అమరావతి పర్యటనలో సీఎం చంద్రబాబు
మొత్తం 55 వేల ఎకరాలు సేకరించాం
మిగులు భూములమ్మి రాజధాని కట్టుకోవచ్చు.. రాజధాని సంపదతోనే సంక్షేమ పథకాల అమలు
రాజధాని పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం
భవిష్యత్తు కార్యాచరణపై అధ్యయనం చేయాల్సి ఉంది
నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ రతనాల సీమ అవుతుంది
అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
ఆ రెండింటికీ ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం గతంలోనే చెప్పింది
సాక్షి, అమరావతి: అమరావతిలో రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా రాజధాని నుంచి వచ్చే సంపదతోనే అమలు చేస్తామన్నారు. గురువారం రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు.
ఉండవల్లిలోని ప్రజావేదిక శిథిలాల నుంచి ప్రారంభించి ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతం, ప్రజా ప్రతినిధులు, అధికారుల కోసం నిర్మించ తలపెట్టిన భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డులోని సీఆర్‌డీఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరాన్ని సంపద సృష్టించే కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. దక్షిణాదిలో గోదావరి భారీ జల నిధి లాంటిదన్నారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకూ నీళ్లివ్వచ్చన్నారు. వి
భజన అనంతరం రాజధాని నిర్మాణం కోసం ఆర్థిక తోడ్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించిందన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించగా అమరావతికి ఆర్థిక సాయం చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రజారాజధానిగా అమరావతి ఐదు కోట్ల మందికి దశ, దిశను నిర్దేశిస్తుందన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే గర్వంగా పనులు చేసుకోవచ్చన్నారు. రాజధానిని వైఎస్ జగన్ అతలాకుతలం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
రాజధానిపై శ్వేతపత్రం..
రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 16 వేల గ్రామాలు, దేశవ్యాప్తంగా పవిత్రమైన ప్రాంతాల నుంచి మట్టి, నీళ్లు తెచ్చి అందరు దేవుళ్ల ఆశీర్వాదాలతో శంకుస్థాపన చేశాం. ఆ మహిమే నేడు రాజధానిని కాపాడింది. ఎవరైనా సీఎం అయితే మంచి కార్యక్రమంతో ప్రజలను మెప్పిస్తారు. కానీ జగన్ ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. రాజధానిలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.
ఇష్టానుసారంగా విధ్వంసం చేశారు. పైపులు, ఇసుక దొంగతనం చేయడంతో పాటు రోడ్లను కూడా తవ్వుకుపోయారు. ఒక్క బిల్డింగ్‌ను కూడా పూర్తి చేయలేదు. రోడ్ల నిర్మాణాలన్నీ సగంలో ఆగిపోయాయి. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, మంత్రులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల భవన నిర్మాణాలను అర్థాంతరంగా నిలిపేశారు. రాజధాని ప్రస్తుత పరిస్థితపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఏం చేయాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంది.
కన్సార్టియంపైనా విషం చిమ్మారు..
తెలుగుజాతి గర్వంగా తలెత్తుకు తిరిగే రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలనుకున్నాం. రాజధానిపై బురద జల్లి బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్, స్విస్ ఛాలెంజ్‌లో మోసం అన్నారు. సింగపూర్ కన్సార్టియంపైనా విషం చిమ్మి తరిమేశారు.
రాష్ట్రానికి మధ్యలో ఉండేలా ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో చెప్పింది. దానికి అనుగుణంగానే గుంటూరు కేంద్రంగా అమరావతిని రాజధానిగా గుర్తించాం. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు.
రైతులు ఇచ్చిన భూములే కాకుండా ప్రభుత్వ భూములు కలిపి 55 వేల ఎకరాలను సేకరించాం. 29 వేల మంది రైతుల్లో ఒక్కరు కూడా కోర్టుకు వెళ్లకుండా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏ’ అంటే అమరావతి.. ‘పీ’ అంటే పోలవరంగా గుర్తుంటుంది.
నదులు అనుసంధానిస్తాం..
ప్రజలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు వేయడంతో రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద విజయం లభించింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి పనికిరాడని తీర్పు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అర్హతలేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఎంత నష్టపోతుందో గత ఐదేళ్లలో చూశాం.
పోలవరం, అమరావతి వ్యక్తిగత అంశానికి సంబంధించినవి కాదు. వ్యక్తికి, వర్గానికి, ప్రాంతానికి పరిమితమైనవి కావు. వాటి ద్వారా సంపద సృష్టి జరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఖర్చు కూడా రెట్టింపు అయ్యింది.
అప్పులెంతో తెలియదు..
ప్రభుత్వ విధానాలతోనే ప్రజల జీవితాలు మారుతాయి. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తాం. దీర్ఘకాలంలో ప్రజల జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఐదేళ్ల విధ్వంసాన్ని భరించలేకే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లు వేశారు. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రతి పనిని ప్రజల ముందు ఉంచుతాం. తప్పుడు పనులు చేసిన వారిని క్షమించం. రౌడీయిజాన్నిఅణచివేస్తాం.
రాజధానిలో నిర్మాణాలను ఉన్మాది బారి నుంచి దేవుడే కాపాడాడు. రుషికొండను చదును చేసి రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు. పర్యావరణానికి విరుద్ధంగా ప్రవర్తించారు. జగన్ లాంటి వ్యకు్తలకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? అనేది ప్రజల్లో చర్చ జరగాలి. అప్పులు ఎంత చేశారో తెలియదు. అడ్డదిడ్డంగా సంతకాలు పెట్టిన అధికారులు ఎక్కడున్నారో తెలియదు. ఇవన్నీ సరిదిద్దాలి. రాజధాని భూములను కూడా తాకట్టు పెట్టారేమో చూడాలి. లాలూచీ పడే అధికారుల ప్రవర్తన మార్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment