కృష్ణా నది పొడవునా కొనసాగుతున్న వరద ప్రవాహం
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ప్రధాన పాయతోపాటు ఉప నదులు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఇప్పటికే నిండుకుండలా మారడంతో వచి్చన వరదను వచి్చనట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ వరద అంతా జూరాలకు వస్తుండగా.. 37 గేట్లు ఎత్తేసి నీటిని విడుదల చేస్తున్నారు. అలా కృష్ణమ్మ పరుగుపరుగున శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర డ్యామ్ నిండుకుండలా మారింది.
ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు గేట్లు ఎత్తి నీటిని వదలడం ప్రారంభించారు. నీటి విడుదలను క్రమేణా పెంచుతామని, నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులకు తుంగభద్ర బోర్డు సమాచారం ఇచ్చింది. తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలవుతున్న నీళ్లు సుంకేశుల బరాజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతాయి. ఇటు జూరాల నుంచి, అటు సుంకేశుల నుంచి వచ్చే ప్రవాహాలతో.. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద భారీగా పెరగనుంది.
సాగర్ ఎడమ కాల్వ కట్టకు బుంగ
నడిగూడెం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం సమీపాన సాగర్ ఎడమ కాల్వ కట్టకు ఆదివారం రాత్రి బుంగ పడింది. కట్టతోపాటు, కాల్వ లైనింగ్ కూడా కోతకు గురైంది. దీంతో అధికారులు కృష్ణానగర్, చాకిరాల వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. బుంగపడిన చోట కంచె ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన చిన్న బుంగ ప్రస్తుతం పెద్దగా మారి, కట్ట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాల్వ కట్టలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment