ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
ఎగువన సాధారణ స్థాయికి వరద
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గడంతో బుధవారం కృష్ణమ్మ మరింత శాంతించింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం రాత్రి 10 గంటలకు 3,00,767 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,00,267 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఆల్మట్టిలోకి చేరుతున్న వరద 30 వేల క్యూసెక్కులకు తగ్గింది.
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి దిగువకు 17,600 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలలోకి 1.28 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.37 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 39,945 క్యూసెక్కులు వస్తుండగా 15,533 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. దిగువకు 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 39,964 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి మరింతగా తగ్గనుంది.
కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు
తాడేపల్లి రూరల్ : నాలుగు రోజులుగా భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి బుధవారం సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, సారె సమరి్పంచామని జీయర్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు చెప్పారు. మహానాడు ప్రాంతంలో వరద ముంపునకు గురైన బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అహోబిల జీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment