8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి | Chief Minister Chandrababu in CRDA meeting | Sakshi
Sakshi News home page

8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి

Published Sat, Aug 3 2024 5:22 AM | Last Updated on Sat, Aug 3 2024 5:22 AM

Chief Minister Chandrababu in CRDA meeting

ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు మరో ఐదేళ్లు కౌలు పొడిగింపు

సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) 8,352 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.  2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం.. అప్పట్లో గుర్తించిన విస్తీర్ణం మేరకు సీఆర్డీఏ పరిధిని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ సమావేశాన్ని నిర్వహించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు. 

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికా­రులను ఆదేశించారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూమి కేటాయించాలన్నారు. గతంలో భూములు పొందిన వ్యక్తులు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి.. అనే అంశంపైనా చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. 

దేశంలో టాప్‌ 10 కళాశాలు, టాప్‌ 10 స్కూల్స్, టాప్‌ 10 ఆస్పత్రులను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలిపిన పలు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ సింగపూర్‌ ప్రభుత్వంతో చర్చిస్తాం : మంత్రి నారాయణ 
రాష్ట్రంలో సీడ్‌ క్యాపిటల్‌ నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్‌ ప్రభుత్వంతో చర్చిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ సమావేశానంతరం మంత్రి  మీడియాతో మాట్లాడారు. ‘సీడ్‌ క్యాపిటల్‌ను చెన్నై–కలకత్తా హైవేకు అనుసంధానిస్తాం. ఇందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న సీడ్‌ యాకిŠస్‌స్‌ రోడ్డుతో పాటు మరో నాలుగు రోడ్లను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో అనుకున్న విధంగా హెల్త్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ వంటి నవ నగరాలు నిర్మిస్తాం’ అని తెలిపారు. 

విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును సెంట్రల్‌ డివైడర్‌ ఉండేలా నాలుగు లేన్లతో నిర్మించేలా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో ఇన్నర్, ఔటర్‌ రింగ్‌ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్‌ బ్రిడ్జిలు వస్తాయన్నారు. 2019కు ముందు రాజధానిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించామని.. ఆయా సంస్థలు వీలైనంత త్వరగా సంస్థలను నెలక్పొలేలా చర్చిస్తామని తెలిపారు.

సీఆర్డీయే పరిధిలోకి బాపట్ల, పల్నాడు జిల్లాలు
రాజధాని ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటీ హైదరాబాద్‌ బృందం అమరావతిలో పర్యటించిందని, శనివారం ఐఐటీ మద్రాస్‌ నిపుణులు ఐకానిక్‌ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. వచ్చే వారంలో అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడతామని చెప్పారు. 

అమరావతి హ్యాపీ నెస్ట్‌ ప్రాజెక్ట్‌ కూడా తిరిగి ప్రారంభించేలా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఆర్‌5 జోన్‌ అంశం న్యాయస్థానంలో ఉండటంతో న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పుడున్న వారితో పాటు మరో 32 మంది కన్సల్టెంట్స్‌ను నియమిస్తామని వెల్లడించారు. సీఆర్డీయే పరిధిలోకి కొత్తగా పల్నాడు, బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నట్టు మంత్రి వివరించారు.  

పథకాలు.. ఫలితాలు
ప్రజలకు కేవలం పథకాలు అందించడమే కాదని, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం, విద్యుత్‌ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ  కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్‌ వాత్సల్యతో చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. 

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూ­చించారు. రాష్ట్రంలో వీలైనన్ని మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 

రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్‌ అందాలి 
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తితోపాటు సరఫరా మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

సోలార్‌ విద్యుత్తుకు ప్రాధాన్యత క ల్పించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరిస్థితిని వివరించారు. ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్య­దర్శి రాజమౌళి, ఏపీ జెన్‌కో ఎండీ చక్ర«­దర్‌ బాబు, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి  తదితరులు పాల్గొన్నారు. 

ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖల సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. 

గత ప్రభుత్వం ధాన్యం సేకరణను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. ధాన్యం సొమ్మును చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని, ఇకపై ఎలాంటి అవరోధాల్లేకుండా ధాన్యం సేకరణ చేయాలని సూచించారు. బియ్యం డోర్‌ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోప భూయిష్టంగా సాగిందని ఆరోపించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్‌ సిద్ధార్థ్‌జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.  

సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త మద్యం విధానం 
సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్‌ విధానాన్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఎక్సైజ్‌ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఎక్సైజ్‌ విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌ శాఖ వ్యవహారాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని, గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీల ఫైళ్లను సీజ్‌ చేయాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement