీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. బుధవారం ఈ ప్రాజెక్టుల్లోకి లక్ష క్యూసెక్కుల మేర వరద రాగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. మరోపక్క తుంగభద్రలోనూ వరద రెండ్రోజుల్లో లక్ష క్యూసెక్కుల నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. మరో వారం రోజులపాటు ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరో 63 టీఎంసీలు వస్తే శ్రీశైలం నిండుకుండ.. ఆల్మట్టిలోకి బుధవారం సాయంత్రం 1.08 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలతో నారాయణపూర్‌కు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేనీటిని దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు మంగళవారం 1.12 లక్షల క్యూసెక్కుల మేర వరద రాగా, అది బుధవారానికి 1.55 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో 95 టీఎంసీల నిల్వ ఉండటంతో అక్కడి నుంచి 2లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలు పెరగడంతో రాష్ట్ర పరిధిలోని జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నుంచి వస్తున్న నీటికి తోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 152.16 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 63 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. గురువారం నుంచి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి శ్రీశైలం, తుంగభద్ర నుంచి శ్రీశైలం వరకు నదీ గర్భంలోనే కనిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేర శ్రీశైలానికి నీరు చేరినా, ప్రస్తుత సీజన్లో తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరినట్టేనని అంటున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 39,090 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 31,802 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టుమట్టం 312 టీఎంసీలకు గానూ 155.92 టీఎంసీలకు చేరింది. మరో 157 టీఎంసీల నీరు చేరితే సాగర్ నిండే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం నుంచి ఏపీ ఎప్పటికప్పుడు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కేసీ కెనాల్ ద్వారా నీటిని తోడేస్తుండటంతో సాగర్ ఎప్పటిలోగా నిండుతుందనేది చెప్పడం కష్టంగా మారింది. -
వచ్చిన నీటిని వచ్చినట్టే తోడేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : ఎగువన ఉన్నామన్న ఆధిపత్యమో.. దిగువన తెలియదన్న ధీమానో కానీ కర్ణాటక ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే కృష్ణా జలాలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న ఆ రాష్ట్రం ప్రస్తుతం వచ్చిన నీటిని వచ్చినట్లుగా వాడేస్తోంది. దిగువ రాష్ట్రాల హక్కులను తుంగలో తొక్కేస్తూ, ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రల ఎగువనే నీటినంతా దోచేస్తోంది. ప్రధాన ప్రాజెక్టుల నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తూ చెరువులు, కాలువలు చిన్నతరహా జలాశయాలను నింపుతోంది. దీంతో వర్షాకాలం మొదలై నెలన్నర దాటిపోయినా ఇప్పటికీ శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రాజెక్టులు ఖాళీ కుండలను తలపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా 365 టీఎంసీల లోటు ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే సాగర్ పరిధిలోని 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్‌నాటి నీరందడం గగనంగానే కనిపిస్తోంది. నీళ్లను తరలిస్తోంది ఇలా.. జూన్, జూలైలో కురిసే సాధారణ వర్షాలకే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రకు ప్రవాహాలు మొదలయ్యాయి. తుంగభద్రకు ఈ వాటర్ ఇయర్లో జూన్ నుంచి గరిష్టంగా రోజుకు 30 వేల క్యూసెక్కులకు మించి వరద కొనసాగుతోంది. అయినా ఇప్పటిదాకా ప్రాజెక్టుల్లో చేరిన కొత్త నీరు 43 టీఎంసీలే కావడం గమనార్హం. బుధవారం కూడా ఈ ప్రాజెక్టులోకి 38 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50.07 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. తుంగభద్ర ఎగువనే కర్ణాటక గరిష్టంగా నీటిని వినియోగిస్తోంది. తుంగ, భద్ర సబ్ బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి విచ్చిలవిడిగా వినియోగిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఎగువనే భద్ర, అప్పర్ తుంగ, భద్ర రిజర్వాయర్, మైనర్ ఇరిగేషన్లో ఇప్పటికే వినియోగం మొదలుపెట్టింది. వేదవతి సబ్ బేసిన్లోనూ మైనర్ ఇరిగేషన్ ద్వారా 40 టీఎంసీలు, వాణివిలాస్ ప్రాజెక్టు ద్వారా 18 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా ఇప్పటికే చెరువులు నింపే పని మొదలు పెట్టినట్లుగా నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇలా నెలన్నర వ్యవధిలోనూ తుంగభద్ర ఎగువన కనిష్టంగా 10 టీఎంసీలు గరిష్టంగా 20 టీఎంసీలు వినియోగించినట్లు తెలుస్తోంది. రెండు మూడ్రోజులుగా తుంగభద్ర నుంచి కాల్వలకు నీటిని విడుదల చేస్తోంది. బుధవారం కాల్వల ద్వారా 448 క్యూసెక్కుల నీటిని వదిలినట్లుగా రికార్డులు చెబుతున్నా.. ఇది అంతకుమించి ఉంటుందన్నది తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర ఎగువనే ఇలా నీటిని వాడేస్తుండటంతో దిగువ శ్రీశైలానికి ప్రవాహాలు కరువయ్యాయి. ఆల్మట్టి నుంచి ఎత్తిపోతలకు.. ఆల్మట్టి పరిధిలో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 38 టీఎంసీల కొత్తనీరు వచ్చింది. అప్పటికే ఉన్న నిల్వతో కలిపితే 58 టీఎంసీల నీరు ఉండాలి. కానీ గత 15 రోజులుగా దాదాపు 8 నుంచి 10 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులు, చెక్‌డ్యామ్‌ల నిండా నీరు నింపేందుకు కర్ణాటక ఈ అక్రమాలకు పాల్పడుతోంది. వినియోగం ఇదే రీతిలో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండటం కష్టమే అవుతుంది. నారాయణపూర్ పరిధిలో గడిచిన రెండు మూడు రోజులుగా అధికారికంగానే 200 నుంచి 400 క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా ఆయకట్టుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ 4 టీఎంసీల మేర వినియోగం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ ఖరీఫ్ ఊపందుకుండటంతో నీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే దిగువ తెలంగాణ పరిధిలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాలకు అక్టోబర్ వరకు నీటి రాక గగనమే కానుంది. ఖాళీగా శ్రీశైలం, సాగర్ ఎగువ నుంచి ప్రవాహాలు కరువవడంతో దిగువన జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీటి రాక కరువైంది. ఇప్పటికి జూరాలకు కేవలం 2.77 టీఎంసీలు మాత్రమే కొత్త నీరు వచ్చింది. 9.66 టీఎంసీల నీటి నిల్వలకుగానూ జూరాలలో ప్రస్తుతం 5.73 టీఎంసీల నీరే ఉంది. ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జూరాల కింది లక్ష ఎకరాల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక శ్రీశైలానికి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా నెలన్నర వ్యవధిలో కేవలం 0.34 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. దీంతో ప్రాజెక్టు బోసిపోయి కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29.06 టీఎంసీల నిల్వే ఉంది. 186.75 టీఎంసీల లోటు కనిపిస్తోంది. నాగార్జునసాగర్‌లోనూ అదే పరిస్థితి. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. 133.37 టీఎంసీల నిల్వలే ఉన్నాయి. ఇందులో వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకు మించదు. ఇప్పటివరకు సాగర్‌లోకి కొత్తగా 3.20 టీఎంసీల నీరు వచ్చినట్టు కనిపిస్తున్నా.. అందులో శ్రీశైలం లీకేజీల ద్వారా వచ్చిన నీరే 2 టీఎంసీల దాకా ఉంటుంది. ఇక్కడ ఇంకా 178.68 టీఎంసీల లోటు ఉంది. అంటే.. రెండు ప్రాజెక్టుల పరిధిలోనే 365 టీఎంసీల లోటు ఉండంతో సాగర్ కింది 6.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్టోబర్, నవంబర్ వరకు నీరందడం ప్రశ్నార్థంగా మారింది. అదే జరిగితే ఖరీఫ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లినట్టే!! తుంగభద్రలో ఇలా.. జూన్‌లోనే వానలు మొదలయ్యాయి.. తుంగభద్రకు భారీగా వరద వస్తోంది.. సగటున రోజుకు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.. ఈ లెక్కన 100 టీఎంసీల ఆ డ్యామ్‌లో ఇప్పటికి 75 టీఎంసీల నీరుండాలి.. కానీ 50టీఎంసీలే ఉంది.. ఎందుకంటే తుంగభద్రకు ఎగువనే వచ్చిన నీటిని వచ్చినట్టు పక్కకు మళ్లిస్తోంది.. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి చుక్క నీరు రావడం లేదు! ఆల్మట్టిలో అలా.. ఈ జలాశయానికీ భారీగానే వరదొస్తోంది.. ఈ సీజన్లో ఇప్పటికే 38 టీఎంసీల నీరొచ్చింది.. ఇప్పటికే నిల్వ ఉన్న నీటితో కలిపితే 58 టీఎంసీలు ఉండాలి.. కానీ గత 15 రోజుల్లో దాదాపు 8–10 టీఎంసీల నీటిని అక్రమంగా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు తరలించారు.. దిగువకు చుక్క రావడం లేదు.. ఇక నారాయణపూర్ ఎప్పుడు నిండాలి? అది నిండి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఎప్పుడు నీళ్లు రావాలి..? వాటి పరిధిలోని లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరందాలి?? -
నిండుకుండలా శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్: దాదాపు నెల రోజులుగా స్థిరంగా వస్తున్న ప్రవాహాలతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను బుధవారం మధ్యాహ్నానికి 884.4 అడుగుల మేర నీటిమట్టం ఉంది. మొత్తం నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుకాగా.. 211.96 టీఎంసీలకు నిల్వ చేరుకుంది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.51 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇక వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలే అవకాశం ఉండటంతో.. ఆ నీరంతా నాగార్జునసాగర్‌కు చేరనుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు 70 వేల క్యూసెక్కులకుపైగా వరద కొనసాగుతోంది. పరీవాహకంలో విస్తారంగా వర్షాలు కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ప్రాజెక్టులన్నీ ఇప్పటికే నిండిపోయాయి. దాంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 129.7 టీఎంసీలకు గానూ 128.19 టీఎంసీల మేర నీరు ఉంది. దానికి దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయం కూడా పూర్తిగా నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు భారీగా 91,574 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇక్కడి నుంచి 88,727 క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. ఇక తుంగభద్ర పోటెత్తడంతో సుంకేశుల బ్యారేజీ నుంచి 40 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. వీటికి హంద్రీ వరద తోడవడంతో.. మొత్తంగా శ్రీశైలం జలాశయంలోకి 1,51,590 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నేడు శ్రీశైలం గేట్ల ఎత్తివేత.. విద్యుదుత్పత్తికి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ 32,021 క్యూసెక్కులు, తెలంగాణ 42,378 క్యూసెక్కులను వినియోగించుకుంటున్నాయి. దీంతోపాటు ఏపీ హంద్రీనీవాకు 1,345 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కులు తరలిస్తుండగా.. తెలంగాణ కల్వకుర్తికి 1,600 క్యూసెక్కుల నీటిని తీసుకుంటోంది. మొత్తంగా ప్రస్తుత సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టుకు 282 టీఎంసీల కొత్త నీరు వచ్చినట్లుగా నీటి పారుదల రికార్డులు చెబుతున్నాయి. శ్రీశైలం నిండుకుండలా మారడం, ప్రవాహాలు కొనసాగుతుండటంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశముంది. గురువారం ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి 60 వేల క్యూసెక్కులను దిగువకు వదిలే అవకాశం ఉందని తెలంగాణ నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం సాగర్‌కు ఎగువ నుంచి 54,293 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 161.20 టీఎంసీల నిల్వ ఉంది. -
రేపోమాపో దిగువకు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఆల్మట్టికి 1.42లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. మంగళవారం ఉదయానికి 98.67 టీఎంసీల నిల్వలు ఉండగా సాయంత్రానికి 105 టీఎంసీలకు చేరింది. దీంతో దిగువ నారాయణపూర్‌కి 33 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాలతో గడిచిన ఐదు రోజులుగా ఆల్మట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీని కారణంగా కేవలం ఈ ఐదు రోజుల్లోనే 66 టీఎంసీల నీరు ఆల్మట్టికి చేరింది. మంగళవారం సైతం 1.42లక్షల క్యూసెక్కుల వరద రావటంతో ప్రాజెక్టులో 105 టీఎంసీలకు చేరింది. మరో 15 టీఎంసీలు వస్తే అన్ని గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దిగువ నారాయణపూర్‌కు పంప్‌హౌజ్ ద్వారా 33వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌లో ప్రస్తుతం 37.64 టీఎంసీల మట్టానికి గానూ 32.95 టీఎంసీల నీరుంది. అయితే మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో పూర్తిగా నిండకుండానే గేట్లను బుధవారం రాత్రికి లేక, గురువారం ఉదయం ఎత్తే అవకాశాలున్నాయి. అదే జరిగితే దిగువ జూరాలకు ఒకట్రెండు రోజుల్లో నీటి రాక మొదలవుతుంది. ప్రస్తుతం ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ 31.27 టీఎంసీల నీరు ఉంది. -
పెరగనున్న ఆల్మట్టి ఎత్తు!
519.6 మీటర్ల నుంచి 524.2 మీటర్లకు పెంపు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నీటి కేటాయింపుల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ ఎత్తుపై సందిగ్ధత తొలిగిపోయింది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంకు 519.6 మీటర్ల ఎత్తు వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వినియోగానికి వీలుంది. అరుుతే బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వస్తే దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆల్మట్టి ద్వారా కర్ణాటక నీటి వాడకం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతివ్వడం వల్ల అదనంగా 130 టీఎంసీల నీటిని వాడుకునే వెసులుబాటు కర్ణాటకకు లభిస్తుంది. ఇప్పటికే ఆల్మట్టి నుంచి దిగువ శ్రీశైలం, సాగర్లకు నీళ్లొచ్చేందుకు సెప్టెంబర్ దాకా ఆగాల్సి వస్తోంది. ఇప్పుడు కర్ణాటక 303 టీఎంసీలు వాడుకుంటే దిగువకు నీరు రావడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా అవన్నీ అక్టోబర్ తర్వాతే వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టుకు నీరందించడమే గగనంగా మారే ప్రమాదం ఉంది. -
ఆల్మట్టికి నిలిచిన వరద
జూరాల : కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు శనివారం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని కూడా నిలిపివేశారు. దీంతో ఆల్మట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు లేవు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.58 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో కేవలం 1598 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం మినహా, విద్యుదుత్పత్తి, స్పిల్‌వేల ద్వారా దిగువకు ఔట్‌ఫ్లో పూర్తిగా నిలిపివేశారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.05 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే భీమా ఎత్తిపోతల లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా 750 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ద్వారా 5180 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా ఔట్‌ఫ్లోను పూర్తిగా నిలిపివేశారు. -
ఆల్మట్టిపైనే ఆశలన్నీ..
పుష్కరాలకు సాగర్ ప్రాజెక్ట్ కళకళలాడుతుందనే ఆశాభావం గత పుష్కరాల సమయంలోనూ చివరి నిమిషంలో వచ్చిన నీరు అప్పుడు 570 అడుగులకు చేరిక.. ప్రస్తుత నీటిమట్టం 504 అడుగులే.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రావచ్చంటున్న అధికారులు 570 అడుగులకు రావాలంటే ఇంకా 135 టీఎంసీలు కావాలి లక్ష క్యూసెక్కుల చొప్పున 15 రోజులు వచ్చినా పుష్కరాలకు ఢోకా లేనట్టే ఆల్మట్టికి రోజూ 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. నాలుగు రోజుల్లో నిండే అవకాశం.. నల్లగొండ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు కృష్ణా పుష్కరాలపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. పుష్కరాలకు ఇంకా 25 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతున్నా... అప్పటికి కళకళలాడుతుందనే అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే, గత పుష్కరాలను ఒక్కసారి స్మరించుకుంటే అప్పుడు కూడా (2004లో) పాజెక్టులోకి నీళ్లు చివరి నిమిషంలోనే వచ్చి చేరాయి. మొత్తం 570 అడుగుల వరకు సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయని అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 503.9 అడుగులే ఉన్నా పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి ఖచ్చితంగా ఆ స్థాయికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యాంకు రోజుకు 2లక్షలకు పైగా క్యూసెక్కుల (దాదాపు 16 టీఎంసీలు) ఇన్‌ఫ్లో ఉండడంతో పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి సాగర్ ప్రాజెక్టు కూడా కళకళలాడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మధ్యలో మూడు ప్రాజెక్టులు.. ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ప్రాజెక్టుకు రోజుకు మూడు రోజుల క్రితం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొన్న 1.75 లక్షలకు, ఆ తర్వాత 2లక్షలకు, శుక్రవారం 2,00, 859 క్యూసెక్కులకు చేరింది. అంటే ఒక్కరోజే 17 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఆల్మట్టిలో ప్రస్తుతం ఉన్న నీటికి తోడు ఆ ప్రాజెక్టు నిండేందుకు మరో 60 టీఎంసీల నీరు వస్తే సరిపోతుంది. అంటే ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే మంగళవారం నాటికి ఆల్మట్టి నిండే అవకాశాలున్నాయి. అప్పుడు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు నీరు త్వరగానే వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు కలిపినా మొత్తం నీటి నిల్వ 49 టీఎంసీలే. ఇప్పటికే వాటిలో 18 టీఎంసీలున్నాయి. అంటే మరో 31 టీఎంసీలు వస్తే చాలు. ఆ తర్వాత శ్రీశైలంలో ఇంకా 190 టీఎంసీల వరకు నీరు కావాలి. ఈ ప్రాజెక్టులోకి కూడా 2లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే 10 రోజుల్లో నిండుతుంది. అంటే మొత్తం కలిపి 15 రోజుల్లో ఇదే వరద కొనసాగితే సాగర్‌కు నీటి విడుదల ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు ఆగస్టు నెల ప్రారంభం లేదా అంతకంటే ముందే నీళ్లు రాక మొదలవుతుంది. అప్పటికీ 12 రోజుల సమయం ఉంటుంది కనుక ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండకపోయినా, విద్యుదుత్పాదన కోసం కిందికి నీళ్లు వదిలితే ఆ ఇన్‌ఫ్లో సాగర్‌లోకి వచ్చి చేరుతుంది కాబట్టి పుష్కరాల నాటికి మన జిల్లాలో ప్రవహించే కృష్ణా నదిలోకి పుష్కలంగా నీరు వస్తుందని అంచనా. సాగర్ లెక్క ఇది... వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. దాన్ని టీఎంసీల్లో లెక్కిస్తే 312.04 టీఎంసీలు. ప్రస్తుత సాగర్‌లో ఉన్నది కేవలం 503.9 అడుగులే. అంటే 121 టీఎంసీలే. అయితే, అధికారులు ఆశిస్తున్నట్టుగా సాగర్‌నీటి మట్టం 570 అడుగులకు చేరాలంటే (కిందికి నీళ్లు వదలాలంటే 570 అడుగుల మేర నీళ్లు రావాలి.) 256.5 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నవి కాకుండా ఇంకా 135 టీఎంసీల వరకు నీళ్లు రావాలన్నమాట. ఈ 135 టీఎంసీలను క్యూసెక్కుల్లో లెక్కిస్తే ఒక్క టీఎంసీకి 11,575 క్యూసెక్కుల చొప్పున 15,62,625 క్యూసెక్కుల నీళ్లు కావాలి. అలా కావాలంటే సాగర్‌కు ఇన్‌ఫ్లో రోజుకు లక్ష క్యూసెక్యుల చొప్పున 15 రోజులొస్తే సరిపోతుందన్న మాట. పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈనెల 25 నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం అయినా సరిపోతుందని అధికారులంటున్నారు. ఇప్పటికే ఆల్మట్టికి వస్తున్న ప్రవాహం చూస్తుంటే మరో 3, 4 రోజుల్లో అది నిండిపోతుందని, అప్పుడు సాగర్‌కు ఒకటిన్నర రోజుల్లో నీళ్లు వచ్చే అవకాశాలుంటాయని అధికారులు చెపుతున్నారు. అయితే, మధ్యలో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు నిండేందుకు మరో వారం, పది రోజులు తీసుకున్నా... 25 నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున వస్తే సరిపోతుందని, ఇంకా అదనంగా వస్తే ఇంకా తక్కువ రోజుల్లోనే సాగర్ కళకళలాడుతుందనే అధికారులు చెపుతున్నారు. అయితే, తుంగభద్ర కు కూడా రోజుకో రెండు టీఎంసీల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ఇన్‌ఫ్లో కూడా పెరిగితే అక్కడి నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎప్పుడో కానీ జూలై మాసంలో సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉండదు. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అయి రెండు, మూడు వారాల్లో గేట్లు పైకి ఎత్తే పరిస్థితి వస్తుంది. అది సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది (వరద ఉంటే). ఈ పరిస్థితుల్లో ఎగువన వస్తున్న వరదలను చూస్తే పుష్కరాల నాటికి సాగర్ నీటికి ఢోకా ఉండబోదని అధికారులు చెపుతున్నారు. పుష్కరాల నాటికి సాగర్‌లో నీళ్లు నిండాలని, నీళ్లు లేవని భక్తులు నిరాశ చెందకుండా పుష్కరాలు పూర్తికావాలని ఆశిద్దాం.