రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు
రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో 5 ఎత్తిపోతలు
ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా నిర్మాణం
నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు తవ్వే గ్రావిటీ కెనాల్‌పై నాలుగు తాత్కాలిక ఎత్తిపోతలు
ఈ పథకాల డీపీఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఏడీసీఎల్
ఉండవల్లి వద్ద ఇప్పటికే 5 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా పథకం పూర్తి
అయినా ముంపు ముప్పు తొలగదని అభిప్రాయపడ్డ ప్రపంచ బ్యాంకు
సమస్యను అధిగమించేందుకు ఐదు ఎత్తిపోతలు నిర్మించాలని ఏడీబీతో కలిసి ప్రతిపాదన
రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం
ఆ కెనాల్‌కు అనుసంధానంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్ల నిర్మాణం
ముంపు పనుల వ్యయమే తడిసి మోపెడవుతుందంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది.
దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదు
రాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.
» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది.
» రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది.
» రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.
కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.
» నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి.
» ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి.
» పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.
» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.
» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి.
» రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment