పేదల కష్టం నీటిపాలు | There are many sad stories of flood victims | Sakshi
Sakshi News home page

పేదల కష్టం నీటిపాలు

Published Thu, Sep 5 2024 5:22 AM | Last Updated on Fri, Sep 6 2024 11:14 AM

There are many sad stories of flood victims

వరద బాధితుల వ్యథాభరిత గాథలెన్నో!

కష్టార్జితాన్ని మింగేసిన వరద

ఆర్థిక సుడిగుండంలో బడుగు జీవులు

ముంపు ప్రాంతాల్లో 80శాతం మంది రోజువారీ కూలీలు.. చిరు జీతగాళ్లే

వరద తాకిడితో రోజువారీ రెక్కల కష్టం ఆగిపోయింది

ఏళ్ల తరబడి కాయకష్టంతో సమకూర్చుకున్న సామగ్రి ధ్వంసం

ముంపులోనే ఆటో అన్నల ఇళ్లకెళ్తున్న ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిధులు

ఫైనాన్స్‌పై బైక్‌లు, ఫ్రిజ్‌లు, టీవీలు వంటివి కొన్న వారిదీ ఇదే పరిస్థితి

పింఛన్లు అందక వృద్ధులు, విధి వంచితుల ఆవేదన

గోడలు నానిపోయి కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లు

అసలే పేదరికం.. ఆపై ముంపు నష్టంతో కోలుకోలేని దెబ్బ

వాళ్లంతా రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులు. రోజువారీ కూలీలు.. నెలవారీ చిరుజీతగాళ్లు.. రుణాలు చేసి ఆటోలు కొనుక్కుని నడుపుకునేవాళ్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తోడుగా నెట్టుకొచ్చే ఎన్నో జీవితాలు. ఆ కుటుంబాలన్నీ ఇప్పుడు వరద ముంపుతో ఆర్థిక సుడిగుండంలో మునిగిపోయారు.

సాక్షి, అమరావతి/సాక్షి బృందం, విజయవాడ : పేద, గొప్ప తేడా లేకుండా బుడమేరు అందర్నీ ముంచేసింది. వరద తీవ్రతను తట్టుకుని కోలుకున్న పేదవర్గాలకు పెద్ద కష్టమే మిగిలింది. ఒక్క వరద పేదల రోజువారీ బతుకుదెరువును దెబ్బతీయడంతోపాటు జీవితకాలం కాష్టార్జితాన్ని సైతం మింగేసింది. విజయవాడ ముంపు బాధిత ప్రాంతాల ప్రజల్లో 80 శాతం మంది రోజువారీ కూలీలు, చిన్నపాటి వేతన జీవులు అధికంగా ఉన్నారు. అజిత్‌సింగ్‌ నగర్, పాయకాపురం, ప్రకాశ్‌నగర్, కేఎల్‌రావు నగర్, ఉడా కాలనీ, వాంబే కాలనీ, రాజీవ్‌నగర్, వైఎస్సార్‌ కాలనీ, కుందవారీ కడ్రిక (నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ కాలనీ) వంటి అనేక ప్రాంతాల్లోని ఇరుకు సందులు, చిన్నపాటి ఇళ్లలో పేద, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. 

వారిలో విజయవాడ ఆటోనగర్, వన్‌­టౌన్, టూటౌన్‌ తదితర ప్రాంతాలకు రోజువారీ కూలికి వెళ్లేవారే అధికంగా ఉన్నారు. అనేక మంది పేదలు స్థానిక అపార్ట్‌మెంట్‌లతోపాటు ఇళ్లలో పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుడమేరు పై(సింగ్‌నగర్‌) వంతెన పడటం, రింగ్‌ రోడ్డుకు దగ్గరగా ఉండటం, సింగ్‌నగర్‌ సమీప ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా కావడం, తక్కువ ఖరీదుకే ఇళ్లు, స్థలాలు లభించడంతో చాలా ఏళ్ల నుంచి ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పేదలు వలస వచ్చి స్థిరపడ్డారు. 

రాజస్థాన్, ఒడిశా, బిహార్‌ వంటి రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఆ ప్రాంతంలోనే అద్దెకు ఉంటూ వన్‌టౌన్‌లోని షాపులు, తోపుడు బండ్లపై వ్యాపారాలకు, కూలికి వెళ్తుంటారు. హోటళ్లు, షాపులు, చిన్నపాటి పరిశ్రమల్లో పనిచేసే చిరుద్యోగులు సైతం సొంతంగా ఇల్లు కొనుక్కోవడంతోపాటు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇప్పుడు వారంతా సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.

అసలే పేదరికం.. ఆపై ముంపునష్టం
రోజువారీ కూలీలు, చిరువేతన జీవులు పదేళ్లకుపైగా కష్టపడితేగాని ఇంట్లోకి అవసరమైన సామగ్రిని సమకూర్చుకోలేరు. రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకుపైగా వెచ్చించి కొనుక్కున్న మంచం, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్‌ మెషిన్, బైక్‌ వంటి సామగ్రి నీటిపాలు కావడంతో వాటిని మళ్లీ సమకూర్చుకో­వడం కష్టమేనని వాపోతున్నారు. 

వాటిని కొను­గోలు చేసేందుకు చేసిన అప్పులకు నెలవారీ ఈఎంఐలు చెల్లించడం కూడా పెద్ద సమస్యేనని వాపో­తున్నారు. వరద తమ రోజువారీ బతుకుదెరువు దెబ్బతీయడంతోపాటు జీవితకా­లం కష్టపడి సమ­కూర్చిన సామగ్రి పాడైపోయిందని, వాటి­కోసం చేసిన అప్పులను తీర్చడం వంటి అనేక సవాళ్లు ఆర్థిక సమస్యల సుడిగుండంలో పడేసిందని వాపో­తున్నారు. అసలే పేదరికం.. ఆపై ముంపు నష­్టంతో కోలుకోలేని దెబ్బతీసిందని వాపోతు­న్నారు.

ఈఎంఐ కట్టాల్సిందేనయ్యా!
ఇక్కడి పరిస్థితులు దుర్భరంగా కనిపిస్తుండగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా ఒకటో తేదీ దాటిపోవడంతో ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిధులు ఈఎంఐల (నెల వాయిదా సొమ్ము) వసూళ్ల కోసం రుణాలు తీసుకున్న వారిపై దండెత్తుతున్నారు. కొన్ని కంపెనీల ప్రతినిధులైతే అప్పులు పొందిన వారికి ఫోన్లు చేస్తూ.. 1వ తేదీకే ఈఎంఐ కట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎందుకు జమ చేయలేదని నిలదీస్తున్నారు. తక్షణమే చెల్లించకపోతే పెనాల్టీలు కట్టాల్సి వస్తుందంటూ ఒత్తిడి చేస్తున్నారు. 

గత నెల 10, 15 తేదీల నాడు ఈఎంఐలు చెల్లించాల్సి వారి ఇళ్లకైతే నేరుగా కంపెనీల ప్రతినిధులు వెళ్లి ‘వానొచ్చినా.. వరదొచ్చినా ఈఎంఐ కట్టి తీరాలి. లేదంటే ఫైనాన్స్‌పై ఇచ్చిన వస్తువులను తీసుకుపోతామ’ని బెదిరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కేఎల్‌ రావు నగర్‌ 7వ లైన్‌కు చెందిన ఆటో డ్రైవర్లు వేల్పుల కిశోర్, మారుపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘కొంతకాలం క్రితం లోన్‌ సదుపాయంతో ఆటోలు కొన్నాం. ఒక్కొక్కరూ ప్రతి నెలా రూ.10 వేల వరకు ఈఎంఐ కడుతున్నాం. వరద ముంచెత్తడంతో ఈఎంఐ చెల్లించలేకపోయాం. 

కంపెనీల ప్రతినిధులు వచ్చి ఈఎంఐ కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నీట మునిగిన ఆటోలకు మరమ్మతు చేయించేందుకే రూ.40 వేల నుంచి రూ.50 వేల ఖర్చు అవుతుంది. వాటిని ఎలా మరమ్మతు చేయించుకోవాలి దేవుడా అని అవస్థ పడుతుంటే.. ఈఎంఐల ఒత్తిడి మరింత ఆవేదన కలిగిస్తోంది’ అని వాపోయారు.

పింఛన్లు తెచ్చుకోలేక అవస్థలు
కేఎల్‌ రావు నగర్, ఊర్మిళా నగర్‌లలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల్లో చాలా మందికి ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు ఇంకా అందలేదు. ‘వలంటీర్లు ఉండుంటే.. ఈ పాటికే మాకు పింఛన్లు అంది ఉండేవి. మేం ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా వలంటీర్లు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి పింఛన్‌ ఇచ్చేవారు. 

ఇప్పుడు అలా లేదు. చర్చి సెంటర్‌కు వచ్చి పింఛను తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 75 ఏళ్ల వయసులో నీటిలో నడుచుకుంటూ మేం ఎక్కడకు వెళ్లగలం. చేతిలో చూస్తే చిలిగవ్వ లేదు. పింఛను ఇంకా అందకపోవడంతో అవస్థలు పడుతున్నాం’ అని ఊర్మిళా నగర్‌లోని సుబ్బారావు వీధికి చెందిన చెందిన ఎన్‌.లక్ష్మి వాపోయింది

ఏ వస్తువూ పనికొచ్చేలా లేదు
ఇళ్లల్లోని అన్ని వస్తువులు పాడయ్యాయి. ప్రతి పేద కుటుంబానికి రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లింది. భవనాల్లో ఉంటున్న కుటుంబాలకైనే రమారమి రూ.5 లక్షల చొప్పున వస్తు నష్టం కలిగింది. వంట సామగ్రి, బట్టలే కాకుండా విలువైన వస్తువులు పూర్తిగా నీటమునిగి పాడయ్యాయి. ఫ్రిజ్‌లు, టీవీలు, మంచాలు, వంటి వస్తువులు మూడు రోజులు నీటిలో నానిపోవడంతో పనికి రాకుండా పోయాయని బాధితులు చెబుతున్నారు. 

పాత రాజరాజేశ్వరి పేట మీర్జాన్‌ అనే మహిళ తన ఇంట్లో దెబ్బతిన్న వస్తువులను చూపించి ఆవేదన వ్యక్తం చేసింది. అదే ప్రాంతానికి చెందిన ఎలీషా సైతం తన ఇంట్లో వస్తువులే కాకుండా పిల్లల సర్టిఫికెట్లు, ఇతర సామగ్రి పూర్తిగా నాశనమయ్యాయని వాపోయింది. 10 నుంచి 20 ఏళ్లపాటు కష్టించి కొనుక్కున్న వస్తువులన్నీ పాడైపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఉపాధి వెతుక్కుంటూ వేల సైకిళ్లు వెళ్లేవి
విజయవాడలో 2006 ప్రాంతంలో సింగ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఉదయం 8 గంటల నుంచి 10గంటల మధ్య వేల సంఖ్యలో సైకిళ్ల వెనుక భోజనం క్యారేజీ కట్టుకుని పేదలు రోజువారీ కూలికి వెళ్లే­వారు. 

మారిన పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ బైక్‌లు కొనుక్కుని కూలికి వెళ్తున్నారు. ముంపు ప్రాంతాల్లో 50 వేలకుపైగా బైక్‌లు ఉంటాయి. స్వయం ఉపాధి కోసం అనేక మంది రోజుకు రూ.500 నుంచి రూ.800 అద్దెకు ఆటోలు నడుపుకుంటున్నారు. వర­దతో తిరగని ఆటోలకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి కొందరిదైతే.. కొన్ని ఆటోలు వర­దలో కొట్టు­కుపోయి ఏం చేయలో తెలియని పరిస్థితి.   – వై.శ్రీనివాసరావు,  రియల్టర్, సింగ్‌నగర్‌

జీవనోపాధి పోయింది
దశాబ్దం కిందట ఇద్దరు బిడ్డలతో పొట్ట­చేత పట్టుకుని విజయ­వాడకు వచ్చాను. కూలీ­నాలి చేసి కూడబెట్టు­కున్న సొమ్ముతో ఎనిమిదేళ్ల కిందట చిన్న టిఫిన్‌ బండి పెట్టుకున్నాను. నా టిఫిన్‌ బండి వరదలో కొట్టుకుపోయింది. గ్రైండర్లు, మిక్సీలు, వంట సామగ్రి నిత్యావసరాలు నీటిలో నానిపోయాయి. సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. 

ఇదంతా అప్పు చేసి పట్టుకొచ్చిందే. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పు తీరిస్తే తప్ప.. కొత్తగా అప్పు పుట్టదు. వ్యాపారం లేకున్నా ఇంటి, హోటల్‌ గది అద్దె కట్టితీరాల్సిందే. వీటికే నాకు రూ.30వేలకుపైగా అవుతుంది. ప్రభు­త్వమే మాకు ఏదైనా దారి చూపించాలి. – వెంకటరమణ, భవానీపురం,  టిఫిన్‌ బండి నిర్వాహకుడు

ఉపాధిని దెబ్బతీసింది
వరద నా ఉపా­ధిని దెబ్బతీసింది. ఒక్క గంటలోనే మా ఇళ్లు మొత్తం మునిగిపోవ­డ­ంతో జిరాక్స్‌ షాపులో జిరాక్స్‌ మెషిన్, మెటీరియల్‌ పనికిరాకుండా పోయాయి. ఇంటిలో కబోర్డులు నానిపో­యా­యి. తలుపులు, మంచాలు ఉబ్బిపో­యా­యి. పరుపులు, బట్టలు దుర్వాసన వస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైపో­వడంతో బయటపడేశాం. 

ఇలాంటి పరిస్థి­తిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇంటిని శుభ్రం చేసుకోవడం పెద్ద సవా­లుగా మారింది. నీళ్లలో నానిపోయిన చెత్తను తీసుకెళ్లమంటే మునిసిపాల్టీ సిబ్బంది పట్టించుకోవట్లేదు. ఇంటి ముంగిట అలానే పెట్టి ఉంచాం.    – బాషా, భవానీపురం 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement