నాలుగు రోజులైనా ముంపులోనే బెజవాడ
కనపడని సహాయక చర్యలు, రోడ్డున పడ్డ లక్షలాది ప్రజలు
మెయిన్ రోడ్లలోనే ప్రభుత్వం హడావుడి.. లోపలికి వెళ్లే వారే లేరు
శివారు ప్రాంత ప్రజలకు ఇప్పటికీ అందని నీరు, ఆహారం
వరద ప్రాంతాల్లో కొట్టుకొస్తున్న శవాలు
చెత్త, వ్యర్థాల మురుగుతో కంపుకొడుతున్న పరిసరాలు
మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని జనాలు కన్నీళ్లు
వరద స్వల్పంగా తగ్గడంతో బయటకు వస్తున్న బాధితులు
అలా వచ్చిన వాళ్లకు పునరావాస కేంద్రాలు కరువు
4 లక్షల మందిలో ఆశ్రయం ఇచ్చింది 15 వేల మందికే
కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయట పడుతున్న కాలనీల వాసులు
కొనసాగుతున్న బోట్ల దందా
డంపింగ్ యార్డులను తలపిస్తున్న ముంపు ప్రాంతాలు
కనీసం బ్లీచింగ్ కూడా చల్లించని వీఎంసీ
విజయవాడ ప్రాంతాల్లో అడుగడుగునా దయనీయ పరిస్థితులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి బృందం, విజయవాడ/సాక్షి, అమరావతి: నాలుగు రోజుల నుంచి అన్నం లేక.. నీళ్లు దొరక్క ఆకలితో అలమటించి ఆర్తనాలు చేస్తూ వాంబే కాలనీలో రాజ్‌కుమార్ అనే పాస్టర్ మృత్యువాత పడ్డాడంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజులు గడుస్తున్నా ముంపు నుంచి తమను ఎవరూ బయటకు తీసుకువచ్చే పరిస్థితులు కనపడకపోవడంతో తమంతట తాముగానే వరద నీటి నుంచి బయట పడేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు.
అలా నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వారిలో కొందరు మధ్యలోనే కొట్టుకుపోయి గల్లంతైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడని, ఏమైపోయామో కూడా కనుక్కునే వారే లేరని వాపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 11 సాక్షి బృందాలు, బోట్లు, ట్రాక్టర్లలో ముంపునకు గురైన శివారు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి.
సహాయక చర్యలేవీ
వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా చాలా ప్రాంతాలకు సహాయక బృందాలు వెళ్లలేదు. ప్రధాన రోడ్లు, వాటికి అనుంబంధంగా ఉన్న రోడ్లపై తిరుగుతూ హడావుడి చేయడం మినహా లోపల ఉన్న కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో వేలాది ఇళ్లలో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా.. అవన్నీ చాలా పరిమిత ప్రాంతాల్లోనే. జేసీబీలు, ట్రాక్టర్లు కూడా కాలనీల్లోని చివరి ప్రాంతాల్లోకి వెళ్లడం లేదు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బోట్లు, ప్రైవేటు బోట్లు కూడా పైపైనే తిరిగి రోడ్లపై కనపడిన వారిని మాత్రమే అరకొరగా బయటకు తీసుకువస్తున్నాయి.
ఆ బోట్లలో కూడా డబ్బులిస్తేనే బాధితులను ఎక్కించుకుంటున్నారు. ఒక్కో మనిషికి రూ.2 వేలు అడుగుతున్నారు. వరదలో సర్వం కోల్పోయిన వారు ఆ డబ్బు ఇచ్చుకోలేక బోట్ల వారిని ప్రాధేయపడుతున్నా.. వాటి యజమానులు కనికరించడం లేదు. ప్రభుత్వ బోట్లలో ఎక్కాలన్నా డబ్బులు అడుగుతున్నారని బాధితులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
శివారు ప్రాంతాల్లో చాలా ఇళ్లకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లిన దాఖలాలు లేవు. తిండి సంగతి అటుంచితే.. అసలు మంచినీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదని వాంబేకాలనీకి చెందిన రామలక్ష్మి అనే మహిళ వాపోయింది. ‘నాలుగు రోజులుగా కరెంటు లేదు, ఫోన్లు పనిచేయడం లేదు. మేం చచ్చామో.. బతికామో కూడా బయటి ప్రాంతాల్లో ఉన్న తమ వాళ్లకు తెలిపే అవకాశం లేకుండా పోయింది’ అని విలపిస్తూ చెప్పింది.
తలో దిక్కయ్యాం
వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు టూర్లు, మంత్రుల హడావుడి మీడియా, సోషల్ మీడియా కోసం చేస్తున్న హంగామాయే తప్ప బాధితులను ఆదుకోవాలనే కనీస ప్రయత్నం ఎక్కడా కనిపించడం లేదు. ఎలాగైనా బయట పడాలని తమ కుటుంబంలో నలుగురం బయటకు వచ్చామని, ఇప్పుడు తలోదారి అయ్యిందని, మిగిలిన వాళ్లు కనిపించడంలేదని ఓ వృద్ధురాలు విలపిస్తూ చెప్పింది.
నీరు లేక ఇబ్బంది పడుతున్నామని కొందరు గోడు వెళ్లబోసుకున్నారు. తమ ఏరియాల్లో పిల్లులు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు చనిపోయి దారుణమైన వాసన వస్తోందని, ఏం రోగాలు వస్తాయోనని మరికొందరు ఆందోళనగా చెబుతున్నారు. మరోవైపు రోడ్లన్నీ బురద, చెత్త, చెదారంతో మురికి కూపాలను తలపిస్తున్నాయి.
పునరావాసం ఏదీ?!
వరద నీరు కొంతమేర తగ్గడంతో ఎలాగోలా నరకయాతన పడుతూ బయటకు వచ్చినా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో అధికారులకే తెలియడం లేదు. నాలుగు లక్షల మంది నిరాశ్రయులైతే కనీసం వంద శిబిరాలు కూడా పెట్టలేదు. లక్షల మంది ముంపులో చిక్కుకుంటే ఇప్పటివరకు కేవలం 15 వేల మందిని మాత్రమే శిబిరాలకు తరలించినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీన్నిబట్టే పునరావాస చర్యలు ఎంత ఘోరంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. దీంతో వరద నీటిలో మునిగిపోయిన తమ ఇళ్లలో ఉండలేని పరిస్థితుల్లో ఎలాగోలా బయటకు వచ్చిన జనానికి ఎటు వెళ్లాలో దిక్కు తెలియడంలేదు. తమ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఉండేందుకు కొందరు వెళుతున్నారు.
మరికొందరు ఇతర నగరాలు, పట్టణాల్లో ఉన్న తమ బంధువుల ఇంటికి బస్సుల్లో వెళ్లేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. ఇలా బయటకు వచ్చిన వారితో బుధవారం రామవరప్పాడు ప్రాంతం రద్దీగా మారిపోయింది. అక్కడ డివైడర్లు, రోడ్డు పక్కన తమ వారి కోసం, బస్సుల కోసం అనేక మంది లగేజీలతో ఎదురుచూస్తూ కూర్చున్నారు. కొంచెం డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్లు స్థానిక హోటళ్లలో తలదాచుకుంటున్నారు.
ఏ గతీ లేని సామాన్య జనం మాత్రం ఎటు వెళ్లాలో తెలియక బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, ప్లాట్‌ఫారాలపై కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా చాలా కుటుంబాలు ముంపులోనే ఉన్న ఇళ్ల నుంచి ఒకరో, ఇద్దరో బయటకు వచ్చి దొరికిన ఆహారం తీసుకుని మళ్లీ వరద నీటిలోనే నడుచుకుంటూ ఇళ్లకు వెళుతున్నారు.
వెంటాడుతున్న అంటువ్యాధుల భయం
ఇళ్లతో పాటు పరిసరాలలో పేరుకుపోయిన కళేబరాలు, వ్యర్థాలు, వాటితో మురిగిపోయిన నీటివల్ల అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండటంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
పాములు, తేళ్లతో సహజీవనం
వరద బాధితులను పాములు, తేళ్లు కలవరపెడుతున్నాయి. ఊర్మిళా సుబ్బానగర్‌లో మెరకలో ఉన్న ఇళ్లు, దుకాణాలను శుభ్రం చేసుకుంటున్న క్రమంలో బురద నుంచి పాములు బయటకు వస్తుండటంతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ పాము కాటేస్తుందో.. తేలు కుడుతుందోనన్న భయంతో రాత్రిళ్లు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని బాధితులు తెలిపారు.
కూలిపోయేలా ఇళ్లు
ఇంటి గోడలు వరద నీటిలో నానిపోవడంతో ఎన్నో కుటుంబాలు భయం గుప్పెట్లో బతుకున్నాయి. అనేక ఇళ్లు ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాయి. సితార సెంటర్ కొండ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు అధికంగా కనిపించాయి.
ఇంకా తేరుకోని లంబాడీపేట
లంబాడీపేటలో మోకాలిలోతు నీరు నిలిచి ఉంది. ఇప్పటికీ మోకాలి లోతు నీటిలోనే ఇళ్లన్నీ దర్శనమిస్తున్నాయి. వంట సామగ్రి, స్టీలు పాత్రలు బురద పట్టిపోవడంతో వాటిని కడుక్కోవడం వారికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఒకపక్క ఇల్లంతా మురుగు, దుర్గంధం వెదజల్లుతుండగా వాటిని కడుక్కోవడానికి మంచినీరు లేక పక్కనే రోడ్డుపై ఉన్న వరద నీటితోనే ఇంటిలోని మురుగును కడుక్కోవడం కనిపిస్తోంది.
ముంపులోనే విజయ డెయిరీ
ఈ ప్రాంతంలోని విజయ డెయిరీ ఇప్పటికీ వరద నీటిలోనే మునిగి ఉంది. పాలు, పెరుగు ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు తగ్గుతుండటంతో నీట మునిగిన, ప్రవాహంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన వాహనాలు నీటిలో తేలుతూ కనిపిస్తున్నాయి. మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతంలోని ప్రధాన డ్రెయిన్‌లో అనేక ద్విచక్ర వాహనాలు, కార్లు బయటపడ్డాయి. ఇవన్నీ ఎందుకు పనికిరాని స్థితిలో బటయపడ్డాయి.
నాలుగు రోజులుగా నీళ్లలోనే నానుతున్న ఇళ్లు.. దిక్కు తెలియక వాటిలో ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకు జీవుడా అంటూ క్షణమొక యుగంలా గడుపుతున్న జనం.. నీళ్లు లేవు.. తిండి దొరకదు.. అకలి కేకలు.. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో సతమతమయ్యే అభాగ్యులు.. ఎలాగైనా తినడానికి ఆహారం తెచ్చుకుందామని వరద నీటిలోనే కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వస్తున్న ప్రజలు.. విజయవాడలోని బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
డంపింగ్ యార్డులే నయం
ముంపు ప్రాంతాలైన అజిత్‌సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, ఇందిరానాయక్ నగర్, నందమూరి నగర్, వాంబే కాలనీ, శాంతి నగర్, ప్రశాంతి నగర్, రాజీవ్ నగర్, సుందరయ్య నగర్, ఎల్‌బీఎస్ నగర్, వుడా కాలనీ, కండ్రిక, నున్న, పాతపాడు, రూరల్ పరిధిలోని అంబాపురం, నైనవరం, అప్పారావుపేట, గొల్లపూడి, జక్కంపూడి, రాయనపాడు, భవానీపురం, కేఎల్‌రావు నగర్, కబేళ, కండ్రిక తదితర ప్రాంతాలు దారుణమైన దుర్గంధం వెదజల్లుతున్నాయి.
ఎటుచూసినా వ్యర్థాలు, చికెన్ దుకాణాల్లోని కోళ్లు, గొర్రెలు, మేకలు, పశువుల కళేబరాలతోపాటు మలమూత్రాలు సైతం బురదలోనే తేలియాడుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. అక్కడక్కడా మానవ మృతదేహాలు నీటిపై తేలియాడుతున్నాయి. ఇవన్నీ వరద నీటిలో కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నాయి.
వరద ముంపు బాధితుల కోసం తెస్తున్న ఆహార పదార్థాలు పాడైపోతుండటంతో వాటిని రహదారులపై కుప్పులు కుప్పులుగా వదిలేస్తున్నారు. వర్షం పడిన సమయంలో ఇవన్నీ నీటిలో కలిసిపోయి ఇళ్లను చుట్టుముడుతున్నాయి. మొత్తంగా ముంపు ప్రాంతాల్లోని పరిస్థితులు డంపింగ్ యార్డుల కంటే భయంకరంగా తయారయ్యాయి. ముంపు తగ్గిన ప్రదేశాల్లో నగరపాలక సంస్థ కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు.
పునరావాస కేంద్రాల జాడేది
‘పునరావాస కేంద్రాలా.. అవి ఎక్కడున్నాయి. అసలు ఉన్నాయా. నిజంగా ఏర్పాటు చేసి ఉంటే ఇలా బతుకు జీవుడా అంటూ ఊరు విడిచి పోవాల్సిన పనేంటి’ అంటూ వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముంపునీరు తగ్గుతుండటంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకొచ్చేస్తున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ తడిసిపోవడంతో కట్టుబట్టలతోనే రోడ్డెక్కుతున్నారు. ఎటువైపు వెళ్తున్నామో కూడా తెలియని పరిస్థితి. తిండి తినక నీరసించిపోవడంతో కొద్దిదూరం నడిచి.. కొంతదూరం వెళ్లాక కొద్దిసేపు కూలబడిపోతున్నారు.
తిరిగి శక్తినంతా కూడదీసుకుని నడక సాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలనీలకు కాలనీలు ఖాళీ అయిపోతున్నాయి. మంగళవారం మాదిరిగానే బుధవారం కూడా వరద బాధితులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎవర్ని కదిపినా ఒకటే సమాధానం.. ‘తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. తిందామంటే పట్టెడన్నం లేదు. కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు. ఇంట్లో సామాన్లన్నీ వరద నీటిలో నాశనమైపోయాయి’ అని చెబుతున్నారు.
నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఎవరైనా వచి్చనా.. ప్రధాన వీధుల్లోని వారికే ఆహార పొట్లాలు, నీళ్లు ఇస్తున్నారు. మా వరకు ఏమీ రావట్లేదు. నేను ఇళ్లల్లో పనులు చేస్తుంటా. నా భర్త, బిడ్డ బెల్దార్ కూలీలు. మా జీవితాలు పూర్తిగా రోడ్డు పైకి వచ్చాయి. ప్రభుత్వం మా లాంటి కుటుంబాలను ఆదుకోవాలి. – కురెళ్ల రాజేశ్వరి, శ్రీను, భవానీ, లూనా సెంటర్
ఎలాంటి సాయమూ అందలేదు
మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. మా ప్రాంతంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. మూడు రోజులు పాటు కరెంట్ లేక ఇబ్బంది పడ్డాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం అందలేదు. ఇక పీకల్లోతు నీటిలో ఉండలేక.. స్థానికుల సాయంతో మా కుటుంబమంతా బయటకు వచ్చాం – మన్నెపల్లి సుగుణ, సింగ్‌నగర్
తేలియాడుతున్న టీవీలు... డ్రెస్సింగ్ టేబుల్స్
నీటిపై తేలియాడుతున్న టీవీలు... డ్రెస్సింగ్ టేబుల్స్... మంచాలు... ఇలా పేదలు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న వస్తువులన్నీ వరదపాలయ్యాయి. గుణదల కార్మెల్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో గృహోపకరణాలు ఎక్కువగా నీటిలో తేలియాడుతూ కనిపించాయి. వేలాది రూపాయల విలువైన వస్తువులు వరదలో కొట్టుకుపోతుండటంతో వాటి యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదేవిధంగా పుస్తకాలు, ఇళ్లలోని సరుకులు కూడా తడిసి పనికిరాకుండా పోయాయని కార్మెల్‌నగర్‌కు చెందిన పలువురు తెలిపారు. – గుణదల
వణుకు తగ్గింది.. కునుకు పట్టింది
బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్, పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు బాధితులను వరద బారి నుంచి కాపాడటానికి ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కొందరు మత్స్యకారులు తమ పడవలతో వచ్చారు. నాలుగు రోజులు వరద ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తమవంతు పాత్ర పోషించారు. వరద ఉధృతి కాస్త తగ్గడంతో బుధవారం అజిత్‌సింగ్‌నగర్ బ్రిడ్జి పక్కన పడవలు నిలిపి వాటిపై ఇలా సేదదీరుతున్నారు. – ఆటోనగర్
సందర్శకులకు పొంచి ఉన్న ప్రమాదం
ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణానది దిగువన సీతానగరం పుష్కర ఘాట్‌లకు వెళ్లే మార్గంలో బ్యారేజ్ జనరేటర్ రూమ్ నుంచి పుష్కర ఘాట్‌ల వరకు గత పుష్కరాల సమయంలో నిర్మించిన రిటైనింగ్ వాల్ వరదలకు బలహీన పడింది. ఇప్పుడు అక్కడికి కృష్ణానది వరద ఉధృతిని వీక్షించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఏక్షణంలోనైనా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు మేల్కొని బారికేడ్లను ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. –తాడేపల్లిరూరల్
ఊరి బాట పట్టిన వరద బాధితులు
ఆటోనగర్ (విజయవాడ తూర్పు) : ‘నాలుగు రోజుల నుంచి వరద ముంపులోనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదు. అన్నం, నీళ్లు కూడా దొరకలేదు. మేం చచ్చామో.. బతికామో కూడా ఎవరూ చూడలేదు. అందుకే.. మా సొంతూళ్లకు వెళ్లిపోతున్నాం. పరిస్థితులు బాగుపడితే తిరిగొస్తాం. లేదంటే కలోగంజో తాగి ఊళ్లోనే ఉండిపోతాం’ అని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చి ముంపు ప్రాంతాల్లో స్థిరపడిన వలస జీవులు చెప్పారు. వారిలో అత్యధికులు బుధవారం సొంతూరి బాట పట్టారు. ‘ప్రాణాలతో బయటపడ్డాం.
వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే ఇంత ఇబ్బంది పడే వాళ్లం కాద’ని రాజరాజేశ్వరిపేటకు వలస వచ్చిన ఉత్తరాంధ్ర వాసులు చెప్పారు. ‘చివరకు మా గ్రామాలకు వెళదామన్నా బస్టాండ్, రైల్వేస్టేషన్లకు కనీసం వాహనాలు కూడా అధికారులు పెట్టలేకపోయారు. గత్యంతరం లేని పరిíస్థి్ధతుల్లో నడుచుకుంటూనే రైల్వేస్టేషన్, బస్టాండ్‌కు వెళ్తున్నామని తెలిపారు.
ముంపుబారిన పడిన ప్రాంతాల్లో అద్దెకు ఉండే కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. అద్దె ఇవ్వాలని ఇంటి యజమానులు ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పటికే పనులు లేక అవస్థలు పడుతున్నామని పలువురు మహిళలు వాపోయారు. కాస్తో కూస్తో ఉన్న డబ్బులు కూడా వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు.
చంటి బిడ్డతో మూడు రోజులుగా వ్యాన్‌లోనే...
విజయవాడ సింగ్‌నగర్ పైపులరోడ్డు ఏరియాకు చెందిన వ్యాన్ డ్రైవర్ గోపి, దుర్గ దంపతులకు మూడు నెలల కిందట మగశిశువు జని్మంచాడు. ఆదివారం ఒక్కసారిగా బుడమేరుకు వరద రావడంతో వాళ్ల ఇళ్లు ముగినిపోయింది.
మూడు నెలల చంటి బిడ్డను తీసుకుని రోడ్డెక్కారు. గోపి తాను నడుపుతున్న వ్యాన్‌ను ఆవాసంగా మార్చుకున్నారు. పాత రాజీవ్ నగర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన వరద తక్కువ ఉన్న ప్రాంతంలో వ్యాన్ నిలిపి భార్య, మూడు నెలల కొడుకును దానిలో ఉంచాడు. చంటి బిడ్డతో మూడు రోజులుగా వ్యాన్‌లోనే గాలి, వానకు గడిపారు. స్నానానికి నీళ్లు లేవు. తినేందుకు తిండి లేదు.
చంటిబిడ్డకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్నానం చేయించాల్సి ఉన్నా నీరు లేక ఇబ్బంది పడ్డారు. చివరికి దాతలు అందించిన బాటిల్ వాటర్‌తో వస్త్రాన్ని తడిపి చంటి బిడ్డను శుభ్రం చేస్తున్నారు. దుర్గకు సకాలంలో ఆహారం లేకపోయిన తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకుని బిడ్డకు పాలు ఇస్తూ కాపాడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment