పెద్దవూర: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు నిండి అలుగులు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం తుంగతుర్తి ఊరచెరువుకు గండి పడింది. ఏఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడం, ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తుంగతుర్తి ఊర చెరువు నిండిపోయింది. గురువారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షానికి పైనుంచి వరద ఎక్కువగా రావడంతో ఒత్తిడికి కట్టకు గండిపడింది. దీనికింద సాగవుతున్న 250 ఎకరాలలో పంటలు నీటిలో మునిగిపోయాయి.
తుంగతుర్తి- అల్వాల తండా రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గూనలు మాత్రమే మిగిలాయి. తుంగతుర్తి- చింతపల్లి రోడ్డు సైతం అర కిలోమీటర్ మేర నీటిలో మునిగిపోయింది. తుంగతుర్తి-చింతపల్లి, అల్వాలతండా, చలకుర్తి, చింతపల్లి-అల్వాల రోడ్లు దెబ్బతినడంతో ఆయా గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం వేకువజామున పొలాల్లోకి వెళ్లిన రైతులు చుట్టూ నీరు చేరడంతో మధ్యాహ్నం వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది.
మళ్లీ అక్కడే..
గత యేడాది అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు తుంగతుర్తి చెరువుకు గండి పడింది. దీనిని రూ.4లక్షల ఎఫ్‌డీఆర్ (ఫ్లడ్ డ్యామేజీ రిఫైర్) నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇసుక నింపిన బస్తాలను గండికి అడ్డంగా వేసి మట్టితో కట్టపోశారు. వరద ఉధృతికి అదేచోట మళ్లీ గండి పడింది. దీంతో నీరంతా వెళ్లి చెరువు ఖాళీ అయ్యింది.
గత ఏడాదీ.. ఇదే పరిస్థితి
ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, లోలెవల్ వరద కాలువలకు నీటిని విడుదల చేయడం, చెరువులోనూ నీళ్లు ఉండడంతో తుంగతుర్తి రైతులు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పత్తి విత్తనాలు, వరినాట్లు వేశారు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో గత యేడాది ఇదే చెరువుకు గండి పడటంతో తీరా పంట చేతికి వచ్చే సమయంలో పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. పొలాలలో ఇసుక మేటలు వేశాయి. దీంతో వేల రూపాయలు పెట్టి ఇసుక మేటలను తొలగించి మళ్లీ వరినాట్లు వేశారు. ఇంతలోనే ప్రకృతి శాపమో, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మళ్లీ పొలాలలో ఇసుక మేటలు వేసే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెగిన డైవర్షన్ రోడ్డు..
కనగల్ : కురంపల్లి-దోరెపల్లి ప్రధాన రహదారిలోని రేగట్టె వాగులో ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు గురువారం రాత్రి వరద ఉధృతికి తెగింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నూతనంగా బ్రిడ్డి నిర్మిస్తున్నందున ప్రయాణికుల సౌకర్యార్థం వాగులో ప్రత్యామ్నాయ మట్టిరోడ్డును నిర్మించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురువడంతో వాగులో వరద ఉధృతికి రోడ్డు తెగిపోయింది. గూనలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. దీంతో చండూరు తదితర ప్రాంతాలతోపాటు పరిసర గ్రామాలైన కురంపల్లి, శాబ్దులాపురం, రేగట్టెలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పడిన చోటే మళ్లీ గండి..
Published Sat, Sep 20 2014 3:04 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement