వానలే.. వానలు | State struck with heavy rains | Sakshi
Sakshi News home page

వానలే.. వానలు

Published Sat, Sep 24 2016 4:57 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

వానలే.. వానలు - Sakshi

వానలే.. వానలు

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం
- నిండుతున్న ప్రాజెక్టులు.. నిండుకుండల్లా చెరువులు
- ఉరకలెత్తుతున్న వాగులు, వంకలు   పలుచోట్ల స్తంభించిన రవాణా
- వేలాది ఎకరాల్లో పంట మునక   
- మెదక్ జిల్లాలో నలుగురు మృతి
- నిజామాబాద్‌లో తల్లీకొడుకులు, వరంగల్‌లో మరొకరు గల్లంతు
- ఘణపురం ఆనకట్ట పరిశీలించి వస్తూ నీటిలో చిక్కుకుపోయిన మంత్రి హరీశ్, డిప్యూటీ స్పీకర్ పద్మ.. ప్రత్యేక బస్సు ద్వారా తీసుకొచ్చిన వైనం
 
 సాక్షి, నెట్‌వర్క్: ప్రాజెక్టులు నిండుతున్నాయి.. చెరువులన్నీ నిండు కుండల్లా మారాయి.. వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి.. జిల్లాలన్నీ తడిసిముద్దవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అనేకచోట్ల వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. రహదారులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు కూలాయి. పట్టణ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మెదక్ జిల్లాలో ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. 20 ఏళ్ల తర్వాత మంజీర నది ఏడు పాయల వద్ద దుర్గమ్మ పాదాలను తాకింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఏడుపాయల వద్ద మంజీరకు హారతి, పసుపు కుంకుమలు సమర్పించారు. ఘణపురం ఆనకట్టను పరిశీలించారు. అనంతరం తిరిగి మెదక్ వస్తుండగా హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డి పసుపులేరుకు ఆవల చిక్కుకుపోయారు. దీంతో ప్రత్యేక బస్సులో వారిని ఏరు దాటించాల్సి వచ్చింది.

 మెదక్.. రాకపోకలు బంద్
 మెదక్ జిల్లాలో చెరువులు, కుంటలు, రోడ్లు తెగిపోరుు రాకపోకలు స్తంభించారుు. జిల్లాలో అత్యధికంగా చిన్న శంకరంపేటలో  21.1 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. మెదక్‌లోని గోల్కొండ వీధిలో గుడిసెలో నిద్రిస్తున్న వారిపై పక్కనే ఉన్న పాడుపడిన ఇల్లు పడడంతో అస్తర్‌గల్ల కళావతి(35), ఆమె కూతురు తులసి భార్గవి(8) అక్కడికక్కడే మరణించారు. సదాశివపేట మండలం ముబారక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి శాంతమ్మ(60) అనే వృద్ధురాలు మృతి చెందింది. మెదక్‌కు చెందిన నారుుని స్వామి(52) అల్లవాగులో మునిగి దుర్మరణం చెందాడు.  హత్నూర మండలం పల్పనూర్  శివారులో పెద్ద చెరువు వాగులో ఇన్నోవా కారు వరదలో చిక్కుకుపోరుుంది. అందులోని వ్యక్తులు కారును వదిలేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన నర్సన్నపేట, ఎర్రవల్లి   మధ్య రోడ్డు తెగిపోరుుంది. ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మ, ఆమె భర్త దేవేందర్‌రెడ్డితో కలసి 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఘణపురం పొంగితే 101 టెంకాయలు కొడతానని నాలుగేళ్ల కిందట వనదుర్గకు మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు.

 నల్లగొండ.. ‘జల’గొండ
 నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది. భువనగిరి నుంచి సూర్యాపేట వరకు పెద్ద ఎత్తున చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. ప్రధాన జలాశయాలన్నీ జలకళతో నిండుకుండను తలపిస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. కేతేపల్లి మూసీ ప్రాజెక్టులో 9 గేట్లను ఎత్తి 45 వేల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. ఉదయసముద్రం, పెద్దదేవులపల్లి రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. రోడ్లు, చెరువులు, కుంటలు తెగిపోవడంతో జిల్లాలోని దాదాపు 10 మండలాల్లోని పలు గ్రామాల నడుమ రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాలతో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు. 285 ఇళ్లు కూలిపోయాయి. 320 మూగజీవాలు చనిపోయాయి.

 వరంగల్.. కుండపోత
 కుండపోత వర్షాలకు వరంగల్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. దాదాపు 12 మండలాల్లో 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. అత్యధికంగా ధర్మసాగర్ మండలంలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 56 చెరువులకు గండ్లు పడ్డారుు. 17 ఇళ్లు పూర్తిగా, 168 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నారుు. సుమారు 6 వేల మందిని 17 పునరావాస కేంద్రాలకు తరలించారు. నర్సంపేట మండలం మాదన్నపేటకు చెందిన కృష్ణ అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి వరదలో గల్లంతయ్యాడు.

 రంగారెడ్డి.. అతలాకుతలం..
 రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. వాగులు ఉరకలెత్తుతున్నాయి. చేవెళ్ల, మొరుునాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, నవాబుపేట మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నారుు. మూసీవాగు ఉధృతికి చేవెళ్ల- శంకర్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయారుు. ఇబ్రహీంపట్నం మండలంలో 11 ఇళ్లు కూలిపోయాయి. మంచాల మండలం లోయపల్లిలో మొండికుంటవాగు, దర్మారుు చెరువు నీరు రోడ్డుపైకి వచ్చింది. ఆ నీటి ఉధృతికి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనున్న వాగులోకి వెళ్లి దిగబడింది. జేసీబీతో దానిని బయటకు లాగారు. బషీరాబాద్ మండలంలో సుమారు 2,500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నారుు. పెద్దేముల్ మండలం మన్ సాన్ పల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాండూరు- హైదరాబాద్ మధ్య రాకపోకలు స్తంభించారుు. కీసర మండలం యాద్గార్‌పల్లి చౌరస్తా వద్ద గల వాగులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది.

 మహబూబ్‌నగర్.. నీటమునిగిన పంటలు
 మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం తలకొండపల్లి, కొడంగల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూర్ మండలంలో 26 ఇళ్లు కూలిపోయాయి. చాలాచోట్ల పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. ఆము దానికి తెగుళ్లు సోకుతున్నా యి. మరికొన్నిచోట్ల ఉల్లి భూమిలోనే మొలకెత్తుతోంది. చేతికొచ్చిన పంట నీట మునిగింది.
 
 కరీంనగర్.. పొంగుతున్న చెరువులు
 కరీంనగర్ జిల్లాలో కరువుతో అల్లాడిన మెట్ట ప్రాంతాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరించున్నాయి. హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండడంతో నాలుగు గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి నీటిని వదిలారు. శనిగరం ప్రాజెక్టు నిండి మత్తడి దూకుతోంది. మోయతుమ్మద వాగు పొంగడంతో కోహెడ మండలం బస్వాపూర్  వద్ద హుస్నాబాద్-సిద్దిపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం గల ఎల్‌ఎండీలో ప్రస్తుతం ఆరు టీఎంసీలు ఉండగా  భారీగా నీరు వచ్చి చేరుతోంది. 32 అడుగుల సామర్థ్యమున్న ఎగువ మానేరులో 24 అడుగుల వరకు నీరు చేరింది. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు 16 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. కరీంనగర్-సిరిసిల్ల రూట్‌లో వెళ్లే వాహనాలను బోరుునపల్లి మీదుగా దారి మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముస్తాబాద్‌లోని వెంకట్రావ్‌పల్లిలో వరద ఉధృతితో సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి.
 
 ఖమ్మం..లోతట్టు ప్రాంతాలు జలమయం
 ఖమ్మంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఖమ్మం నగరంతో పాటు ఇల్లెందు, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు మునిగిపోయారుు. చెరువులు, వాగులు అలుగు పోస్తున్నారుు. ఇల్లెందు నియోజకవర్గంలో మూడు ఇళ్లు కూలిపోయారుు. ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వరండా కూలింది. ఖమ్మం నగరంలో మున్నేరులోకి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. బయ్యారం పెద్ద చెరువు అలుగుపారుతోంది. కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వర్షపు నీరు వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 406 అడుగులకు చేరుకుంది. రెండు గేట్లు ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
 

 నిజామాబాద్.. పొంగుతున్న వాగులు, వంకలు
 నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో 85 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. కౌలాస్‌నాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో బిచ్కుంద మండలం పెద్దతొక్కడ్, చిన్నతొక్కడ్ పల్లి, దేవడ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జుక్కల్ మండలంలో నల్లవాగు ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. భిక్కనూరు మండలంలో ఆరేళ్ల తర్వాత ఎడ్లకట్టవాగు ప్రవహించింది. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. వేల్పూర్ మండలం పడకల్ వద్ద లో లెవల్ వంతెనను దాటే ప్రయత్నంలో వరద ఉధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు గల్లంతయ్యారు. కుటుంబంలోని మిగతావారు క్షేమంగా బయటపడ్డారు. కోటగిరి మండలంలో 8, వర్ని మండలంలో 7 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. బాన్సువాడలో 640 హెక్టార్లలో సోయా పంట దెబ్బతింది. బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, గాంధారి ప్రాంతాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు. దీంతో జిల్లాలోని కందకుర్తి వద్ద నదిలోని శివాలయం మునిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1081.70 అడుగులకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement