ఆల్మట్టి జలాశయం అన్ని గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణా నది
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/రాయచూరు రూరల్ : కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,93,400 క్యూసెక్కుల ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే.. 7,39,745 క్యూసెక్కుల ప్రవాహంతో కడలి వైపు గోదావరి పరుగులు పెడుతోంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటం, ఎగువ నుంచి భారీ వరద వస్తోందన్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటి మట్టాన్ని తగ్గించుకుంటూ.. భారీ ఎత్తున వరద జలాలను దిగువకు విడుదల చేస్తోంది. ఆ వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, గురువారం రాత్రి 7 గంటలకు నీటి మట్టం 823 అడుగులకు, నీటి నిల్వ 43.14 టీఎంసీలకు చేరుకుంది. జలాశయం నిండాలంటే ఇంకా 169 టీఎంసీలు అవసరం. మరోవైపు బీమా నదిలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 79,861 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 74.64 టీఎంసీలకు చేరుకుంది. ఆ ప్రాజెక్టు నిండాలంటే 42 టీఎంసీలు అవసరం. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే వారం రోజుల్లో ఉజ్జయిని నిండే అవకాశం ఉంటుంది. తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 34.24 టీఎంసీలకు చేరుకుంది. అది నిండాలంటే ఇంకా 72.46 టీఎంసీలు అవసరం. ఆ రెండు జలాశయాలు నిండితే శ్రీశైలానికి వరద మరింతగా పెరుగుతుంది.
822.30 అడుగులకు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం
ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత
గోదావరి నదిలో వరద ఉధృతి బుధవారంతో పోల్చితే గురువారం మరింతగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 7,39,745 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 70 టీఎంసీల జలాలు సముద్రంలో కలిశాయంటే గోదావరి వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే.. శుక్రవారం గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పోలవరం వద్ద అప్రమత్తం
భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 35.50 అడుగులకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 27.54 అడుగులకు చేరుకుంది. కాఫర్ డ్యామ్ గ్యాప్‌ల గుండా.. పోలవరం స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా గోదావరి ప్రవాహం దిగువకు వెళ్తోంది. గోదావరిలో వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కులకు చేరితే.. పోలవరం కాంటూర్ 41.15 మీటర్ల పరిధిలోని ముంపు గ్రామాలకు వరద జలాలు చేరుతాయని అధికార వర్గాలు తెలిపాయి. పోలవరం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment