
అమరావతిలో మరో భారీ భూదోపిడీకి ప్రభుత్వ పెద్దల కుట్ర
అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులకు ఇచ్చే రిటర్న్‌బుల్ ప్లాట్లపై కన్ను
తిరిగి తమకు ప్లాట్లు ఇస్తామన్నవారికే రిజిస్ట్రేషన్.. లేకపోతే లిటిగేషనే
సీఎంవో, సీఆర్‌డీఏ, పోలీసుల అండతో కుతంత్రం
కారుచౌకగా అసైన్డ్ ప్లాట్లు కొల్లగొడుతున్న పెద్దలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ పెద్దలు మరో భారీ భూదోపిడీకి తెగబడ్డారు. భూసమీకరణ కింద ఇచ్చిన అసైన్డ్ భూములకు గాను ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించే రిటర్నబుల్ ప్లాట్లను కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ఈ దందాను దర్జాగా నడిపిస్తున్నారు.
బడుగు రైతుల ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా కొల్లగొట్టిన 1,300 ఎకరాల అసైన్డ్ భూములకుగాను రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్లాట్లు కబ్జా చేసేందుకు బరితెగించిన ప్రభుత్వ పెద్దలు... తాజాగా పేద రైతుల రిటర్నబుల్ ప్లాట్లను సైతం స్వాహా చేస్తుండటంపై రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
ఇదీ అసైన్డ్ గూడుపుఠాణి...
రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ కింద తమ అసైన్డ్ భూములు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్రతిగా అభివృద్ధి చేసిన వాణిజ్య, నివాస ప్లాట్ల్లను సీఆర్‌డీఏ కేటాయించాలి. ఆ మేరకు అసైన్డ్ రైతుల పేర్లతో సీఆర్‌డీఏ వద్ద పెద్ద జాబితా పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కొన్ని భవన నిర్మాణాలకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తున్నందున టీడీపీ పెద్దల కన్ను ఆ ప్లాట్లపై పడింది.
కానీ, రిటర్నబుల్ ప్లాట్లను నేరుగా టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి తమ బెదిరింపులకు తలొగ్గి.. ప్లాట్లు తిరిగి తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మతించిన అసైన్డ్ రైతులకే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని కుట్ర పన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే ఈ భూదోపిడీ పర్వం సాగుతోంది.
భూ దోపిడీ పర్వం ఇలా...
ముందుగా రాజధాని పరిధిలోని అసైన్డ్ రైతులను తుళ్లూరు డీఎస్పీ కార్యాలయానికి పిలిపిస్తున్నారు. సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ ప్లాట్లను తాము సూచించిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తున్నారు. ఒకవేళ రాజధానిలో తమ ప్లాట్లను తామే అట్టిపెట్టుకుంటామని చెప్పిన రైతులను బెదిరిస్తున్నారు. ‘ప్లాట్లు పెట్టుకుని ఏం చేస్తారు.. వాటిలో మీరు ఏదైనా నిర్మాణం చేయాలంటే అనుమతులు ఇవ్వరు. తర్వాత మరొకరికి అమ్ముకోవాలన్నా రిజి్రస్టేషన్ చేయరు.
పైగా లీగల్ లిటిగేషన్లు పెట్టి మీ ప్లాటుల మీకు ఎప్పటికీ దక్కకుండా చేస్తారు...’ అని హెచ్చరిస్తున్నారు. మేం చెప్పినవారికి వెంటనే అమ్మేస్తామని అంగీకరిస్తే ఇప్పుడు మీ ప్లాట్లు మీ పేరిట సీఆర్‌డీఏ ద్వారా రిజి్రస్టేషన్ చేయిస్తాం. లేకపోతే సీఆర్‌డీఏ మీ పేరిట అసలు ప్లాట్లే రిజిస్ట్రేషన్ చేయదు. ఏళ్లకు ఏళ్లు పెండింగులో ఉంచుతుంది’ అని బెదిరిస్తున్నారు.
మరోవైపు కిందిస్థాయి పోలీసు అధికారులు, దళారులు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ తాము చెప్పినట్టు చేయకపోతే మొత్తానికే మోసం వస్తుందని భయపెడుతున్నారు. దీంతో పలువురు ఎస్సీ, ఎస్సీ, బీసీ, పేద రైతులు హడలిపోతున్నారు. పోలీసు బెదిరింపులకు లొంగి తమ ప్లాట్లను టీడీపీ పెద్దలు, బినామీలు చెప్పిన నామమాత్రపు రేటుకే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సమ్మతిస్తున్నారు.
సీఎంవో పచ్చజెండా ఊపితేనే..
సీఎం చంద్రబాబు కార్యదర్శి ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. తమ ప్లాట్లు ఇచ్చేందుకు సమ్మతించిన రైతుల పేర్లను పోలీసు అధికారులు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు తెలిసింది. వచి్చన జాబితాను పరిశీలించి అంతా తాము అనుకున్నట్టుగా సాగుతోందో లేదో అన్నది పోలీసు అధికారులతో సీఎం కార్యదర్శి మాట్లాడి నిర్ధారించుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాతే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన జాబితాను సీఆర్‌డీఏకు పంపుతున్నారు.
ఈ చేత్తో ఇచ్చి... ఆ చేత్తో గుంజుకుంటున్నారు
ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన జాబితాలోని అసైన్డ్ రైతులకే రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్‌డీఏ రిజి్రస్టేషన్ చేస్తోంది. పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే అసైన్డ్ రైతుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అనంతరం పోలీసు, సీఆర్‌డీఏ అధికారులు చెప్పినట్టుగా... అసైన్డ్ రైతులు ఆ ప్లాట్లను టీడీపీ పెద్దలు, వారి బినామీల పేరిట రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చదరపు గజం భూమి మార్కెట్ ధర రూ.లక్షకు మించి పలుకుతోంది.
కానీ సీఎంవో, సీఆర్‌డీఏ, పోలీసు అధికారులతో బెదిరించి అతి తక్కువ ధరకు కొల్లగొడుతున్నారు. అసైన్డ్ రైతుల నుంచి గజం కేవలం రూ.30వేల నుంచి రూ.40వేల చొప్పునే టీడీపీ పెద్దల బినామీలు, బంధువులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు. అంటే ఈ చేత్తో అసైన్డ్ రైతులకు ఫ్లాట్లు ఇచ్చి... ఆ చేత్తో వెంటనే గుంజేసుకుంటున్నారు.
2014–19 మధ్య కాలంలో అమరావతిలో భూదోపిడీ సాగించిన చంద్రబాబు, నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులు, బంధువులు, బినామీల పేరిటే ఈ అసైన్డ్ భూముల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతోంది. ఈ విధంగా రాజధాని అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు ప్లాట్లు లేకుండా చేసి మొత్తం రాజధాని తమ సన్నిహితులు, బినామీల గుప్పిట్లోనే ఉండాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం.
బెదిరించి ప్లాట్లు తీసుకుంటున్నారు
అమరావతి పరిధిలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్లాట్లు ఉండకూడదని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అసైన్డ్ రైతులకు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్లపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. సీఆర్‌డీఏ కేటాయించే ఫ్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితుల పేరిట రిజి్రస్టేషన్ చేయాలని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. అందుకు అంగీకరిస్తేనే వారి పేరిట సీఆర్‌డీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తోంది.
ఆ వెంటనే ఆ ప్లాట్లను ప్రభుత్వ పెద్దల సన్నిహితులు, బినామీల పేరిట అతి తక్కువ ధరకే రిజి్రస్టేషన్ చేసేసుకుంటున్నారు. సీఎంవో, సీఆర్‌డీఏ, పోలీసు పెద్దల పర్యవేక్షణలోనే ఇదంతా సాగుతోంది. దాంతో అసైన్డ్ రైతులు భయపడి వారు చెప్పినట్టుగా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. – సందీప్, అసైన్డ్ రైతు, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment