కృష్ణా వరదల నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,016.19 టీఎంసీల ప్రవాహం
స్పిల్ వే గేట్లు, కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా 858.72 టీఎంసీలు సాగర్‌కు విడుదల
ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటిదాకా 647.16 టీఎంసీలు సముద్రంలోకి..
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 93.21, హంద్రీ–నీవా ద్వారా 4.24 టీఎంసీలే రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు
పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం
ఈ సీజన్‌లో ఏ ఒక్కరోజూ అలా విడుదల చేయని సర్కారు
తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం
హంద్రీ–నీవా ప్రాజెక్టులు నిండాలంటే 36 టీఎంసీలు కావాలి
వరద రోజుల్లో శ్రీశైలంలో విద్యుదుత్పత్తిలోనూ తెలంగాణ కంటే వెనుకబడిన ఏపీ
వరద రోజుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని తరలించి ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ నిండేవి
విజయవాడతోపాటు ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ముంపు ముప్పు తప్పేది
ప్రాణ, ఆస్తి నష్టానికి అవకాశమే ఉండేది కాదంటున్న అధికారులు, నిపుణులు
కృష్ణా వరద నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యమే విజయవాడతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో జలప్రళయం సంభవించడానికి.. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీసిందని జలవనరుల శాఖ అధికార వర్గాలు, సాగునీటిరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరదను శ్రీశైలం ప్రాజెక్టులో నియంత్రించేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు మళ్లించి.. గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదలచేసి ఫ్లడ్ కుషన్ ఉంచుకుని ఉంటే జలప్రళయం సంభవించే అవకాశమే ఉండేది కాదని వారు తేల్చిచెబుతున్నారు.
ఈ సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి శుక్రవారం ఉ.6 గంటల వరకూ 1,016.19 టీఎంసీల ప్రవాహం వస్తే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 93.21 టీఎంసీలే మళ్లించారు. ఆ రెగ్యులేటర్‌పై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలంటే ఇంకా 125.29 టీఎంసీలు అవసరం. నిజానికి.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని 2019లో కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.
ఈ నేపథ్యంలో.. వరదల సమయంలో గరిష్ఠస్థాయిలో పోతిరెడ్డిపాడు ద్వారా ఒడిసి పట్టి ఉంటే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులు నిండి ఆ ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేవని.. ప్రకాశం బ్యారేజీ దిగువన ముంపు ముప్పు తప్పేదని, తద్వారా ప్రాణ, ఆస్తి నష్టానికి జరిగేది కాదని వారు స్పష్టంచేస్తున్నారు. 2019, 2020, 2021, 2022లలో కృష్ణా వరదను ప్రభుత్వం ఇదే రీతిలో నియంత్రించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. – ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి
వరద నియంత్రణ చేసేది ఇలాగేనా..
ూ కృష్ణా నది చరిత్రలో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009, సెపె్టంబరు 2న గరిష్ఠంగా 25.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. అప్పట్లో ఈ వరదను సమర్థవంతంగా నియంత్రించడంవల్ల ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహాన్ని గరిష్ఠంగా 11.10 లక్షలకు పరిమితం చేశారు.
» కృష్ణా బేసిన్‌లో ఈ ఆగస్టు 30, 31.. సెప్టెంబరు 1 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆగస్టు 28నే హెచ్చరించింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 28న 1,69,303 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి.
కానీ, ఆ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 30 వేల క్యూసెక్కులను మాత్రమే వదిలారు. ఆ తర్వాత శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగినా ఆగస్టు 28, 29, 30, 31 తేదీల్లో 30 వేల క్యూసెక్కుల చొప్పున.. సెప్టెంబరు 1న 26,042 క్యూసెక్కులను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మళ్లిస్తూ వచి్చన వరదను వచి్చనట్లు సాగర్, పులిచింతల ద్వారా దిగువకు వదిలేశారు.
» దీంతో ప్రకాశం బ్యారేజీని కృష్ణా వరద ముంచెత్తింది. బ్యారేజీ చరిత్రలో ఎన్నడూలేని రీతిలో సెపె్టంబరు 2న గరిష్ఠంగా 11,43,201 క్యూసెక్కుల వరద రావడానికి దారితీసింది. ఆ రోజున కూడా పోతిరెడ్డిపాడు ద్వారా కేవలం 16,417 క్యూసెక్కులు.. సెపె్టంబరు 3న 12 వేల క్యూసెక్కులు మాత్రమే మళ్లించారు.
రాష్ట్ర ప్రయోజనాలు ‘కృష్ణా’ర్పణం..
» వరద నియంత్రణలో ప్రభుత్వ ఘోర వైఫల్యంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే 647.16 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ప్రభుత్వం ముందుచూపుతో పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లించి ఉంటే.. కడలిలో కలిసిన జలాల్లో కనీసం 100 టీఎంసీలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కి ఉండేవని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ సీజన్‌లో ఏ ఒక్కరోజూ ‘పోతిరెడ్డిపాడు’ సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు.
» ఇక హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున తరలిస్తేనే 120 రోజుల్లో ప్రస్తుత డిజైన్ మేరకు 40 టీఎంసీలు రాయలసీమకు అందించవచ్చు. కానీ, ఇప్పటికి కేవలం 4.24 టీఎంసీలే తరలించారు. ఈ సీజన్‌లో గరిష్ఠంగా 1,688 క్యూసెక్కులను మాత్రమే ఎత్తిపోశారు.
» వరద రోజుల్లో మళ్లించిన జలాలను కృష్ణా బోర్డు కోటాలో కలిపేది కాదు.. దీనివల్ల రాష్ట్ర కోటా 512 టీఎంసీల కంటే అధికంగా వాడుకునే అవకాశం ఉండేది. ఇది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి దారితీసేది.
» ఇక శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి చెరి సగం నీటిని వాడుకోవాలి. కానీ, తెలంగాణ జెన్‌కో కంటే ఏపీ జెన్‌కో తక్కువ విద్యుదుత్పత్తి చేసింది.
శ్రీశైలంలోకి ప్రవాహాలు ఇలా..
» ఈ సీజన్‌లో జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకు
» శ్రీశైలానికి వచ్చిన ప్రవాహం : 1,016.19 టీఎంసీలు
» ఇందులో జూరాల నుంచి వచ్చింది : 797.68 టీఎంసీలు
» సుంకేశుల నుంచి వచ్చింది : 217.51 టీఎంసీలు
» హంద్రీ నుంచి వచ్చింది : 1.00 టీఎంసీ
శ్రీశైలం నుంచి విడుదల చేసింది ఇలా..
ఆంధ్రప్రదేశ్..
» పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ : 93.21 టీఎంసీలు
» హంద్రీ–నీవా : 4.24 టీఎంసీలు
»కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 101.45 టీఎంసీలు
తెలంగాణ..
» కల్వకుర్తి ఎత్తిపోతల : 9.91 టీఎంసీలు
» ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రం : 152.74 టీఎంసీలు
» గేట్ల ద్వారా నదిలోకి విడుదల : 604.53 టీఎంసీలు
Comments
Please login to add a commentAdd a comment