పోటాపోటీగా ప్రవహిస్తున్న నాగావళి, వంశధార
నిండిపోయిన ఏలేరు రిజర్వాయర్.. గేట్లు ఎత్తివేత
పంట పొలాలను ముంచెత్తిన వరద
అల్లూరి జిల్లావ్యాప్తంగా ఉధృతంగా ప్రధాన గెడ్డలు, వాగులు
మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలోకి నీళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరిలలో వరద కూడా తగ్గుతోంది. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి.. వాటి ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు రెండు వేల క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే, శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది.
జూరాల, సుంకేశుల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 206.5365 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 883.40 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్, పులిచింతలలోకి.. వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 588.30 అడుగుల వద్ద ఉండగా ఇది 306.9878 టీఎంసీలకు సమానం.
కృష్ణాకు వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కృష్ణాజిల్లాలోని తీరప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇక గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.79 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఒడిశా, ఉత్తరాంధ్రలో కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఏలేరు వరద ఉధృతి పెరిగింది.
ఏలేరు రిజర్వాయర్‌లోకి 46,405 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 23.23 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 25,275 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ఫలితంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పంటలు నీటమునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంపా, తాండవ, సుబ్బారెడ్డిసాగర్‌తో పాటు ఏలేరు దానికి అనుబంధంగా సుద్దగడ్డ, దబ్బకాలువ, గొర్రికండి వంటి వాగులు, ఏరులు పోటెత్తాయి.
గట్లకు గండ్లు పడి పలు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు సోమవారం గొల్లప్రోలు ముంపు ప్రాంతంలో పర్యటించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో దబ్బ కాలువపై ఏలేరు ఉ«ధృతికి వంతెన కొట్టుకుపోయింది. మరోవైపు.. ఏలేరు వరద ముంచెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ సోమవారం నాగులాపల్లి పర్యటనలో సూచించారు.
అల్లూరి జిల్లాలో వర్ష భీభత్సం..
అల్లూరి జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన గెడ్డలు, వాగులలో వరద ఉధృతి ప్రమాదకరంగా ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జోలాపుట్టు, డుడుమ, సీలేరులోని గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు భారీగా నీటిని విడిచి పెడుతున్నారు. చింతపల్లి నుంచి సిలేరు వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వరద ముంపులో ‘మాచ్‌ఖండ్’ జల విద్యుత్కేంద్రం
ఇక ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వరద నీరు చేరింది. డుడుమ, జోలాపుట్టు జలాశయాల నుంచి 85 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో 2వ నంబర్ నుంచి సోమవారం విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ప్రాజెక్టు మనుగడకే ముప్పు అని భావించిన అధికారులు విద్యుత్ ఉత్పాదనను నిలిపివేశారు. ప్రస్తుతం బ్యాక్ ఫీడింగ్ ద్వారా మూడు క్యాంపులకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment