జూరాల.. పారాల!
- ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద
- మరో 50 టీఎంసీలు చేరితే జూరాలకు ప్రవాహాలు మొదలు
- నారాయణపూర్‌కూ భారీ ప్రవాహాలు
సాక్షి, హైదరాబాద్: వానమ్మ కరుణించింది. కృష్ణమ్మ పరవశించింది. ఎగువన వాన వెల్లువైంది. దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చే వేళ అయింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది విశ్వరూపం చూపుతోంది. అక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో గడిచిన 4 రోజులుగా 40 నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారానికి ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 12 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.91 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌కు 30,966 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్య ముండగా ప్రస్తుతం 26.61 టీఎంసీలకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీల మేర నిల్వలు పెరిగితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరదే మరిన్ని రోజులు కొనసాగితే 5 రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవా హం మొదలయ్యే అవకాశముం ది. ఇక తుంగభద్రకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. రెండ్రోజుల కిం దటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం అక్కడ 51,162 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో 100 టీఎంసీలకుగానూ అక్కడ 26.61 టీఎంసీల నిల్వలున్నాయి.
ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు
ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర నీరు వచ్చింది. మరో 390 టీఎంసీల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. శ్రీశైలంలో 215 టీఎంసీలగానూ కేవలం 19 టీఎంసీల నీరే నిల్వ ఉండగా, సాగర్‌లో 312 టీఎంసీలకు 117 టీఎంసీల నీరే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నిల్వల్లో వినియోగార్హమైన నీరు 2 టీఎంసీలకు మించి ఉండదు. ఇక జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 6.8 టీఎంసీ నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని ఇప్పటికే డిమాండ్‌లు పెరిగాయి. అయితే, ఎగువ ప్రవాహాలు మొదలైతే కానీ నీటి విడుదలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.