tungabhadra
-
తుంగభద్రలో ఏటా 699.34 టీఎంసీల లభ్యత
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీకర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.అధ్యయనంలో వెల్లడైన అంశాలివి⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.⇒ సబ్ బేసిన్లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి. ⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది. ⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ
సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. నాగార్జునసాగర్‌లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణా ప్రధాన పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్‌లోకి 1.21 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల బ్యారేజ్‌లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆదివారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కృష్ణమ్మకు జలకళ
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది. సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. -
‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్‌లోకి 4.09 లక్షల క్యూసెక్కులు అలాగే, నాగార్జునసాగర్‌లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది. మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది. గోదావరిలో క్రమంగా తగ్గుముఖం మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలో 199.27 టీఎంసీల నిల్వ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణా, తుంగభద్ర వరద జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న నీరు తోడవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు సుంకేశుల బ్యారేజ్ నుంచి 1,28,985 క్యూసెక్కులు, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న 44,047 క్యూసెక్కులకు హంద్రీ నుంచి వస్తున్న 250 క్యూసెక్కులు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,73,282 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుద్పత్తి చేస్తూ దిగువకు 63,885 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 882.1 అడుగుల్లో 199.27 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాలకు స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహం తోవడంతో సాగర్‌లోకి 67,722 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు 9,351 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 560.4 అడుగుల్లో 233.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌కు దిగువన మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల కృష్ణా వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 10,400 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. వాటికి పాలేరు, మున్నేరు, కట్టలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 22,955 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇందులో కృష్ణా డెల్టాకు 12,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 10,924 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లలోకి స్థిరంగా వరద కొనసాగుతుండటం, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తుండటంతో గురువారమూ శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో వరద ప్రవాహం కొనసాగనుంది. ఇక పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 2,76,712 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 10,100 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,66,612 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
సుంకేసుల బ్యారేజీకి పరుగులు తీస్తున్న తుంగభద్ర
-
9న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల్లో చౌర్యానికి అడ్డుకట్ట వేయడమే అజెండాగా ఈనెల 9న హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నీళ్లను మళ్లించకుండా అడ్డుకట్ట వేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్‌కు 10 టీఎంసీల కోటా ఉంది. నదిలో సహజ ప్రవాహం లేనప్పుడు, సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనప్పుడు.. ఈ కోటా నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ ఈఎన్సీ ప్రతిపాదనలు పంపిస్తుంటుంది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి ఆ నీళ్లు నదీ మార్గంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు చేరగానే.. వాటిని ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి. సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీళ్లను చౌర్యం చేస్తోంది. కృష్ణా బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల క్షేత్ర స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలచౌర్యం బయటపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ హక్కులకు భంగం కలుగుతుందని జాయింట్ కమిటీ తేల్చిచెబుతూ కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను 9వ తేదీన నిర్వహించే బోర్డు సమావేశంలో చైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఆర్డీఎస్ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులతో కూడిన జాయింట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని ప్రతిపాదించనున్నారు. ఎడమ కాలువపై టెలీమీటర్లు ఏర్పాటు చేసి.. నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించాలని సూచించే అవకాశముంది. కోటాకు మించి వాడుకుంటే.. అదనంగా ఉపయోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలిపి.. కోత వేయనున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిగా ఆపేయాలని స్పష్టం చేసే అవకాశముంది. వీటిపై సమావేశంలో మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
Kurnool: జల ప్రళయానికి 12 ఏళ్లు
తుంగభద్ర నది ఉగ్ర రూపం.. కృష్ణానది విలయ తాండవం.. వెరసి జిల్లాకు జల ప్రళయం. కర్నూలు చరిత్రలో ఎన్నడూ చూడని వరద. పుష్కర కాలం గడిచినా ఆ కన్నీటి జ్ఞాపకాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. వాటిని తలుచుకుంటే హృదయం ద్రవిస్తుంది. 2009 సెప్టెంబర్ చివరిలో ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అక్టోబర్ 2వ తేదీన తుంగభద్ర తీరంలో ఉన్న మంత్రాలయం మొదలు నదీ పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ల పైనుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. సుంకేసుల ప్రాజెక్ట్ కట్టలు తెంచుకోవడం, కృష్ణానది జలాలు వెనక్కు ముంచెత్తడంతో కర్నూలు నగరం అతలాకుతలమైంది. కొండారెడ్డి బురుజు సగానికి మునిగిపోయింది. అంతటా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ఆ రోజు రాత్రి కాళరాత్రిగా మారింది. తెల్లారేసరికి వేల మంది కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లల్లోకి బురద చేరి.. వ్యవసాయ భూములు కోతకు గురై.. ఎంతో మంది రోడ్డున బడ్డారు. దాదాపు 50 మంది మృత్యువాత పడ్డారు. రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. నాటి వదర బీభత్సానికి నిదర్శనమే ఈ చిత్రాలు.. – కర్నూలు -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/బళ్లారి/జూపాడు బంగ్లా: కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తివేసి దిగువకు 46.5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు నీటిని వదిలేస్తోంది. ఆ ప్రవాహానికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 55,571 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 3,631 క్యూసెక్కులు వదలుతూ.. మిగులుగా ఉన్న 51,940 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు నూతన హెడ్ రెగ్యులేటర్ 4, 5, 6 గేట్లను అడుగుమేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాల్వకు మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
24 గంటల్లో 27.37 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్/ భద్రాచలం/ కాళేశ్వరం: కృష్ణా నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 24 గంటల్లో 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ .. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఏ స్థాయిలో వరద ఉధృతి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. తుంగభద్ర పోటెత్తడంతో డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. ప్రస్తుతం 4,05,064 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 95 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సాగర్‌కు 31,784 క్యూసెక్కులు శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటితో కలిపి సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుం చి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తోంది. ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ గోదావరి నది శాంతించింది. భద్రాచలం వద్ద వరద తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున నీటిమట్టం 48 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 4 గంటలకు 43 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం 13.70 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి 9.50 మీటర్లకు చేరింది. -
ఎత్తిపోతల పథకం.. సీమకు శరణ్యం
సాక్షి, కడప: శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దిగువకు తోడేస్తుండడంతో కరువుకు నిలయమైన వైఎస్సార్ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే రాయలసీమ, ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కాకుండా సాధారణ వర్షపాతం నమోదయ్యే పక్షంలో దిగువ జిల్లాలకు ముఖ్యంగా వైఎస్సార్ జిల్లాకు నీటి ఇక్కట్లు తప్పవు. గత రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపడంతో లక్షలాది ఎకరాలలో పచ్చని పంటలు కళకళలాడాయి. అప్పట్లో కృష్ణా జలాల కంటే తుంగభద్ర క్యాచ్మెంట్ ఏరియాల్లోని వర్షపు నీరే తాము వాడుకున్నామని ఈ ప్రాంత సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టి తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే జిల్లా మళ్లీ కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వరద సమయంలో త్వరితగతిన నీటిని తెచ్చుకుని ప్రాజెక్టులు నీటితో నింపాలన్న ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకమే శరణ్యమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో సాగునీటి వనరుల పరిస్థితి జిల్లాలో తెలుగుగంగ పరిధిలోని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌తోపాటు సబ్సిడరీ రిజర్వాయర్–1, సబ్సిడరీ రిజర్వాయర్–2, గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పైడిపాలెం, లోయర్ సగిలేరు, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు, పింఛా ప్రాజెక్టులతోపాటు కేసీ కెనాల్ ఉండగా, వీటి పరిధిలో 94.489 టీఎంసీల నీరు అవసరముంది. ఇందులో నాలుగు ప్రాజెక్టులు మినహా మిగిలిన 10 సాగునీటి వనరులు కృష్ణా, తుంగభద్ర జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటి పరిధిలో 86.989 టీఎంసీల నీరు అవసరముంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక రెండు సంవత్సరాల్లో జిల్లాతోపాటు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానదితోపాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం పరిధిలోని తుంగభద్ర నది సైతం పొంగి ప్రవహించాయి. తుంగభద్ర నీళ్లు పెద్ద ఎత్తున కృష్ణాలో కలిశాయి. దీంతో శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. గండికోటలో పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి వనరులకు 18 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు సుమారు 10 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప తదితర నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులకు నీరు చేరింది. అదనపు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తీరాయి. తెలంగాణ వైఖరితో జిల్లా వాసుల్లో ఆందోళన ఈ ఏడాది ముందస్తు వర్షాలు ప్రారంభం కావడంతో సకాలంలో కృష్ణా నీరు దిగువకు చేరి జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో నిండితే గత రెండేళ్లు లాగే సాగునీటి ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్న జిల్లా వాసులకు తెలంగాణ వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలంలో నామమాత్రపు నీరు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు త్వరితగతిన నిండి రాయలసీమ జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు సకాలంలో నీరొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ స్థానికంగా సాధారణ వర్షపాతం నమోదై ఎగువ రాష్ట్రాల్లో నామమాత్రపు వర్షాలు కురిస్తే వైఎస్సార్ జిల్లాకు కృష్ణా జలాలు రావడం గగనం. ఎత్తిపోతల పథకం తప్పనిసరి.. వాస్తవానికి గత రెండేళ్లలోనూ కృష్ణానది నీరు కాకుండా జిల్లా ప్రాజెక్టులకు తుంగభద్ర నీరే వాడుకున్నట్లు సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గత రెండేళ్లలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరు కృష్ణానదిలో చేరింది. ఆ మేరకు మాత్రమే జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని వాడినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంతేగానీ కృష్ణా జలాలు వాడింది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటి ఇక్కట్లు తలెత్తే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం తప్పనిసరి అని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువల ఆధునికీకరణ, ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలంలో నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది. ఒప్పందం మేరకు 15 టీఎంసీల కృష్ణా జలాలను వైఎస్సార్ జిల్లా మీదుగా చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. దీంతోపాటు నెల్లూరు జిల్లాలోని 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల రిజర్వాయర్‌తోపాటు అదే జిల్లాలోని కండలేరు రిజర్వాయర్‌కు జిల్లా మీదుగానే కృష్ణాజలాలను తరలిస్తున్నారు. తెలంగాణ వైఖరితో రాయలసీమ జిల్లాలతోపాటు అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఇటు ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు తప్పవన్నది నిపుణుల వాదన. నీటిని వృథా చేయడం నేరం నీరు జాతీయ సంపద. దానిని వృథా చేయడం నేరం. అవసరం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృథా చేస్తోంది. శ్రీశైలం నీటిని దిగువకు వదలడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్, కడప తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను వెంటనే ఆపాలి శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు వదలడం వల్ల వైఎస్సార్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచినీటి విడుదలను ఆపాలి. – సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కడప మనం వాడుకున్నది తుంగభద్ర నీరే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఉన్న కాస్త నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు తోడేయడం సరికాదు. గత రెండేళ్లలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నాం. మనం వాడుకున్నది కృష్ణా జలాలు కాదు. తుంగభద్ర నీరు మాత్రమే. – వెంకట్రామయ్య, ఈఈ, ఇరిగేషన్, కడప -
నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి
సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
స్నానాలొద్దు.. నీళ్లు చల్లుకుంటే చాలు
సాక్షి, అమరావతి: భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా పుణ్య స్నానాలపై నియంత్రణ చర్యలు చేపట్టనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నదికి ఈ సారి పుష్కరాలు రానున్నాయి. ఇది కృష్ణా నదికి ఉప నది. కర్ణాటకలో అత్యధిక భాగం, మిగతా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మీదుగా కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న 16 ప్రముఖ ఆలయాలలో రూ.కోటి ఖర్చుతో ఆధునికీకరణ, అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది. ► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ► భక్తుల సెంటిమెంట్ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు. ► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ► వైరస్ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది. -
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే.. u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్‌లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి. u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి. u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. -
కరువు నేలకు జలాభిషేకం
సాక్షి, కర్నూలు : ఆలస్యంగానైనా నైరుతి రుతు పవనాలు కరుణించాయి.. తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కరువు జిల్లా కర్నూలు జలాభిషేకంతో పులకించిపోతోంది. జలాశయాలన్నీ నిండుకుండలా తొణికిసలాడుతున్నాయి. ప్రధాన కాలువలు గలగల పారుతూ.. పొలాలన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. చాలా ఏళ్ల తరువాత తుంగభద్ర, కృష్ణా నదులకు రెండోసారి వరదలు వచ్చాయి. శ్రీశైలానికి సెప్టెంబరు నెలలోనే వెయ్యి టీఎంసీలకుపైగా వరద నీరు వచ్చి చేరింది. జలాశయం నిండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా 89.814 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని గాజులదిన్నె మధ్య తరహా ప్రాజెక్టు మినహా మిగిలినవన్నీ దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు ఎలాంటి ఢోకా లేనట్లేనని అధికార యాంత్రాంగం చెబుతోంది. శ్రీశైలానికి వరద కొనసాగుతుండడంతో మరో 70 టీఎంసీలకుపైగా నీటిని వాడుకునేందుకు అవకాశం ఉంది. రిజర్వాయర్ల నీటి మట్టాలు టీఎంసీల్లో .. పుష్కలంగా నీరు.. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు కాలువలకు నీటిని పుష్కలంగా వదులుతున్నారు. ఫలితంగా ఆయకట్టు రైతుల్లో ఆనందం నెలకొంది. కేసీ కాలువ కింద ఇప్పటికే వరి నారుమళ్లు వేసుకోగా..మరికొందరు నాట్లు పూర్తి చేసుకున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో 40కి పైగా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. నదికి వరద కొనసాగుతుండడంతో ఆయా ప్రాంత రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీంతో పాటు శ్రీశైలం వెనక జలాల కింద ఏర్పాటు చేసిన పథకాలు, కుందూ నదిపై ఉన్న పథకాల ద్వారా పంటలకు సాగునీరు అందుతోంది. ఆశాజనకంగా సాగు.. జలాశయాలకు సమృద్ధిగా నీరు రావడం, వర్షాలు ఆశించిన మేర కురవడంతో ఖరీఫ్ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో సాధారణ సాగు 6,09,916 హెక్టార్లుండగా ఇప్పటి వరకు 5,33,692 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పత్తి సాధారణ సాగు 2,40,212 హెక్టార్లు ఉండగా 2,63,595 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు 91190 హెక్టార్లుండగా 79,407 హెక్టార్లలో వేశారు. కాల్వలకు నీరు విడుదల చేయడంతో వరిసాగు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 38,814 హెక్టార్లలో వరిసాగైంది. మొక్కజొన్న 28,712, కంది 63,906, కొర్ర 6,455, సజ్జ 5,683, మినుము 1,953, ఆముదం 16,653, మిరప 10,882, ఉల్లి 13,235 హెక్టార్లలో సాగయ్యాయి. ఇంకా 71,260 హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామ సమీపంలో కళకళలాడుతున్న వేరుశనగ పైరు ఆయకట్టుకు ఇబ్బందులు ఉండబోవు కృష్ణా, తుంగభద్ర నదులకు మరోసారి వరద నీరు వస్తోంది. జిల్లాలోని రిజర్వాయర్లలో 90 శాతానికిపైగా నీరు నిల్వ ఉంది. సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహణపై కలెక్టర్‌తో చర్చించాలని సర్కిల్ ఎస్ఈకి సూచించాం. శ్రీశైలానికి వరద నీరు ఏ మేరకు వస్తుందో చూడాలి. ఆయకట్టుకు మాత్రం నీటి ఇబ్బందులు ఉండబోవు. వెలుగోడులో పూర్తి స్థాయి నీటి మట్టానికి నిల్వ చేస్తాం. గోరుకల్లులో 9 నుంచి 10 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణరెడ్డి, సీఈ జల వనరుల శాఖ -
మళ్లీ వరద
సాక్షి, కర్నూలు: కృష్ణ, తుంగభద్ర నదులకు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ నదులకు వరద వస్తోంది. కృష్ణానదిలో వరద పెరగడంతో బుధవారం మధ్యాహ్నం ఆల్మట్టి డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని నారాయణపూర్‌కు విడుదల చేశారు. అలాగే నారాయణపూర్ నుంచి జూరాలకు 1,13,280 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గత నెల 25న కృష్ణా జలాల ప్రవాహం నిలిచిపోయింది. నదులకు ఒకసారి నీటి ప్రవాహం వచ్చాక రెండో సారి అనేది ఇటీవల కాలంలో చాలా అరుదు. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరి కళకళలాడాయి. కొంత మేర నీటిని ఆయకట్టుకు వాడుకోగా..డ్యాంలలో నీటి మట్టం క్రమంగా తగ్గుతున్న తరుణంలో మళ్లీ నదులకు వరద రావడం విశేషం. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉందని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తుంగభద్ర డ్యాంకు సైతం ఎగువ నుంచి వరద ప్రవాహం ఉండడంతో పది గేట్లు పైకెత్తి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేటి రాత్రికి సుంకేసుల బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఈ నదికి నీటి ప్రవాహం నిలిచిపోయి.. కేసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో మళ్లీ వరద వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సుంకేసుల బ్యాకేజీలో నీటి మట్టం తగ్గడంతో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయనే ఆందోళన ఉండేది. ప్రస్తుత వరదతో తాగునీటి కష్టాలు సైతం గట్టెక్కుతాయని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కర్ణాటక జల చౌర్యానికి చెక్
సాక్షి, ఆదోని(కర్నూలు) : తుంగభద్ర జలాల వినియోగం.. కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా సాగుతోంది. దిగువ కాలువ పరిధిలో యథేచ్ఛగా జల చౌర్యం జరుగుతోంది. కర్ణాటకలో జల చౌర్యాన్ని గత ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతూ జల చౌర్యానికి చెక్ పెడుతోంది. తుంగభద్ర కాలువల భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన వేసిన పైపులను గుర్తించి..వాటిలో కాంక్రీట్‌ను నింపుతున్నారు. కాంక్రీట్ గట్టి పడేంత వరకు 48 గంటల పాటు పోలీసులతో ఎల్లెల్సీ అధికారులు కలిసి కాపలా ఉంటున్నారు. కాంక్రీట్ గట్టి పడిన తరువాత తొలగించడం సాధ్యం కాదు. గతంలో బోర్డు అధికారులు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు యత్నించినా కర్ణాటక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ సారి పోలీస్ బందోబస్తు మధ్య పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నాడు.. తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నా..దిగువ కాలువకు వచ్చేవి అరకొరే. కర్ణాటక రాష్ట్రంలో యథేచ్ఛగా జలచౌర్యం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపినప్పుడు తూతూ మంత్రంగా పోలీసులతో గస్తీ తిప్పి..తరువాత వదిలేసేవి. దీంతో ఆయకట్టులో సాగుకు ఇబ్బందులు ఏర్పడేవి. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గేది. నేడు.. తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నాయి..ఎల్లెల్సీకి వాటా నీరు వదులుతున్నా జిల్లా సరిహద్దుకు వచ్చే సరికి తగ్గిపోతున్నాయి. కర్ణాటక ప్రాంతంలో జల చౌర్యాన్ని అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. అక్రమంగా వేసిన పైపులను గుర్తించి...వాటిని కాంక్రీట్‌తో నింపుతోంది. ఫలితంగా దిగువ కాలువలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది సాగునీటికి ఇబ్బందులు ఉండబోవని, బంగారు పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవీ... హెచ్చెల్సీ, ఎల్లెల్సీ పరిధిలో రెండువేల చోట్ల జలచౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన పైపులను వేసుకొని పెద్ద ఎత్తున నీటిని మళ్లిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ పైపులను కాంక్రీట్‌తో మూసి వేసి..అది గట్టి పడేంత వరకు దాదాపు 48 గంటల పాటు పోలీసులతో కలిసి కాపలా ఉంచుతున్నారు. ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం బుధవారం.. 363 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగో వంతుకు పైగా నీటి చౌర్యం తుంగభద్ర జలాశయంలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఈ ఏడాది అధికారులు అంచనా వేశారు. హెచ్చెల్సీకి 25 టీఎంసీలు, ఎల్లెల్సీకి 18.6 టీ ఎంసీలు కేటాయించారు. అయితే హెచ్చెల్సీ 105కి.మీ, ఎల్లెల్సీ 250కి.మీ కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఏటా టీఎంసీల కొద్ది నీటిని అక్రమంగా మళ్లించుకుంటూ వేల ఎకరాల్లో అక్రమ ఆయకట్టు సాగు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం, బోర్డు అధికారులు కూడా నీటి చౌర్యాన్ని పట్టించుకునే వారు కాదు. దీంతో అనంతపురం, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు కరువు బారిన పడి.. ఏటా వేల ఎకరాలు ఆయకట్టు భూమి బీడుగా మారుతోంది. గత సంవత్సరం ఎల్లెల్సీకి కేటాయించిన 14 టీఎంసీలలో ఆకట్టుకు 8.7 టీఎంసీలు మాత్రమే చేరింది. దాదాపు 5.2 టీఎంసీలకు గండి పడింది. ఎల్లెల్సీ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలో 1, 56,963 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 1,88,777 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో.. దశాబ్దాలుగా జరుగుతున్న నీటి చౌర్యాన్ని అరికట్టడంతో బోర్డు అధికారులు విఫలం అవుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన జరిగిన తుంగభద్ర జలాల కేటాయింపులో రాష్ట్రం తరఫున చర్చల్లో పాల్గొన్న ఈఎన్సీ వెంకటేశ్వరరావు.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సమవేశం దృష్టికి తీసుకువెళ్లారు. నీటి చౌర్యం అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. గత సంవత్సరం జలాల కేటాయింపు, వినియోగాన్ని సమీక్షించి చౌర్యం అయిన నీటిని కర్ణాటక వాటాలో తగ్గించాలని, ఆ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు కూడ నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఏ మేరకు నీటి చౌర్యం జరిగిందో ఖచ్చితమైన వివరాలు ఏపీ చేతిలో ఉండడంతో బోర్డు, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు జల చౌర్యంపై గట్టి చర్యలు తీసుకోడానికి అంగీకరించారు. ఆ మేరకు కాలువ గట్లపై 24 గంటలపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాలువల భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపులను గుర్తించి కాంక్రీట్‌తో నింపుతున్నారు. మూడు రోజులుగా కాంక్రీట్ నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోర్డు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సురేష్‌రెడ్డి, డీఈఈ సేవ్లానాయక్, ఏఈలు రవి, వెంకటేష్ పోలీసు బందోబస్తు మద్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన చోట్ల తాత్కాలికంగా పైపులు, పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరలో నీటి చౌర్యాన్ని పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. బోర్డు అధికారుల చర్యలు పూర్తిగా ఫలిస్తే సీమ జిల్లాల్లో విస్తరించిన ఎల్లెల్సీ, హెచ్ఎల్సీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరుందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లెల్సీలో పెరిగిన నీటి మట్టం బోర్డు సరిహద్దు 250కి.మీ. హానువాళు వద్ద బుధవారం ఎల్లెల్సీలో నీటి మట్టం 363 క్యూసెక్కులు ఉంది. ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం.. ఎగువన చర్యలు చేపట్టడంతో నీటి మట్టం పెరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ఇండెంట్ మేరకు బోర్డు సరిహద్దు వద్ద 600 క్యూసెక్కులు ఉండాలి. ఎగువన నీటి చౌర్యంను పూర్తిగా అరికడితే ఆ మేరకు నీటి మట్టం పెరుగవచ్చని ఎల్లెల్సీ అధికారులు, రైతులు ఆశిస్తున్నారు. -
తుంగభద్రపై కర్ణాటక పెత్తనం
సాక్షి, కర్నూలు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన జలవనరుల్లో ఒకటి తుంగభద్ర డ్యాం. ఈ డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఏటా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన వాటాల మేరకు నీటిని కేటాయిస్తారు. అదే విధంగా డ్యాంలోకి వచ్చే నీటి చేరికలను బట్టి డ్యాం ఆధారిత ప్రాంతాల్లో తాగునీరు, సాగు కష్టాలను దృష్టిలో పెట్టుకొని కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే దశాబ్దన్నర కాలంగా తుంగభద్ర జలాల వినియోగంలో కర్ణాటక ఇష్టారాజ్యంతో జిల్లాకు అన్యాయమే జరుగుతోంది. కర్ణాటక కాలువలకు అనుమతులు లేకున్నా నీరు.. ఏటా డ్యాంలోకి నీటి చేరికలు మొదలైన తరువాత ముందుగా కర్ణాటక రాష్ట్ర పరిధిలోని సాగు నీటి కాలువలకు నీరు ఇచ్చిన తరువాతనే ఏపీకి చెందిన కాలువలకు ఇస్తున్నారు. అది కూడా ఇండెంట్‌కు అనుమతులు వచ్చేంత వరకు టీబీ బోర్డు అధికారులు చుక్క నీటిని వదలరు. కర్ణాటకకు చెందిన కాలువలకు మాత్రం అనుమతులు లేకపోయినా సాగు కోసం నీటిని విడుదల చేస్తుండడంతో అనంత, కర్నూలు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ జిల్లాల్లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాగునీటి అవసరాలకు సైతం నీరు విడుదల చేయడంలో బోర్డు అధికారులు జాప్యం చేశారు. ఈ లోపు టీబీ డ్యాంకు వరద నీరు వచ్చింది. డ్యాం గరిష్ట స్థాయికి చేరుకొని గేట్లుపైకెత్తి నీటిని నదిలోకి వదిలారు. అయితే హెచ్చెల్సీ, ఎల్ఎల్సీ కాలువలకు మాత్రం సాగునీటిని విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కడలికి చేరుతున్న వరద జలాలు.. తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 100 టీఎంసీలు. ఈ జలాలతో కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఆధారం. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సాగు, 8 నియోజకవర్గాల్లో తాగు నీటి అవసరాలకు సైతం తుంగభద్ర జలాలే ఆధారం. జిల్లాకు మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎల్ఎల్సీ కాలువకు 24 టీఎంసీలు, హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలను కేటాయించింది. అయితే దశబ్దన్నర కాలంగా ఎల్ఎల్సీకి 13, హెచ్చెల్సీకి 18 టీఎంసీలకు మించి అందని పరిస్థితి. డ్యాం నుంచి వరద నీరు దిగువకు ఇప్పటి వరకు 45 టీఎంసీలు వదిలారు. కాల్వలకు మాత్రం ఇవ్వలేదు. ఇదేంటని బోర్డు అధికారులను అడిగితే ఇండెంట్ పెడితే నీటిని ఇస్తామని, వరదల సమయంలో నీరిచ్చినా కేటాయింపుల్లోకే లెక్కిస్తామని చెబుతున్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ క్రమంగా తగ్గుముఖం పట్టింది.. గతం వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన వరద ఆదివారం వరకు 8 లక్షల క్యూసెక్కులకు చేరింది.. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంట పొలాలు, పలు గ్రామాలు నీట మునగడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.. గత పదేళ్ల నాటి వరదలను దృష్టిలో ఉంచుకొని ఒకింత భయాందోళనకు గురయ్యారు.. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సోమవారం సాయంత్రం నుంచే వరద నీటి ప్రవాహం తగ్గుతూ వస్తోంది.. మంగళవారం వరకు ఏకంగా లక్ష క్యూసెక్కుల మేర తగ్గడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకున్నారు.. సాక్షి, వనపర్తి : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణానది వరద రోజురోజుకు ఉగ్రరూపం దాల్చి.. మూడురోజులుగా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తింది. ఈ క్రమంలో మంగళవారం కృష్ణమ్మ శాంతించడంతో అధికారులు, రైతులు ఊపిరి పీల్చుకున్నాయి. శనివారం రాత్రి తొమ్మిది గంటలకు జూరాల నుంచి దిగువకు 6,30,642 క్యూసెక్కుల వరద నీరు వదిలారు. 24 గంటల వ్యవధిలోనే ఆదివారం తొమ్మిది గంటలకు వరద ఉధృతి పెరిగింది. దిగువకు వదులుతున్న నీరు 8,57,488 క్యూసెక్కులకు చేరింది. ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీరు పెరగడంతో కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుమారు 11 గ్రామాల్లో పంట పొలాలు, పండ్లతోటలు, పలు గ్రామాలు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు 2009లో ముంచెత్తిన వరదలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లోని 23 గ్రామాల్లో ప్రమాదపు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కో గ్రామానికి ఒక్కో అధికారిని కేటాయించి ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని నమోదు చేసుకున్నారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు వరద ఉధృతి పెరుగుతూ వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి కొద్దిగా తగ్గింది. పెరిగిన కృష్ణానది వరదకు తుంగభద్ర నదీ సోమవారం ఉదయం నుంచి పోటెత్తి సుమారు 2.20 లక్షల క్యూసెక్కుల నీటితో కృష్ణమ్మతో కలిసి శ్రీశైలానికి పరుగులు తీసింది. పొలాలు చాలా వరకు నీట మునిగిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి కృష్ణమ్మ శాంతిస్తూ వస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు 8,67,099 క్యూసెక్కుల వరద నుంచి సాయంత్రం ఆరు గంటలకు 8,26,855కు తగ్గింది. రాత్రి తొమ్మిది గంటలకు 8,16,957 క్యూసెక్కులు వచ్చింది. నాలుగు గేట్ల మూసివేత సోమవారం ఉదయం నుంచి పన్నెండు గంటల వరకు వచ్చి వరదతో పోల్చితే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సుమారుగా లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గింది. జూరాల వద్ద 62 క్రస్టుగేట్లతో దిగువకు వచ్చే వరద నీరు మంగళవారం మధ్యాహ్నం వరకు అధికారులు జూరాల వద్ద నాలుగు గేట్లను మూసివేసి 58 గేట్ల నుంచి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలోనే.. దాదాపు 24 గంటల వ్యవధిలోనే కృష్ణమ్మ సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు తగ్గి ప్రవహించడంతో జిల్లా పరిధిలోని నదీ పరివాహక ప్రాంతాల్లో సుమారు పది అడుగుల మేర వరద నీరు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో రైతులు తమ పంటలకు ఢోకా లేదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద పెరిగితే పరిస్థితి ఏంటి.. గ్రామాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని భావించిన అధికారులకు మంగళవారం వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మంగళవారం సైతం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉన్నారు. -
శ్రీశైలంలోకి భారీ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/ధవళేశ్వరం/రంపచోడవరం: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గురువారం మహారాష్ట్రలో మహాబళేశ్వర్, కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద ప్రవాహం చేరుతోంది. గురువారం రాత్రికి శ్రీశైలం జలాశయంలోకి 3,01,570 క్యూసెక్కులు వస్తోంది. జలాశయంలో ప్రస్తుతం 875 అడుగుల్లో 163.20 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. మరో 52 టీఎంసీలు వస్తే శ్రీశైలం జలాశయం నిండుతుంది. శుక్రవారం నాటికి ఎగువ నుంచి శ్రీశైలానికి 3,06,169 క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నివేదికలో పేర్కొంది. శ్రీశైలం జలాశయం పవర్‌హౌస్‌ల ద్వారా విడుదల చేసిన వరద నీరు 73,912 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌లోకి చేరుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 2,09,319 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 2,16,040 క్యూసెక్కులు వదులుతున్నారు. కర్నూల్ జిల్లా మంత్రాలయంలో అధికారులు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సుంకేసుల బ్యారేజీలోకి కూడా 1,81,066 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,78,712 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి గురువారం సా.6 గంటలకు 13,850 క్యూసెక్కుల వరద రాగా.. ఆ మొత్తాన్ని దిగువకు విడుదల చేశారు. అలాగే, ఉత్తరాంధ్రలోని వంశధార కూడా ఉప్పొంగింది. గురువారం సా.6 గంటలకు 44,189 క్యూసెక్కులను గొట్టా బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలారు. నాగావళి కూడా పొంగిపొర్లుడడంతో తోటపల్లి బ్యారేజీ నుంచి దిగువకు 26 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గురువారం 4,52,855 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. అలాగే, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పలు వాగులు రహదారులపై నుంచి పెద్దఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా గురువారం ఆంధ్రా నుంచి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన గోదావరికి భారీగా వరద వస్తుండడంతో శబరి నది ఉధృతి కూడా ఎక్కువగానే ఉంది. ప్రధాన రహదారులపై నుంచి సుమారుగా పది అడుగుల మేర నిలిచి ఉంది. దీంతో పలు పంచాయితీల్లోని 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల ఎత్తివేత..!
సాక్షి, కర్నూలు: తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో 33 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,67,485 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1,99,432 క్యూసెక్కుల నీటిని దిగువగు వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటమట్టం 1633 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం నాటికి 1631.63 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ100.86 టీఎంసీలు కాగా, 95.64 టీఎంసీల నీటితో తుంగభద్ర నిండు కుండలా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
శ్రీశైలానికి ఆగని వరద
సాక్షి, హైదరాబాద్: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు. రెండ్రోజుల క్రితంతో పోలిస్తే ఈ రెండు ప్రాజెక్టులకు 70 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం పెరిగింది. ఆల్మట్టిలోకి మంగళవారం సాయంత్రం 95,680 క్యూసెక్కుల మేర వరద వచ్చి చేరగా, 65 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌కు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 92,680 క్యూసెక్కులు దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు రెండ్రోజుల కిందటి వరకు 60వేల క్యూసెక్కుల వరద రాగా, అది మరోమారు పుంజుకొని 1.12 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండి ఉండటంతో అక్కడి నుంచి 1.18లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర పరిధిలోని జూరాలకు 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, 50 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నీటికితోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి 95,680 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 150.81 టీఎంసీల నిల్వలున్నాయి. దిగువ నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 64,449 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 17,226 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టు మట్టం 312 టీఎంసీలకు గానూ 153.69 టీఎంసీలకు చేరింది. గోదావరిలో తగ్గిన ప్రవాహం.. : ఇక గోదావరిలో ప్రవాహాలు తగ్గిపోయాయి. ఎల్లంపల్లిలో నిన్నమొన్నటి వరకు భారీ ప్రవాహాలురాగా, మంగళవారం 15,719 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగానూ 19.04 టీఎంసీల నిల్వ ఉంది. ఇక కడెంలోకి 2,366 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎస్సారెస్పీలోకి 2,300 క్యూసెక్కులు వస్తుండగా నిల్వ 90 టీఎంసీలకు గానూ 16.91 టీఎంసీలకు చేరింది. సింగూరు, నిజాంసాగర్, ఎల్‌ఎండీల్లోకి ఎలాంటి ప్రవాహాలు నమోదు కావడం లేదు. -
జూరాలకు మళ్లీ వరద
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ వర్షాలు కురు స్తుండటంతో నారాయణపూర్, తుంగభద్ర గేట్లు 15 రోజుల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్ నీరు గురువారానికి జూరాల చేరనుంది. తుంగభద్ర నుంచి ఒకట్రెండు రోజుల్లో శ్రీశైలానికి ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తిగా నిండిన ఆల్మట్టికి ప్రస్తుతం 30,900 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆ నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో దిగువనున్న నారాయణపూర్‌లోకి 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అక్కడి నుంచి 7 గేట్లు ఎత్తి 22,240 క్యూసెక్కుల నీరు దిగువ జూరాలకు వదులుతున్నారు. జూరాలలో 9.66 టీఎంసీలకుగానూ 7.89 టీఎంసీల నీరుంది. 16 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 5,860 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల పథకాల అవసరాలకు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకూ స్థిరంగా వరద తుంగభద్రకూ వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. బుధవారం 21,483 క్యూసెక్కుల ప్రవాహం రాగా 3 గేట్లు ఎత్తి 18,452 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో 100 టీఎంసీల నిల్వకుగానూ 98.20 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వకుగానూ 144.11 టీఎంసీలున్నాయి. సాగర్‌కు శ్రీశైలం నుంచి 23,768 క్యూసె క్కుల నీటిని విడుదల చేశారు. దీంతో సాగర్‌లోకి 17,643 క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్‌లో 144.04 టీఎంసీల నీరుంది. గోదావరి పరీవాహకంలో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టుల్లో ఎక్కడా ప్రవాహాల జాడ కనిపించడం లేదు. -
రసాభాసగా తుంగభద్ర అడ్వైజరీ బోడు భేటీ
-
తుంగభద్రపై ఏపీ మరో ఎత్తిపోతలు!
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర నదీ జలాలను వినియోగించుకుంటూ భారీ ఎత్తిపోతల చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. 40 టీఎంసీల మేర నీటిని వినియోగించుకుంటూ ఏకంగా రూ.12వేల కోట్లతో ‘నాగల్‌దిన్నె, అనంతపూర్ ఎత్తిపోతల పథకం’చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తుంగభద్ర జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా చేపడుతున్న ఈ ఎత్తిపోతలను ఎట్టి పరిస్థితుల్లో నిలువరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తూ త్వరలోనే కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా నందవరం మండలం నాగల్‌దిన్నె సమీపంలో 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక రూపొందించింది. ఈ నీటిని నిల్వ చేసేందుకు 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదిస్తోంది. దీనిద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగు, తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తోంది. మహబూబ్‌నగర్‌కు ముంపు.. ఈ పథకం చేపట్టిన పక్షంలో దిగువన ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులకు, వాటి నీటి అవసరాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జరిగే నష్టాన్ని పేర్కొంటూ ఓ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలిసింది. దాని ప్రకారం ‘కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–1 ప్రకారం కృష్ణా బేసిన్ పరిధిలో ఎలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టినా తెలంగాణ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏపీ ఎలాంటి అనుమతినీ తీసుకోలేదు. దీనికితోడు తుంగభద్ర జలాలు శ్రీశైలం ప్రాజెక్టు అవసరాలను తీరుస్తున్నాయి. శ్రీశైలం నిండితే సాగర్‌కు నీటి లభ్యత పెరుగుతుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాలను ఎగువే వినియోగిస్తే దిగువన ఉన్న శ్రీశైలం, సాగర్లు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే ప్రభావం ఉంటుంది. ఇక నీటి నిల్వలకు అనుగుణంగా 15 నుంచి 20 టీఎంసీల రిజర్వాయర్ల నిర్మాణానికి ఏపీ ప్రణాళిక వేసింది. దీనివల్ల మహబూబ్‌నగర్ జిల్లాలోని చాలా ప్రాంతాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. ఈ దృష్ట్యా ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకుండా కేంద్రం జోక్యం చేసుకుని ఏపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలి’అని నివేదికలో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ నివేదికలోని అంశాలతో త్వరలోనే కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.