శ్రీశైలం ప్రాజెక్టులోకి గంట గంటకూ పెరుగుతున్న వరద
నాగార్జునసాగర్‌కు 52,599 క్యూసెక్కుల ప్రవాహం.. 127.97 టీఎంసీలకు చేరిన నిల్వ
తుంగభద్ర డ్యామ్ నుంచి 1.58 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల
నేడు శ్రీశైలానికి మరింత వరద పెరిగే అవకాశం
సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది.
కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్‌లోకి 1.21 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment