
సీడబ్ల్యూసీ తొలి అధ్యయనంలో వెల్లడి
20 ఏళ్ల ప్రవాహాల ఆధారంగా అధ్యయనం
సాక్షి, అమరావతి: కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. తుంగభద్ర సబ్ బేసిన్‌లో 2003–04 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా తీసుకుని నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. కృష్ణా నదిలో 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ 3,048.37 టీఎంసీల లభ్యత ఉంటుందని ఇటీవల అంచనా వేసింది. ఇందులో గరిష్టంగా తుంగభద్ర సబ్ బేసిన్ నుంచే వస్తుందని లెక్కగట్టింది.
తుంగభద్ర సబ్ బేసిన్ ఇదీ
కర్ణాటక పశ్చిమ కనుమల్లోని వరాహ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,458 మీటర్ల ఎత్తులో గంగమూల వద్ద వేర్వేరు ప్రాంతాల్లో తుంగ, భద్ర జన్మిస్తాయి. తుంగ 147 కి.మీ., భద్ర 171 కి.మీ, దూరం ప్రయాణించాక కూడలి వద్ద సంగమించి తుంగభద్రగా మారిన అనంతరం 531 కి.మీ. దూరం ప్రవహించి.. తెలంగాణలోని జోగులాంబ జిల్లా గుండిమల వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర సబ్ బేసిన్ 70,764 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. కృష్ణా నదికి అతి పెద్ద ఉప నది తుంగభద్ర.
అధ్యయనంలో వెల్లడైన అంశాలివి
⇒ 2002–03 నుంచి 2022–23 వరకూ 20 ఏళ్లలో సగటున ఏటా 862.47 మి.మీ. వర్షపాతం కురిసింది. దీని పరిమాణం 2,155.58 టీఎంసీలు.
⇒ బాష్ఫీభవనం (ఆవిరి) రూపంలో ఏటా 1,633.20 టీఎంసీలు వాతావరణంలో కలుస్తాయి.
⇒ సబ్ బేసిన్‌లో సాగు చేసిన పంటల ద్వారా ఏటా సగటున 190.02 టీఎంసీలు ఆవిరవుతాయి.
⇒ నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో ఏటా సగటున 24.02 టీఎంసీలు ఆవిరి రూపంలో వాతావరణంలో కలుస్తాయి.
⇒ సాగు, తాగు, పారిశ్రామిక, గృహ అవసరాలకు ఏటా సగటున 699.34 టీఎంసీల లభ్యత ఉంటుంది.
⇒ సబ్ బేసిన్లలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం ఇదే తొలిసారి కావడం గమనార్హం.