
పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దిగువన నిర్మాణం
2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తుతో సిమెంట్ కాంక్రీట్‌తో బట్రెస్ డ్యామ్ పనులు
అంతర్జాతీయ నిపుణులు ఖరారు చేసిన డిజైన్‌ను ఆమోదించిన కేంద్ర జలసంఘం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దాని దిగువన బట్రెస్ డ్యామ్ నిర్మించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు దిగువన టోయ్(అడుగు భాగం)లో దీనిని నిర్మించేలా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) ఖరారు చేసిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి సమాంతరంగా 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తుతో రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్‌తో బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించింది.
జూలైలోగా బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్దేశించింది. 2016–18 మధ్య ఎగువ కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్ వాల్) నిర్మాణంలో నాటి టీడీపీ సర్కార్ తప్పిదం వల్ల సీపేజీ అధికంగా ఉందని పీవోఈ తేల్చింది. గోదావరి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు కొనసాగించాలంటే ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీని నియంత్రించాలని.. అందుకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది.
దాంతో బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. కాంట్రాక్టు సంస్థ రూపొందించిన డిజైన్‌పై ఈనెల 4న పీవోఈతో సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో పీవోఈ చేసిన సూచనల మేరకు డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆ మేరకు రూపొందించిన బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది.
ఏమిటీ బట్రెస్ డ్యామ్
కాంక్రీట్ ఆనకట్ట, కాఫర్ డ్యామ్ సీపేజీ (లీకేజీ) నీటిని నియంత్రించడానికి దాని దిగువన రీయిన్‌ఫోర్స్‌మెంట్ కాంక్రీట్‌తో నిర్మించేదే బట్రెస్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ పునాదిలో లోపాల వల్ల సీపేజీ అధికంగా ఉంది. దాన్ని నియంత్రించాలంటే దానికి పొడవునా దిగువ భాగంలో మరో చిన్న సైజు (బట్రెస్) డ్యామ్ నిర్మించాలని పీవోఈ సూచించింది. పునాది స్థాయి నుంచి ఇనుప కడ్డీలు, సిమెంట్ కాంక్రీట్‌తో భూఉపరితలానికి 8 మీటర్ల ఎత్తు వరకూ బట్రెస్ డ్యామ్‌ను నిర్మిస్తారు.
బంకమట్టి ప్రాంతంలోనూ డీ–వాల్‌కు లైన్ క్లియర్
ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలోనూ డయాఫ్రం వాల్ (డీ–వాల్) నిర్మాణానికి సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న డీ వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ చేసి.. ఇసుక సాంద్రతను పెంచి.. నేలను పటిష్టం చేయాలని పీవోఈ సూచించింది.
ఆ తర్వాత డీ–వాల్ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. దాంతో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మించనున్న డీ–వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ పనులను కాంట్రాక్టు సంస్థ శుక్రవారం ప్రారంభించింది.