![Vallabhaneni Vamsi Arrest and Arguments continued in courtroom for 2AM midnight](/styles/webp/s3/article_images/2025/02/14/vamsi.jpg.webp?itok=cMm_eXZ3)
వంశీని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ రాయదుర్గంలోని తన నివాసంలో అదుపులోకి.. రోడ్డు మార్గంలో విజయవాడ తరలింపు
పటమట పోలీసుస్టేషన్ వద్ద పోలీసుల హైడ్రామా
జగ్గయ్యపేట అని, కొద్దిసేపు నందిగామ, ఇబ్రహీంపట్నమని లీకులిచ్చి చివరికి భవానీపురం స్టేషన్‌కు తరలింపు
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి, దాడిచేశారనే ఆరోపణలు
బీఎన్‌ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు
ఇటీవల న్యాయమూర్తి ఎదుట నమోదైన సత్యవర్థన్ వాంగ్మూలాన్ని బేఖాతరు చేస్తూ అక్రమ కేసులు
వైద్య పరీక్షలకు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
వంశీని ఎలాగైనా అరెస్టుచేయాలనే ప్రభుత్వ పెద్దల పన్నాగం
న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు
ఎఫ్‌ఐఆర్ అడిగితే ఇవ్వడం లేదన్న వంశీ సతీమణి
అర్ధరాత్రి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. 2 గంటల వరకూ కొనసాగిన వాదనలు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్/పటమట/కృష్ణలంక (విజయవాడ తూర్పు)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం): కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఉదయం ఏడు గంటలకు అయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్‌ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతకుముందు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏడీసీపీ రామకృష్ణ తన బృందంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని వంశీ కోసం గాలింపు చేపట్టారు.
రాయదుర్గం మైహోం భుజాలోని తన ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకెళ్లి వంశీకి బీఎన్‌ఎస్ 47 (1) నోటీసును అందించి ఉన్నపళంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో మధ్యాహ్నం విజయవాడకు తీసుకొచ్చారు. కొద్దిసేపు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఉంచి, అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్న సెంట్రల్ ఏసీపీ కె. దామోదరరావుతోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీసీపీ జి. రామకృష్ణ రాత్రి తొమ్మిది గంటల వరకు వంశీని ఎనిమిది గంటలపాటు విచారించారు.
అనంతరం.. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరోవైపు.. వంశీ అనుచరులైన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఏలినేని వెంకట శివరామకృష్ణప్రసాద్ (35), కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నిమ్మ లక్ష్మీపతి (35)లను కూడా పటమట పోలీసులు గురువారం రాత్రి అరెస్టుచేశారు. వైద్య పరీక్షల నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం.. వంశీని కోర్టులో హాజరుపరచగా అర్ధరాత్రి 2 గంటల వరకు వాదనలు కొనసాగాయి. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా..
ఇక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా
చంద్రబాబు ప్రభుత్వం వేధింపులతో బరితెగిస్తోందనడానికి వంశీ అరెస్టే ఉదాహరణ. ఎందుకంటే.. ఏకంగా న్యాయమూర్తి ఎదుట స్వచ్ఛందంగా 164 సీఆర్‌పీసీ కింద నమోదుచేసిన వాంగ్మూలాన్ని కూడా బేఖాతరు చేస్తూ అక్రమ కేసులకు టీడీపీ కూటమి సర్కారు తెగిస్తోంది. అసలు వంశీపై అక్రమ కేసుకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్న గన్నవరం టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్థన్ ఫిర్యాదే అబద్ధమని కోర్టు సాక్షిగా ఇటీవల తేలిపోయింది. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని ఫిర్యాదు చేశారని.. అసలు ఫిర్యాదులో ఏముందో కూడా తనకు తెలియదని సత్యవర్థన్ సాక్షాత్తూ న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు.
వంశీ తనను బెదిరించనేలేదని.. తనపై దౌర్జన్యం చేయలేదని స్వచ్ఛందంగా వెల్లడించి తన ఫిర్యాదును వాపసు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఇది అవమానంగా భావించి ఎలాగైనా వంశీని అరెస్టుచేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సుదీర్ఘ చర్చల అనంతరం సత్యవర్థన్ కిడ్నాప్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పోలీసులు సైతం కోర్టులోని పరిణామాలన్నింటినీ బేఖాతరు చేస్తూ రెడ్‌బుక్ కుట్రనే కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సత్యవర్థన్ తమ్ముడు కిరణ్‌పై ఒత్తిడి తెచ్చి అవాస్తవ ఆరోపణలతో మరో అబద్ధపు ఫిర్యాదును ఈ నెల 12న ఇప్పించారు. మాజీ ఎమ్మెల్యే వంశీ, కొమ్మా కోట్లు, భీమవరపు రామకృష్ణ, గంటా వీర్రాజు తదితరులు తన సోదరుడిని కిడ్నాప్ చేసి కేసు వాపసు తీసుకునేలా బెదిరించి, భయపెట్టారని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే పటమట పోలీసులు వంశీపై అక్రమ కేసు నమోదు చేశారు. అంటే.. తమకు అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏమాత్రం లెక్కలేదన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది వంశీ అరెస్టు ద్వారా స్పష్టమవుతోంది.
కాగా, వంశీ అరెస్టుపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో గురువారం హైడ్రామా నడిచింది. హైదరాబాదు నుంచి వంశీని పటమట స్టేషన్‌కు తీసుకొస్తారని పోలీసులు లీకులు ఇవ్వడంతో మీడియా అంతా అక్కడికి చేరుకుంది. చివరికి భవానీపురం స్టేషన్‌కు, అక్కడ వంశీని కారుమార్చి కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రైటర్, ఇతర సిబ్బంది కేసుకు సంబంధించిన పత్రాలను రహస్యంగా తరలించారు.
వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన పోలీసులు
వల్లభనేని వంశీకి రిమాండ్..
14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారి చేశారు. కాగా విజయవాడ సబ్ జైల్‌కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
సత్యవర్థన్ స్టేట్‌మెంట్ రికార్డు..
మరోవైపు ముదునూరు సత్యవర్థన్ గురువారం సాయంత్రం పటమట పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను పోలీసులు రహస్యంగా స్టేషన్‌లో ఉంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. వంశీ అరెస్టు నేపథ్యంలో సత్యవర్థన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయటం చర్చనీయాంశంగా మారింది.
మాజీమంత్రి పేర్ని నాని హౌస్ అరెస్టు..
వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నానిని పోలీసులు గురువారం హౌస్ అరెస్టుచేశారు. తెల్లవారుజామున ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకుని బయటికెళ్లేందుకు వీల్లేదని నోటీసులిచ్చారు.
ఎఫ్‌ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు..
నా భర్తపై నమోదుచేసిన కేసు ఎఫ్‌ఐఆర్ అడిగితే ఇవ్వడంలేదు. ఎందుకు అరెస్టుచేశారో చెప్పడంలేదు. రిమాండుకు తీసుకెళ్లినప్పుడు ఇస్తామంటున్నారు. ఎఫ్‌ఐఆర్ లేకపోతే లీగల్‌గా వెళ్లడానికి అవకాశం ఉండకూడదని ఇలా చేస్తున్నారు. హైదరాబాద్‌లో మా ఇంటికొచ్చి అరెస్టుచేశారు. నోటీసు ఇవ్వకుండా ఎందుకు అరెస్టుచేస్తున్నారని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు పేపర్‌పై రాసిచ్చారు. అక్రమ కేసులో ఇరికించేందుకే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే తెలంగాణ సరిహద్దుల వద్దే ఏపీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్మోహనరావు సహాయంతో ఇక్కడకు చేరుకున్నాను.
– పంకజశ్రీ, వంశీ సతీమణి
చంద్రబాబు ఒత్తిడితోనే వంశీ అక్రమ అరెస్టు
మాజీ మంత్రి అంబటి
సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వంశీ అక్రమ అరెస్టు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులపై డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు అంబటి రాంబాబు, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులతో కూడిన వైఎస్సార్‌సీపీ బృందం గురువారం అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. అయినా డీజీపీ కలవలేదు.
అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ తాను ఆ ఫిర్యాదు చేయలేదని, సాక్షి సంతకం తీసుకొని, దానితో వంశీపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారంటూ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. దీంతో చంద్రబాబు, లోకేశ్ కుతంత్రాలు బట్టబయలయ్యాయని చెప్పారు. సత్యవర్ధన్‌ను వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ అతని సోదరుడితో ఫిర్యాదు చేయించారని తెలిపారు. వంశీని పోలీసులు క్షణాల్లో అరెస్ట్ చేశారన్నారు. బుధవారం ఓ వివాహ వేడుకలో దెంగులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన రచ్చలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పైనా తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు.
తప్పుడు కేసులతో వంశీపై కక్షసాధింపు
వల్లభనేని వంశీపై పోలీసులు బనాయించిన తప్పుడు కేసును తక్షణం ఉపసంహరించుకోవాలి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుకుని వంశీపై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదుచేశారు. రాష్ట్రంలో చట్టాలను ఎలా తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వంశీ అరెస్టు ఉదంతం ఒక నిదర్శనం. అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తించాలి.
– మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే
అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పినా..
వల్లభనేని వంశీని అరెస్టుచెయ్యొద్దని కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు వాటిని ధిక్కరించి మరీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే పిచ్చి భ్రమల్లో నుంచి కూటమి నాయకులు బయటకు రావాలి. నియంత పాలన ఎంతోకాలం సాగదు. అన్యాయం జరిగిందని న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.
– జూపూడి ప్రభాకర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తప్పుడు ఫిర్యాదు చేయించి..
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే పాలన సాగుతోంది. వంశీపై రాజకీయ కక్ష సాధింపులకే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వంశీ కేసు పూర్తిగా నీరుగారిపోతోందని చంద్రబాబు, లోకేశ్ కక్షపూరితంగా సత్యవర్థన్ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వారితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. ఇలాంటి దుర్మార్గ విధానాలకు ప్రభుత్వ పెద్దలే పాల్పడుతుంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందా?
– వేల్పుల రవికుమార్,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment