streams
-
డోలీ కట్టి.. రోగిని తరలించి
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లాలో ఈ ఏడాది వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండడంతో వాగు అవతలి గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. సాధారణ ప్రజలే కాకుండా రోగులూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను కొన్నిసార్లు చేతులపై, ఇంకొన్నిసార్లు మంచంపై వాగు దాటించిన సంఘటనలు తెలిసిందే. తాజాగా కెరమెరి మండలం బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన ఆడే నాందేవ్ శుక్రవారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడు. ఓ వైపు పొంగిపొర్లుతున్న అనారపల్లి వాగు, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న రోగి.. ఈ పరిస్థితుల్లో అతన్ని శనివారం ఆరుగురు కుటుంబ సభ్యులు డోలీపై పడుకోబెట్టి వాగు దాటించారు. అనార్పల్లి నుంచి జీపుపై కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం మళ్లీ వాగు దాటించి ఇంటికి చేర్చారు. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, నెట్వర్క్: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి ప్రవహించాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయి వర్షాలు పడటం ఇదే మొదటిసారి. కాగా వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత పడిన వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు మేలు చేస్తాయని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 38.4 మిల్లీ మీటర్లు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18.9 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 10.1 మిల్లీమీటర్లు చొప్పున సగటు వర్షపాతం నమోదయ్యింది. అధికారులు కుమురంభీం ప్రాజెక్టు ఐదో గేటు ఎత్తారు. కడెం ప్రాజెక్టుకు 41,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో మూడు వరద గేట్లను ఎత్తి 36,079 క్యూస్కెకుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద పెరిగి.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా–బి గ్రామ సమీపంలోని 353 బి జాతీయ రహదారిపై ఆరు నెలల క్రితం బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్రిడ్జి కింద వాగుపై కొద్ది రోజులుగా తాత్కాలిక వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూలీలు పనులు చేస్తుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన ఎనుగందుల రాజలింగు, ధోని సంతోష్ వాగు మధ్యలో చిక్కుకుపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో వారిని బయటకు తెచ్చారు. పిడుగుపాటుకు గురై యువకుడి మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా సిరిసిల్లలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన పడిగె సతీశ్ (32) పిడుగుపాటుకు గురై మరణించాడు. మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ శివారులోని చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం డిస్క్ ఫిల్టర్ పిడుగు పడటంతో దెబ్బతింది. తోకలపల్లి గ్రామానికి శనివారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఏఎల్ఎంలు వెంకటేశ్, పరమేశ్‌లు చెరువులో ఈత కొట్టుకుంటూ వెళ్లి డిస్క్ ఫిల్టర్‌ను మార్చి విద్యుత్‌ను పునరుద్ధరించారు. -
దూకుడే ప్రాణాలు తీసింది
మారేడుమిల్లి: ఇద్దరు యువకుల మృతితో విహార యాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం నుంచి వచ్చిన ఆరుగురు యువకుల్లో కాళిదాస్ సందీప్ (24), దాన అరుణ్ కుమార్ (22 ) ఆదివారం పాములేరు వాగులో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. వాగులో స్నానం ప్రమాదకరమని హెచ్చరికలున్నా దూకుడుగా వ్యవహరించి దిగడం వల్లే ప్రాణాలు కోల్పోయారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. మృతుల్లో సందీప్ డిగ్రీ పూర్తి చేశారు. అరుణ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తోటి స్నేహితులు తెలిపారు. వల్లూరు.. కన్నీరు. వాగుల్లో గల్లంతై ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకుల స్వగ్రామం మండలంలోని వల్లూరు కన్నీరుమున్నీరైంది. రెండు ఆటో కార్మిక కుటుంబాలను పెను విషాదంలో ముంచింది. మండలంలోని వల్లూరుకు చెందిన మృతులు కాళిదాస్ సందీప్ (20), దాన అరుణ్‌కుమార్ (22) అవివాహితులు. అరుణ్ కుమార్ తండ్రి సత్యనారాయణ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి సీత గృహిణి. వీరికి ముగ్గురు కొడుకులు. ఆఖరి కొడుకైన అరుణ్ కుమార్ కూలి పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పాములేరు ఘటనలో మృత్యువాత పడ్డాడు. విహారానికి వెళ్లి విగత జీవిగా మిగిలావా అంటూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. మరో మృతుడు సందీప్ తండ్రి చంటిదొర కూడా ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి మేరీ కువైట్‌లో ఉంటోంది. ఐదు నెలల క్రితం అక్కడకు వెళ్లింది. వీరికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ పాములేరు వెళ్లారు. పెద్ద కుమారుడైన సందీప్ వాగుకు బలయ్యాడు. నిత్యం ఎంతో సందడిగా ఉండే సందీప్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు గుండెలు బద్దలయ్యేలా రోదిస్తున్నారు. (చదవండి: ఇన్ఫోసిస్ @ వైజాగ్!) -
గర్భిణులకు వాన కష్టాలు
అశ్వాపురం/నేరడిగొండ(బోథ్)/మోర్తాడ్ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్‌లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. మంచంపై అంబులెన్స్ వరకు.. మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్ వరకు తరలించారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్ నవీన్ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్ దూరం లో ఉన్న అంబులెన్స్ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు. గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్వాడీ టీచర్లు -
వరద హోరు..
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): ఎడతెరిపి లేని వర్షంతో జిల్లా తడిసి ముద్దయింది. శుక్రవారం రాత్రి నుంచి వరుణుడు ఆగకుండా ప్రతాపం చూపడంతో జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 1,177.6 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షంతో జిల్లాలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకుని రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల పంటలు నీటమునిగాయి. గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, పాల్వంచ తదితర మండలాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాకు ఎగువ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురవడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని నది, జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. గుండాల మండలంలోని మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, నడివాగు, దున్నపోతులవాగు భారీగా ప్రవహిస్తుండడంతో మండలంలోని 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల మండలం నాగారం గ్రామానికి చెందిన పర్శిక శిరీష అనే గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనేక అవస్థలు పడాల్సి వచ్చింది. 5 కిలోమీటర్ల మేర ట్రాక్టరుపై తీసుకొచ్చారు. కిన్నెరసాని వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ఆమెను దాటించేందుకు అనేక గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఇసుకవాగు పొంగుతుండడంతో ఎలకలగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, ఇప్పలగుంపు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గ్రామంలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. 22 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఇక బూడిదవాగు పొంగడంతో సూరారం, సోములగూడెం, పాండురంగాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో రాజాపురం వద్ద నీటి ప్రవాహం ఉధృతమైంది. పొలాల్లో రైతులు ఏర్పాటుచేసుకున్న మోటార్లు కొట్టుకుపోయాయి. చర్ల మండలంలో బత్తినపల్లి వాగు, బాగనెల్లి వాగు, చింతవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బత్తినపల్లి, కుర్నపల్లి, బాగనెల్లి, చింతగుంపు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మణుగూరు మండలంలోని కోడిపుంజులవాగు ఉవ్వెత్తున ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరింది. రోడ్లపైకి నీరు వచ్చింది. బూర్గంపాడు మండలంలో పంటలు నీటమునగగా కొత్తగూడెం, మణుగూరు, టేకులపల్లిలో ఓసీల్లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలంలో రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి. దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం కూలిపోయింది. పర్ణశాలలో సీతమ్మవాగు ఉప్పొంగుతోంది. కొత్తగూడెంలో ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సుజాతనగర్ మండలంలో ఎదుళ్లవాగు ఉరకలెత్తుతోంది. దమ్మపేట మండలం మొండివర్రె గ్రామంలో గోపికృష్ణ అనే రైతుకు చెందిన కాకరతోట పడిపోయి రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. గోదావరిలో గల్లంతైన ముగ్గురిని రక్షించిన పోలీసులు.. పినపాక మండలం రాయిగూడెం వద్ద ముగ్గురు యువకులు గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు పడవల సహాయంతో వారిని రక్షించారు. లక్ష్మిదేవిపల్లి మండలం చింతపెంట వద్ద ఎర్రసానివాగు ప్రవాహంలో ఒక ఆటో, రెండు బైకులు కొట్టుకుపోయాయి. స్థానికుల సహాయంతో ప్రయాణికులు బయటపడ్డారు. గరిష్ట నీటిమట్టానికి జలాశయాలు.. గేట్ల ఎత్తివేత.. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయంలోకి 407 అడుగుల గరిష్ట మట్టానికి నీరు చేరడంతో శనివారం అధికారులు మొత్తం 13 గేట్లు ఎత్తి 88 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలో గరిష్ట నీటిమట్టం 74 మీటర్లు కాగా 73.35 మీటర్ల నీరు చేరింది. ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉండగా, 15 గేట్లను పూర్తిగా ఎత్తి 1.03 లక్షల క్యూసెక్కుల చొప్పున వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు జలాశయం గరిష్ట సామర్థ్యం 6.1 మీటర్లు కాగా 5.9 మీటర్ల నీరు చేరింది. 1 గేటు ఎత్తి 2,820 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. మంత్రి తుమ్మల సమీక్ష.. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షం కారణంగా జరిగిన నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువుకట్టల విషయమై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బూర్గంపాడు మండలంలో బస్సు వాగులో పడిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. -
ఇలా వచ్చి.. అలా ఆగాయి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి నిరాశపరచడం, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. జూన్ ఆరంభంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు మొదలైనా.. ప్రస్తుతం నిలిచిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 9.17 టీఎంసీల నీరే చేరడం, ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో దిగువ ప్రాజెక్టుల కింద సాగు ప్రశ్నార్థకం కానుంది. చుక్క ప్రవాహం లేదు: జూన్ తొలివారంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలొచ్చాయి. రోజుకి 10 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టులో నీటి లభ్యత పెరుగుతుందని భావించారు. కానీ కొత్త నీరు 3.99 టీఎంసీలే వచ్చింది. ప్రస్తుతం చుక్క ప్రవాహం కూడా లేదు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.25 టీఎంసీల లభ్యతే ఉంది. సింగూరులోకి సైతం తొలుత ప్రవాహాలొచ్చినా ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 0.93 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.76 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 18.9 టీఎంసీల లభ్యత ఉంది. ఇక నిజాంసాగర్‌లోకి ఇంతవరకు చుక్క నీరు రాలేదు. కడెంలోకి 1.48 టీఎంసీలు, ఎల్లంపల్లిలోకి 1.36 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకి కొంత మేర ప్రవాహాలున్నా మునుపటితో పోలిస్తే తగ్గాయి. కృష్ణా బేసిన్లో తొలివారంలో జూరాలకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగడంతో ప్రాజెక్టులోకి కొత్తగా 2.41 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరుంది. కానీ సాగర్, శ్రీశైలంలోకి కొత్త నీరు రాలేదు. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లోకి 9.17 టీఎంసీల నీరే వచ్చింది. ఆల్మట్టి నిండితేనే దిగువకు.. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో ఒక్క తుంగభద్రకే ఆశాజనక ప్రవాహాలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 23 రోజుల వ్యవధిలో 23.08 టీఎంసీల మేర కొత్త నీరొచ్చింది. దీంతో ప్రాజెక్టులో 100 టీఎంసీకు గానూ 26.21 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయి. శనివారం కూడా ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. నారాయణపూర్‌లో వారం కిందటి వరకు ప్రవాహాలు కొనసాగినా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24 టీఎంసీల మేర లభ్యత ఉంది. అతి ముఖ్యమైన ఆల్మట్టిలోకి ఇంతవరకు పెద్ద ప్రవాహాలే లేవు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 22.88 టీఎంసీల నీరే ఉంది. ఆల్మట్టి నిండితేనే దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలవుతాయి. -
జూరాల.. పారాల!
- ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల మేర వరద - మరో 50 టీఎంసీలు చేరితే జూరాలకు ప్రవాహాలు మొదలు - నారాయణపూర్‌కూ భారీ ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: వానమ్మ కరుణించింది. కృష్ణమ్మ పరవశించింది. ఎగువన వాన వెల్లువైంది. దిగువన ఉన్న ప్రాజెక్టులకు వరద వచ్చే వేళ అయింది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో గడిచిన వారం రోజులుగా వానలు జోరుగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది విశ్వరూపం చూపుతోంది. అక్కడి ప్రధాన ప్రాజెక్టు కోయినా డ్యామ్‌తోపాటు ఇతర చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో కర్ణాటకకు భారీగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో గడిచిన 4 రోజులుగా 40 నుంచి 50 వేల క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి ప్రవాహాలుండగా, అవి ఆదివారానికి ఏకంగా 1.30 లక్షల క్యూసెక్కులకు చేరింది. రోజుకు ఏకంగా 12 టీఎంసీల మేర నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 78.91 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నారాయణపూర్‌కు వదిలేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌కు 30,966 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్య ముండగా ప్రస్తుతం 26.61 టీఎంసీలకు చేరింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీల మేర నిల్వలు పెరిగితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరదే మరిన్ని రోజులు కొనసాగితే 5 రోజుల్లోనే జూరాలకు నీటి ప్రవా హం మొదలయ్యే అవకాశముం ది. ఇక తుంగభద్రకు కూడా ఇన్‌ఫ్లో పెరిగింది. రెండ్రోజుల కిం దటి వరకు 20 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు నమోదు కాగా, ప్రస్తుతం అక్కడ 51,162 క్యూసె క్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో 100 టీఎంసీలకుగానూ అక్కడ 26.61 టీఎంసీల నిల్వలున్నాయి. ఆత్రుతగా దిగువ ప్రాజెక్టులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రవాహాలకు నోచుకోని రాష్ట్ర ప్రాజెక్టులు నీటి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రాజెక్టులకు కేవలం 10 టీఎంసీల మేర నీరు వచ్చింది. మరో 390 టీఎంసీల మేర నీరు వస్తే కానీ ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. శ్రీశైలంలో 215 టీఎంసీలగానూ కేవలం 19 టీఎంసీల నీరే నిల్వ ఉండగా, సాగర్‌లో 312 టీఎంసీలకు 117 టీఎంసీల నీరే ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల నిల్వల్లో వినియోగార్హమైన నీరు 2 టీఎంసీలకు మించి ఉండదు. ఇక జూరాలలో 9.6 టీఎంసీలకుగానూ 6.8 టీఎంసీ నిల్వ ఉండగా, ఈ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలని ఇప్పటికే డిమాండ్లు పెరిగాయి. అయితే, ఎగువ ప్రవాహాలు మొదలైతే కానీ నీటి విడుదలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. -
ఆల్మట్టికి రోజుకు 6 టీఎంసీలు
60 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి నీటి ప్రవాహాలు పుంజుకున్నాయి. గురువారం నాటికి రోజుకు 6 టీఎంసీల చొప్పున 64 వేల క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టు మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 129 టీఎంసీలకు గాను 58.6 టీఎంసీలకు చేరింది. ప్రవాహాలు పెరగడంతో 27,720 క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్‌కు 10,735 క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండటంతో అక్కడ 37.64 టీఎంసీల నిల్వకు 15.87 టీఎంసీల నిల్వ ఉంది. ఇక తుంగభద్రకు సైతం ప్రవాహాలు పెరిగాయి. దీనికి 15,464 క్యూసెక్కుల మేర నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 15 రోజుల తర్వాత దిగువ జూరాలకు ప్రవాహాలు మొదలయ్యే అవకాశముంది. -
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు - రాకపోకలు బంద్
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని సైదాపురం మండల శివారులోని రెండు ఏర్లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మార్గాల్లో మంగళవారం ఉదయం నుంచి రాకపోకలు స్తంభించాయి. సైదాపురం-గూడూరు మధ్య ఉన్న కమాన్‌గెనివాగు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సైదాపురం- మార్కాపురం మార్గంలోని మాలేరు వాగు పొంగడంతో ఈ మార్గాంలో కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. సైదాపురంలో సోమవారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
ప్రభుత్వ భూములు, కాల్వలు ఆక్రమిస్తే చర్యలు మంత్రి మహేందర్‌రెడ్డి
ఆదిబట్ల: ప్రభుత్వ భూములను, కాల్వలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మం డల పరిధిలోని మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని కుమ్మరికుంటపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక తహసీల్దార్ లేకపోవడంతో అక్కడే ఉన్న ఆర్ఐ బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారు. మంత్రి తహసీల్దార్‌తోపాటు ఆర్డీవోను సంఘటన స్థలానికి పిలిపించారు. రెవెన్యూ అధికారులు శనివారం నిర్మాణాలను కూల్చివేస్తుండగా మధ్యలో మంత్రి పేషీ నుంచి ఫోన్ వచ్చిందని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వచ్చిన వార్తలో వాస్తవం లేదని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి భూమిని రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా చూపుతుండగా, ఇరిగేషన్ అధికారులు మాత్రం కుంట ఉన్నట్లు చూపుతున్నారు. ఏది వాస్తవం అనే విషయం తెలుసుకోవడానికి వచ్చినట్లు మంత్రి వివరించారు. మొత్తం 6 ఎకరాల 9 గుంటల భూమిని పట్టా భూమి అని రెవెన్యూ అధికారులు మంత్రికి తెలిపారు. కాగా ఇరిగేషన్ అధికారులు కుంట ఉందని పత్రాల్లో పేర్కొన్నారు. రెండు శాఖల సమన్వయ లేమితో సమస్యలు వస్తాయన్నారు. తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో యాదగిరిరెడ్డిని వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూమి అయితే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలి.. తప్పుడు వార్తలు రాసిన సదరు పత్రికపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒకవేళ రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లుయితే బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తామని మంత్రి తెలిపారు. చేతిలో కలం ఉంది కదా అని ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని ఓ విలేకరికి మంత్రి సూచించారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులను నీటితో నింపి రైతన్నల బాధలను దూరం చేసేందుకు తీవ్రంగా కృషిచేస్తుందని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ నారాయణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, యాచారం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతినాయక్, రాందాస్‌పల్లి, మంగల్‌పల్లి, తుర్కగూడ, గ్రామాల సర్పంచ్‌లు ఏనుగుశ్రీనివాస్‌రెడ్డి, కందాళ ప్రభాకర్‌రెడ్డి, కిలుకత్తి అశోక్‌గౌడ్, ఎంపీటీసీలు కొప్పు జంగయ్య, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పడిన చోటే మళ్లీ గండి..
పెద్దవూర: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం తుంగతుర్తి ఊరచెరువుకు గండి పడింది. ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడం, ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తి ఊర చెరువు నిండిపోయింది. గురువారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి పైనుంచి వరద ఎక్కువగా రావడంతో ఒత్తిడికి కట్టకు గండిపడింది. దీనికింద సాగవుతున్న 250 ఎకరాలలో పంటలు నీటిలో మునిగిపోయాయి. తుంగతుర్తి- అల్వాల తండా రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గూనలు మాత్రమే మిగిలాయి. తుంగతుర్తి- చింతపల్లి రోడ్డు సైతం అర కిలోమీటర్ మేర నీటిలో మునిగిపోయింది. తుంగతుర్తి-చింతపల్లి, అల్వాలతండా, చలకుర్తి, చింతపల్లి-అల్వాల రోడ్లు దెబ్బతినడంతో ఆయా గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం వేకువజామున పొలాల్లోకి వెళ్లిన రైతులు చుట్టూ నీరు చేరడంతో మధ్యాహ్నం వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. మళ్లీ అక్కడే.. గత యేడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తుంగతుర్తి చెరువుకు గండి పడింది. దీనిని రూ.4లక్షల ఎఫ్డీఆర్ (ఫ్లడ్ డ్యామేజీ రిఫైర్) నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇసుక నింపిన బస్తాలను గండికి అడ్డంగా వేసి మట్టితో కట్టపోశారు. వరద ఉధృతికి అదేచోట మళ్లీ గండి పడింది. దీంతో నీరంతా వెళ్లి చెరువు ఖాళీ అయ్యింది. గత ఏడాదీ.. ఇదే పరిస్థితి ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, లోలెవల్ వరద కాలువలకు నీటిని విడుదల చేయడం, చెరువులోనూ నీళ్లు ఉండడంతో తుంగతుర్తి రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి విత్తనాలు, వరినాట్లు వేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో గత యేడాది ఇదే చెరువుకు గండి పడటంతో తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. పొలాలలో ఇసుక మేటలు వేశాయి. దీంతో వేల రూపాయలు పెట్టి ఇసుక మేటలను తొలగించి మళ్లీ వరినాట్లు వేశారు. ఇంతలోనే ప్రకృతి శాపమో, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మళ్లీ పొలాలలో ఇసుక మేటలు వేసే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగిన డైవర్షన్ రోడ్డు.. కనగల్ : కురంపల్లి-దోరెపల్లి ప్రధాన రహదారిలోని రేగట్టె వాగులో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గురువారం రాత్రి వరద ఉధృతికి తెగింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నూతనంగా బ్రిడ్డి నిర్మిస్తున్నందున ప్రయాణికుల సౌకర్యార్థం వాగులో ప్రత్యామ్నాయ మట్టిరోడ్డును నిర్మించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురువడంతో వాగులో వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది. గూనలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. దీంతో చండూరు తదితర ప్రాంతాలతోపాటు పరిసర గ్రామాలైన కురంపల్లి, శాబ్దులాపురం, రేగట్టెలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కుండపోత
సాక్షి,గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులు నీట మునిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జిల్లాలోని మేడికొండూరులో అత్యధికంగా 20.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడులో 16.02, ఫిరంగిపురం 15.80, యడ్లపాడు 14 , గుంటూరు 9.22, పెదకూరపాడులో 8.29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏడు సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది. జిల్లాలో అధిక శాతం పైర్లు వరద నీట మునిగాయి. దాదాపు నెల రోజుల కిందట వేసిన పైర్లు కావడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, వెయ్యి హెక్టార్లలోపు పైర్లు మాత్రమే నీట మునిగి దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తాడికొండ మండలం లాం వద్ద కొండవీటివాగు పొంగి పొర్లడంతో చప్టాపై నుంచి భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో అందులో ఓ గుర్తుతెలియని మహిళ గల్లంతైంది. ఆమెను రక్షించేందుకు షేక్‌బాజీ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కంతేరు వద్ద ఎర్రవాగు లో ఎం.వాసుదేవరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. నల్లపాడు-పేరేచర్ల మధ్య వరద నీటి ఉధృతికి రైల్వే ట్రాక్ కట్ట కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో ఉన్నాయి. ఆ సమయంలో వస్తున్న హుబ్లీ ప్యాసింజర్ డ్రైవర్ గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మేడికొండూరులో చప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గుంటూరు - మాచర్ల రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెదకూరపాడు గ్రామంలో పిడుగుపడి అంకమ్మతల్లి దేవాలయం పాక్షికంగా దెబ్బతింది. చినమక్కెన వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నరసరావుపేట పట్టణం ఎస్ఆర్కేటీ కాలనీతోపాటు పలు కాలనీల్లోకి నీరు రావడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చిలకలూరిపేట పట్టణంలో దాదాపు అన్ని కాలనీలు జలమయమయ్యాయి. గడియారస్తంభం సెంటర్లో షాపులు నీట మునిగి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఓగేరు, కుప్పగంజి, నక్క వాగులు పొంగి పొర్లుతున్నాయి. {పత్తిపాడులో చిన్న చెరువు పొంగి కాలనీలు జలమయమయ్యాయి. కోయవారిపాలెం కొండవాగు పొంగి ఎస్సీ కాలనీని ముంచెత్తింది. గొట్టిపాడులో నక్కవాగు పొంగి రాకపోకలు స్తంభించాయి. చిలకలూరిపేట మండలం మురికిపూడి కొత్తచెరువుకు గండి పడి వందల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పసుమర్రు -అనంతవరం మార్గంలో రాకపోకలు స్తంభిం చాయి. అలాగే యడ్లపాడు- ఫిరంగిపురం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నరసరావుపేట తహశీల్దారు కార్యాలయం పైకప్పు వర్షానికి నాని పెచ్చులూడి కిందపడడంతో కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి. మేడికొండూరు మండలం కొర్రపాడులో మంచినీటి చెరువు పొంగడంతో గ్రామం జలమయమైంది. -
ముంచెత్తిన వాన
పిడుగురాళ్ల, కర్లపాలెం: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నారుు. వర్షపు నీరు భారీగా చేరటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారుు. బుధవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సెప్టెంబర్ నెల సగటు వర్షపాతం 14.54 సెం.మీ. కాగా ఇప్పటివరకు 6.99 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం అత్యధికంగా పిట్టలవానిపాలెం మండలంలో 11.92 సెంటీమీటర్ల వర్షం పడింది. పిడుగురాళ్ల బుగ్గవాగులో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో పిల్లుట్ల రోడ్డు కోతకు గురైంది. సాయంత్రం వరకు రోడ్డు చప్టాపై మోకాలి లోతున నీరు ప్రవహించటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్లపాలెం మండలంలోని వందలాది ఎకరాల్లో వరిపైరు నీట మునిగింది. కాలువలకు గండ్లు పడటంతో పేరలిపాడు, తుమ్మలపల్లి నర్రావారిపాలెం, కట్టావాద, పేరలి, పెదగొల్లపాలెం, పేరలి కొత్తపాలెం, చింతాయ పాలెం, సమ్మెటవారి పాలెం గ్రామాల పరిధిలోని వరి పైర్లు నీటమునిగాయి. వర్షం ఇంతటితో ఆగితే పంటకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. పిట్టలవానిపాలెంలో 11.92 సెం.మీ వర్షం కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో బుధవారం ఉదయం వరకు అత్యధికంగా పిట్టలవానిపాలెం మండలంలో 11.92 సెంటీమీటర్లు, అత్యల్పంగా తాడేపల్లి మండలంలో 0.96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 3.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సెప్టెంబర్ నెలలో 14.54 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సిఉండగా, ఇప్పటి వరకు 6.99 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... కర్లపాలెం మండలంలో 9.86 సెం.మీ, మేడికొండూరు 8.06, నగరం 7.50, నిజాంపట్నం 7.04, పొన్నూరు 6.06, అమరావతి 6.02, అచ్చంపేట 5.78, రాజుపాలెం 5.62, అమృతలూరు 5.24, చెరుకుపల్లి 5.16, బెల్లంకొండ 5.12, నకరికల్లు 4.84, వినుకొండ 4.78, బాపట్ల 4.74, దాచేపల్లి 4.72, పిడుగురాళ్ళ 4.54, మాచర్ల 4.42, క్రోసూరు 4.40, పెదకూరపాడు 4.26, గురజాల 4.24, దుర్గి 4.02, సత్తెనపల్లి 3.94, భట్టిప్రోలు 3.94, కారంపూడి 3.84, రెంటచింతల 3.74, యడ్లపాడు 3.38, కొల్లిపర 3.36, ఫిరంగిపురం 3.22, తెనాలి 3.22, ముప్పాళ్ల 3.14, వట్టిచెరుకూరు 3.12, వేమూరు 3.06, రేపల్లే 3.06, తుళ్ళూరు 3.04, చేబ్రోలు 3.02, చిలకలూరిపేట 2.84, ప్రత్తిపాడు 2.80, శావల్యాపురం 2.80, రొంపిచర్ల 2.62, మాచవరం 2.56, కొల్లూరు 2.48, నరసరావుపేట 2.40, బొల్లాపల్లి 2.36, ఈపూరు 2.22, గుంటూరు 2.20, నాదెండ్ల 2.14, నూజెండ్ల 2.04, కాకుమాను 2.00, పెదనందిపాడు 1.98, దుగ్గిరాల 1.92, తాడికొండ 1.82, వెల్దుర్తి 1.42, పెదకాకాని 1.18, చుండూరు 1.18, మంగళగిరి మండలంలో 1.04 సెంటీమీటర్ల వర్షం పడింది. -
ఆగని వాన.. అపార నష్టం
కర్నూలు (అగ్రికల్చర్) : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి రోజూ సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాత్రి 8 గంటల వరకు వర్షం కురుస్తోంది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, మంత్రాలయం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పైర్లు నీటమునిగాయి. ఉల్లి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కోడుమూరు, సి.బెళగల్, గూడూరు, పెద్దకడుబూరు తదితర మండలాల్లో 15 రోజులుగా ఉల్లిని తవ్వుతున్నారు. వేలాది ఎకరాల్లో తవ్విన ఉల్లి వర్షపు నీటికి తడిసిపోయింది. ఆరబెట్టుకునేందుకూ వీలులేకుండా వాతావరణం చల్లబడింది. ఆదోనిలో మంగళవారం కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోకి నీరు చేరింది. దీంతో పత్తి బేళ్లు తడిసిపోయాయి. రుద్రవరం మండలం డీ కొట్టాల వద్ద తెలుగుగంగ కాలువ బ్లాక్ చానల్‌కు గండిపడింది. దీంతో నీరు వృథాగా పోతోంది. మంగళవారం కోవెలకుంట్ల సమీపంలోని తాగు నీటిపథకం ఫిల్టర్ బావులను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ విజయమోహన్ బురదలోనే నడిచారు. వాహనాలు పోవడానికి వీలులేకపోవడంతో ఆయన కారుదిగి నడుచుకుంటూపోయి.. ఫిల్టర్ బావులను పరిశీలించారు. జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి నాలుగు రోజుల్లో సగటున 53.3 మి.మీ వర్షపాతం నమోదైంది. సోమవారం రాత్రి అత్యధికంగా ఉయ్యాలవాడలో 45.6 మి.మీ వర్షం కురిసింది. శిరువెళ్లలో 43.6, నందవరంలో 40.2, రుద్రవరంలో 38.0, కొత్తపల్లిలో 37.2 మి.మీ ప్రకారం వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ కాగా, మొదటి పక్షంలో 76.4 మి.మీ(61 శాతం) వర్షపాతం నమోదు కావడం గమనార్హం. -
వరుణుడి ఉగ్రరూపం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరదలు జనజీవనం అస్తవ్యస్తం స్తంభించిన వాహన సంచారం పాఠశాలలు, కాలేజీలకు సెలవు శివమొగ్గ : జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. కుండపోతతో జిల్లా అతలాకుతలమైంది. ఎగతెరపిలేని వానలతో చెరువులు, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతుండటంతో అపారనష్టం జరుగుతోంది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వానలతో ముందు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని తాలూకాల్లోని పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ విపుల్‌బన్సల్ ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహ ప్రాంతాలతో పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుంగానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. తీర్థహళ్లి తాలూకా మండగద్దె గ్రామంలోని పక్షిదామ కేంద్రం నదిలో మునిగిపోయింది. మండగద్దె గ్రామం పక్కన వెళ్లే జాతీయ రహదారి శివమొగ్గ-మంగళూరు 13 రహదారిపై మూడు అడుగుల మేర తుంగానది నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. హొసనగర తాలూకాలో వర్షం భారీగా కురుస్తుండగంతో అపార పంటనష్టం ఏర్పడింది. తాలూకాలోని కల్లూరు బీదరళ్లి వంతెన మునిగిపోయింది. దీంతో ఆ ప్రాంత వాసులకు బాహ్యప్రపంచంతో సంబందాలు తెగిపోయాయి. అంతేగాక హెద్దారిపు, అమృత గ్రామపంచాయతీ పరిధిలోని తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగింది. ఈ ప్రాంతాలను జిల్లా పంచాయతీ అధ్యక్షుడు కలగోడు రత్నాకర్, జెడ్పీ సీఈఓ శ్రీకాంత్సెందిల్ శుక్రవారం పరిశీలించారు. సాగర తాలూకా తాళగుప్ప మండలం బీసనగద్దె గ్రామం పూర్తిగా జలమయమై ద్వీపంలా మారింది. ఆ గ్రామ ప్రజలు సంచరించడానికి తాలూకా యంత్రాంగం తెప్పలను ఏర్పాటు చేసింది. వరదానది వరదల కారణంగా తాళగుప్ప, మండలం, కణస, తడగళలె, మండగళలెచ తట్టికుప్ప గ్రామాల వ్యవసాయ భూములు పూర్తిగా జలమయం అయ్యాయి. ఉద్రిగ్రామంలో ఓ చెరువు తెగిపోయింది. శివమొగ్గ, భద్రావతి నగరాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. గాజనూరు జలాశయం నుంచి అధిక స్థాయిలో నీటిని విడుదల చేస్తుండటంతో శివమొగ్గ నగరం ఆనుకుని ప్రవహిస్తున్న తుంగానది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. లింగమనక్కి జలాశయంలోకి భారీ నీరు.. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రముఖ జలాశయాల్లో ఇన్‌ప్లో పెరిగింది. లింగమన క్కి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 85,526 క్యూసెక్కులుగా ఉంది. గరిష్ట నీటిమట్టం 1819 అడుగులు కాగా, ప్రస్తుతం 1797.35 అడుగుల మేరా నీరుంది. ఒకే రోజులో జలాశయంలోకి సుమారు మూడన్నర అడుగుల మేర నీరు చేరింది. భద్రా జలాశయంలోకి 35,670 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1561 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జలాశయ గరిష్ట నీటిమట్టం 186 అడుగులు కాగా, ప్రస్తుతం 177.30 అడుగుల మేర నీరుంది. తుంగా జలాశయంలోకి 72,856 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అంతేస్థాయి నీటిని దిగువన ఉన్న హొస్పేట తుంగభద్రా డ్యాంకు వదిలేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా ప్రస్తుతం 584.04 అడుగుల మేర నీరుంది. ఇన్‌ఫ్లో 14,445 క్యూసెక్కులుగా ఉంది.