
మూడు ప్యాకేజీల కింద నిర్మాణానికి సీఆర్‌డీఏ నోటిఫికేషన్ జారీ
సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్ల వసూలుకు ముఖ్య నేత స్కెచ్
రూ.1,007.82 కోట్లతో బీ+జీ+49 అంతస్తులతో జీఏడీ టవర్
రూ.1,698.77 కోట్లతో బీ+జీ+39 అంతస్తులతో 1, 2 టవర్లు
రూ.1,488.92 కోట్లతో బీ+జీ+39 అంతస్తులతో 3, 4 టవర్లు
ఐదు టవర్ల మొత్తం కాంట్రాక్టు విలువ రూ.4,195.51 కోట్లు
ఇవే పనులు 2018లో రూ.2,271.14 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం
అప్పట్లోనే పునాదులు పూర్తి.. ఇప్పుడు మిగతా పనులకు టెండర్లు
ఆ అంచనా వ్యయానికి ఇప్పుడు రూ.1,924.37 కోట్లు అదనం
2015లో రూ.1,151 కోట్లతో తాత్కాలిక సచివాలయం
అప్పట్లోనే చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున కట్టబెట్టి కమీషన్లు
అప్పు తెచ్చిన నిధులను వృథా చేయడంపై అధికార వర్గాల్లో విస్మయం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో ఐదు బ్లాక్‌లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో బీ+జీ+39 పద్ధతిలో నాలుగు టవర్లు, బీ+జీ+49 పద్ధతిలో ఒక టవర్.. మొత్తం ఐదు టవర్లను 4,85,000 చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు)లో చేపట్టనుంది.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం.. శాశ్వత సచివాలయం పేరుతో రెండుసార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్మాణానికి బుధవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) లంప్సమ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2018లో పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు డిజైన్‌లు (ఆకృతులు) రూపొందించాయి. ఆ డిజైన్‌ల మేరకు ఇటీవల శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు శాశ్వత సచివాలయంలో 1, 2 టవర్లను ఒక ప్యాకేజీ కింద.. 3, 4 టవర్లను రెండో ప్యాకేజీ కింద.. జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) టవర్‌ను మూడో ప్యాకేజీ కింద విభజించి సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా.. నిర్మాణం పూర్తయ్యాక 36 నెలలపాటు నిర్వహించాలని షరతు పెట్టింది. ఈ టెండర్‌లో బిడ్ల దాఖలుకు వచ్చే నెల ఒకటో తేదీని తుది గడువుగా నిర్దేశించింది. అదే రోజున టెక్నికల్ బిడ్‌ను తెరుస్తారు. టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థల ఆర్థిక బిడ్లను మే 3న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించాలని సీఆర్‌డీఏ అథారిటీకి అధికారులు ప్రతిపాదించనున్నారు.
సచివాలయం నిర్మాణం ఇలా..
» రాయపూడి వద్ద పాలవాగుకు ఇరు వైపులా శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాలవాగుకు ఉత్తరాన జీఏడీ టవర్‌తోపాటు 1, 2 టవర్లు.. దక్షిణాన 3, 4 టవర్లను నిర్మించేలా డిజైన్‌ను రూపొందించారు. మొత్తంగా 1, 2 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లు. 3, 4 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లు. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లు. ఐదు టవర్లలో ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు.
» శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే మూడు ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జీఏడీ టవర్ నిర్మాణ పనులను రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు.. 1, 2 టవర్ల నిర్మాణ పనులను రూ.932.46 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు.. 3, 4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. అంటే.. ఐదు టవర్ల నిర్మాణ పనుల విలువ రూ.2,271.14 కోట్లు.

» ఈ ఐదు టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే.. స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణా నదిలో పుష్కలంగా.. అదీ ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ.. ఈ ఐదు టవర్లలో మిగిలిన పనుల నిర్మాణానికి రూ.4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడం గమనార్హం.
» ఈ లెక్కన అంచనా వ్యయాన్ని రూ.1,924.37 కోట్లు పెంచేసిందన్నది స్పష్టమవుతోంది. యధావిధిగా సిండికేట్ కాంట్రాక్టర్లకు ఈ ఐదు టవర్ల పనులను కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకోవడానికే ప్రభుత్వ ముఖ్యనేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది.
» ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను అప్పట్లో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రూ.1,151 కోట్లు వ్యయం చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు, ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.