శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,09,814 క్యూసెక్కులు
శ్రీశైలంలోకి గంటగంటకు పెరుగుతున్న ప్రవాహం
నిండుకుండలా తుంగభద్ర డ్యామ్..
55 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
సాక్షి, అమరావతి/హొళగుంద/హొసపేటె: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగుపరుగున చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,09,814 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 832.5 అడుగుల్లో 52.14 టీఎంసీలకు చేరుకుంది. పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉపనదులు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచ్చిన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.
ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ.. గేట్లు ఎత్తి వరద ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంటగంటకు పెరుగుతోంది. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,04,972 క్యూసెక్కులు వస్తుండటంతో నీటినిల్వ 87.42 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారడం, ఎగువ నుంచి భారీవరద వస్తుండటంతో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు.
క్రమేణ పెంచుతూ రాత్రికి 55 వేల క్యూసెక్కులు విడుదల చేస్తామని, నదీతీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరులశాఖ అధికారులను తుంగభద్ర బోర్డు ఆదేశించింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదల చేసే జలాలు సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరనున్నాయి. ఇటు జూరాల నుంచి కృష్ణా, అటు సుంకేశుల నుంచి తుంగభద్ర జలాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింతగా పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment