
రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడంలేదు
లోకేశ్ ముందస్తు బెయిల్ అడగొచ్చు.. మేం అడగకూడదా!?
నిందితుడు కాకపోయినా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు
అప్పుడాయన తరఫున ఇదే సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు
ఇప్పుడు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నారు
మిథున్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు
లోకేశ్ కేసు వేరు.. ఆ కేసులో వాస్తవాలు వేరు
ఆయనకిచ్చిన ఉత్తర్వులే ఇవ్వాలని మిథున్ కోరలేరు
సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా
ఏప్రిల్ 3 వరకు మిథున్‌రెడ్డి అరెస్టు వద్దన్న హైకోర్టు
ముందస్తు బెయిల్‌పై ఆ రోజునే ఉత్తర్వులిస్తామన్న కోర్టు
సాక్షి, అమరావతి: మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిని ఏప్రిల్ 3 వరకు అరెస్టుచెయ్యొద్దని హైకోర్టు బుధవారం సీఐడీని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆ రోజున తీర్పు వెలువరిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీచేశారు.
మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో సీఐడీ నమోదుచేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరిపారు. మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా వాదనలు సాగాయి.
అప్పుడు లోకేశ్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు..
ముందుగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడు కానప్పటికీ, ఆ కేసువల్ల ప్రభావితమయ్యే వ్యక్తి ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చునన్నారు. అరెస్టుచేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వెయ్యొచ్చని తెలిపారు. గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. లోకేశ్‌ను నిందితుడిగా చేర్చలేదు కాబట్టి, ఆయనకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందన్నారు.
ఇప్పుడు మిథున్‌రెడ్డి విషయంలో అలాగే నడుచుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అప్పుడో రకంగా, ఇప్పుడు మరో రకంగా సీఐడీ వ్యవహరించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంగా.. లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను నిరంజన్‌రెడ్డి న్యాయమూర్తి ముందుంచారు.
గతంలో లోకేశ్ తరఫున సిద్దార్థ లూథ్రా, ప్రస్తుత ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారని ఆయన కోర్టుకు నివేదించారు. ఆ రోజున నిందితుడు కానప్పటికీ లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సమర్థించిన లూథ్రా.. ఇప్పుడు మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను మాత్రం వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇది వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు.
లోకేశ్‌కు ఇచ్చినట్లే ఉత్తర్వులివ్వాలని మిథున్ కోరలేరు..
లూథ్రా వాదనలు వినిపిస్తూ, లోకేశ్ కేసులో వాస్తవాలకు, ఈ కేసులో వాస్తవాలకు ఏమాత్రం పొంతనలేదన్నారు. లోకేశ్‌కు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని, అలాంటి ఉత్తర్వులే తమకూ ఇవ్వాలని పిటిషనర్ కోరడానికి వీల్లేదన్నారు. మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హతే లేదని లూథ్రా తెలిపారు. పైగా.. విచారణకు హాజరుకావాలని ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదన్నారు.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. దర్యాప్తు అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పీఎల్‌ఆర్ కంపెనీ వివరాలు అడిగామని, అందువల్ల తనను అరెస్టు చేస్తారని పిటిషనర్ చెబుతున్నారని, వాస్తవానికి ఆ కంపెనీలో మిథున్‌రెడ్డి డైరెక్టర్ కాదన్నారు. మద్యం కొనుగోళ్ల వ్యవహారం రూ.వేల కోట్లకు సంబంధించిందన్నారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయ్యొద్దని లూథ్రా కోర్టును కోరారు.
దర్యాప్తు అధికారి తీరును తీవ్రంగా పరిగణించండి..
ఇక ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సెక్షన్ 161 కింద వాంగ్మూలం ఇచ్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వాంగ్మూలంలో మిథున్‌రెడ్డి ప్రస్తావన ఉందన్నారు. ఇదే సమయంలో.. ఓ అధికారి సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని అది తమ వద్ద లేదని సీఐడీ దర్యాప్తు అధికారి చెప్పడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు అధికారిపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్లు కనిపించడంలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఒకవైపు నేరారోపణలకు ఆధారాలు లేవంటారని, మరోవైపు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ పరస్పర విరుద్ధంగా వాదనలు వినిపిస్తోందన్నారు. ఆధారాల్లేకుంటే ముందస్తు బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు.
మిథున్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నందునే తాము ముందస్తు బెయిల్ కోసం కోర్టుకొచ్చామన్నారు. మిథున్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను దగ్గరకు వస్తే అరెస్టుచేయాలన్న ఉద్దేశంతో సీఐడీ ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment